మూర్తీభవించిన తెలుగువాడి ఆత్మగౌరవం

ABN , First Publish Date - 2022-01-18T07:45:19+05:30 IST

ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని హస్తినాధీశులు అపహాస్యం చేస్తున్న వేళ, తెలుగుజాతిని ఉద్ధరించడానికి ఉద్భవించిన కాంతిపుంజం నందమూరి తారక రామారావు...

మూర్తీభవించిన తెలుగువాడి ఆత్మగౌరవం

ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని హస్తినాధీశులు అపహాస్యం చేస్తున్న వేళ, తెలుగుజాతిని ఉద్ధరించడానికి ఉద్భవించిన కాంతిపుంజం నందమూరి తారక రామారావు. తెలుగుఖ్యాతిని విశ్వవీధుల వెలుగెత్తిన తెలుగుతేజం, ప్రపంచ తెలుగు వారందరికీ గుర్తింపు తెచ్చిన శౌర్యం ఎన్‌టిఆర్. 26 ఏళ్ల క్రితం స్వర్గస్తులయిన ఆయన ప్రజాశ్రేయోభిలాషి, జన హృదయవాసి.


యుగయుగాల నుంచి కాలగమనంలో సామ్యవాదాన్ని సమాధి చేసి లోకకంటకులు రాజ్యమేలినప్పుడు ఆయా యుగాలలో అరాచకాన్ని అణచివేసి సమాజాన్ని సముద్ధరించేందుకు యుగపురుషులు అవతరిస్తారు. అలా ప్రజల కన్నీళ్ళు తుడిచి, వారి కష్టాలను రూపుమాపి, న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించి ప్రజా హృదయాలలో చిరస్థాయిగా కొలువైన యుగపురుషుడు ఎన్‌టిఆర్. ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా, నిరంకుశంగా సుదీర్ఘకాలం పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి తప్ప మరొక పార్టీకి అధికారం లభించే అవకాశమే లేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికార దర్పంతో ఆ పార్టీ ప్రజాశ్రేయస్సును పూర్తిగా విస్మరించింది. పర్యవసానంగా ఆకలి, దారిద్య్రం, అవినీతి, దోపిడి, ఆశ్రిత పక్షపాతం విలయతాండవం చేశాయి. కరువు కాటకాలతో రాష్ట్రం అథోగతి పాలైంది. తమ బాధలు పట్టించుకునే నాథుడే కరువైనవేళ తమను రక్షించే వారెవరా అని వేయికళ్ళతో ప్రజలు వేచి చూస్తున్న సమయాన 1982లో ఎన్‌టిఆర్ రాజకీయ రంగప్రవేశం చేశారు. 1983 జనవరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార పగ్గాలు కైవశం చేసుకుంది. నాటి ఢిల్లీ పాలకులు కన్నుమూసి తెరిచే లోపల ఈ పరిణామాల పరంపర అత్యంత వేగంగా సంభవించింది. కష్టాల కడలిలో, గాఢాంధకారంలో, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుజాతి వదనంలో ఓ ఆనందం వెల్లివిరిసింది.


ఎన్టీఆర్‌ అధికార పీఠం అధిరోహించిన తక్షణమే పేదలకు ‘కూడు---.. గూడు-.. గుడ్డ’ కల్పించే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు’ అని నినదించి, వారి అభ్యున్నతి కోసం తుదివరకు పోరాడిన ప్రజానాయకుడు ఆయన. ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతావస్త్రాలు, రైతులకు 50 రూపాయలకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ తదితర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను, జీవన ప్రమాణాలను మెరుగుపర్చిన మానవతావాది ఎన్‌టిఆర్.


పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రామారావు సంచలనం సృష్టించారు. వెనుకబడిన తరగతుల ప్రజానీకానికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, తరతరాలుగా అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయిన పేదలను అందలమెక్కించిన ఆదర్శ నాయకుడాయన. ప్రభుత్వమనేది ప్రజాసేవ కోసమేనని, ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఎదురు చూడరాదని మండలి వ్యవస్థను ఏర్పాటు చేసిన పరిపాలనాదక్షుడు. అన్నదాతల అభ్యున్నతి కోసం కర్షక పరిషత్‌ నెలకొల్పిన రైతుభాంధవుడు. ప్రజాస్వామ్య పటిష్టత కోసం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన రాజకీయ సంస్కరణశీలి ఎన్‌టిఆర్.


తెలుగుభాష, సంస్కృతులకు పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తెలుగు భాషా వికాసానికి అవిరళకృషి చేసిన మహనీయుడు. ఆడపడుచులకు ఆస్తిహక్కు కల్పించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. మహిళల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం కల్పించిన నవయుగ వైతాళికుడు ఎన్‌టిఆర్. బడుగు, బలహీన, అణగారిన వర్గాలు, కార్మిక, కర్షక, మైనారిటీ సోదరుల సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాలలో అపార అవకాశాలు కల్పించిన సామాజిక సంస్కర్త, మహోన్నత నాయకుడాయన.


ఎన్ని చరిత్రలు వెతికినా ఎన్‌టిఆర్ లాంటి మహనీయుడు కనపడరు. ఆయనను ప్రతి తెలుగువాడు తన గుండెల్లో నింపుకుంటే, ప్రతి పేదవాడు తన ఇంట్లో ఫోటో పెట్టి పూజించుకుంటాడు. మావంటి వారికి ఆయనో మార్గదర్శి. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేం. నేటి యువత అటువంటి మహానీయుడిని ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధన కోసం కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆ మహానుభావుడికి వినమ్రతతో అంజలి ఘటిస్తూ.. ఘన నివాళి అర్పిస్తున్నాను.

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి

(నేడు నందమూరి తారక రామారావు వర్ధంతి)

Updated Date - 2022-01-18T07:45:19+05:30 IST