మురుగునీరే గతి!

ABN , First Publish Date - 2021-11-25T06:35:59+05:30 IST

మురుగునీరే గతి!

మురుగునీరే గతి!
నున్నలో శాండ్‌ ఫిల్టర్‌ పాయింట్‌

 నున్నలో ఫిల్టర్‌ బడ్‌లు డెడ్‌  

 ట్యాంకులకు మురికి నీరు సరఫరా  

 తాగలేమంటున్న  గ్రామస్తులు  

పట్టించుకోని అధికారులు

విజయవాడ రూరల్‌, నవంబరు 24 : నున్నలో ఫిల్టర్‌ బెడ్‌లు డెడ్‌ అయ్యాయి. పక్షం రోజులుగా స్థానికులు ఫిల్టర్‌కాని నీటిని తాగాల్సిన పరిస్థితి తలెత్తింది. నున్నలో ఇసుకతో ఫిల్టర్‌ చేసిన నీటిని పంచాయతీ అధికారులు ప్రజలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలలుగా శాండ్‌ ఫిల్టరేషన్‌ విధానం చేయకపోవడం, చెరువుల్లోని నీటిని నేరుగా మినీ ట్యాంకులకు సరఫరా చేస్తుండటంతో తాగునీరు వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు శాండ్‌ ఫిల్టర్‌ బెడ్‌కు నీటిని సరఫరా చేసే సంప్‌లు మురికిగా తయారుకావడం, అడుగున పాకుడు పట్టడం, నాచు పెరగడం, అదే నీటిని ట్యాంకుల నుంచి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నున్నలో రెండు తాగునీటి చెరువులుండగా, వాటిని కృష్ణా నీటితోపాటు గోదావరి నీటితోనూ నింపుతున్నారు. నున్న మీదగా ప్రవహించే పోలవరం కాల్వ నుంచి ప్రత్యేకంగా పైపులైను ద్వారా చెరువులకు గోదావరి జలాలను పెడుతున్నారు. అయితే, కొద్ది రోజులుగా కాల్వ ప్రవహం లేకపోవడం, నిల్వ ఉన్న నీటినే చెరువుల్లోకి పెడుతుండటం, ఆ నీరు ఫిల్టర్‌ కాకపోవడం వల్లే సమస్య తలెత్తుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా, ఫిల్టర్‌ బెడ్‌లకు అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల కూడా సమస్య తలెత్తిందని చెబుతున్నారు. శాండ్‌తో ఫిల్టర్‌ చేసిన నీటిని పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 22 మినీ ట్యాంకులకు సరఫరా చేస్తారు. అక్కడ నుంచే స్థానికులు మంచినీటిని తీసుకువెళ్లాల్సి ఉంది. కొద్ది రోజులుగా తాగునీరు వాసన వస్తుండటంతో తాగలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. తక్షణమే ఫిల్టర్‌ బెడ్‌లను బాగు చేయించడంతోపాటు ఇసుకను తెప్పించి మంచినీటిని ఫిల్టర్‌ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-25T06:35:59+05:30 IST