పాశ్వాన్ పార్టీలో ముసలం

Jun 16 2021 @ 01:02AM

దేశంలో ఇప్పుడు ఏ మూల ఏ రాజకీయ అలజడి కనిపించినా అందరి దృష్టి అటే వెడుతున్నది. కర్ణాటకలో ఎడ్యూరప్ప కష్టాలు అయినా, ఉత్తరప్రదేశ్‌లో యోగిపై వస్తున్న వదంతులైనా, పంజాబ్‌లో అకాలీదళ్, బిఎస్‌పి కొత్త స్నేహం అయినా ఆ పరిణామాలు జాతీయ సమీకరణాల్లో మార్పును సూచిస్తున్నాయేమోనన్న కుతూహలం పెరుగుతోంది. తెలంగాణలో అధికారపార్టీ ప్రముఖుడు బిజెపిలోకి కలవడం కానీ, కశ్మీర్‌లో ఆలయ నిర్మాణం పనికి బిజెపి నేతతో కలసి వైసీపీకి చెందిన టీటీడీ చైర్మన్ వెళ్లడం కానీ, ఉద్ధవ్ ఠాక్రే ఏకాంతంగా మోదీతో మాట్లాడడం కానీ, శరద్ పవార్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం కానీ ఏ పరమార్థమూ లేని సంఘటనలని ఎవరూ భావించరు. అట్లాగే, తాజాగా బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీలో పుట్టిన ముసలం అంతరార్థం ఏమిటా అన్న విచికిత్స కూడా రాజకీయవర్గాలలో కలుగుతున్నది. 


గత సంవత్సరం కన్నుమూసిన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ దీర్ఘ అస్వస్థులుగా ఉన్న కాలంలోనే ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ సారథ్యాన్ని చేపట్టారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని నిర్ణయాలనూ చిరాగ్ పాశ్వానే తీసుకున్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా పోటీ చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో పాటు, బిజెపి అభ్యర్థులున్న స్థానాలను వదిలిపెట్టి కేవలం యునైటెడ్ జనతాదళ్ అభ్యర్థుల మీదనే పోటీ చేయాలని చిరాగ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జెడి(యు) నాయకుడు నితిశ్ కుమార్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బిజెపి అగ్రనేత అమిత్ షా, చిరాగ్‌తో కలసి చేసిన చాణక్యం అది అని పత్రికలు అప్పట్లో రాశాయి. ఆ వ్యూహం ఫలించి, ఓట్లు చీలిపోయి, నితిశ్ కుమార్ పార్టీ బలం కేవలం 43 స్థానాలతో కూటమిలో ద్వితీయస్థానానికి పడిపోయింది. అట్లాగని,  లోక్ జనశక్తి పార్టీ పెద్దగా లాభపడింది లేదు. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోగలిగింది.


సినిమాలను వదిలి రాజకీయాలలోకి వచ్చిన చిరాగ్ 2014 లోనే లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పాశ్వాన్‌తో పాటు మరో ఐదుగురు లోక్ జనశక్తి నుంచి ఎన్నికయ్యారు. ఆ ఐదుగురిలో రామ్ విలాస్ పాశ్వాన్ ప్రియ సోదరుడు పశుపతి కుమార్ పారస్ కూడా ఉన్నారు. ఈ పశుపతి, తక్కిన నలుగురిని కూడగట్టి, చిరాగ్‌పై తాజాగా తిరుగుబాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ దగ్గరకు వెళ్లి, మేం ఐదుగురం ఒకటి, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి అని అడిగారు. తిరుగుబాటు ఎంపిలు అయిదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చిరాగ్ పాశ్వాన్, చిరాగ్‌ను   అధ్యక్ష పదవినుంచి తొలగిస్తున్నట్టు పారస్ ప్రకటనలు చేశారు. వీటి పర్యవసానాలేమిటో ఇంకా తెలియదు. 


ఆనాడు చిరాగ్ తనకు వ్యతిరేకంగా పనిచేసినందుకు, ఇప్పుడు నితిశ్ ప్రతీకారం తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నితిశ్‌కు రాజకీయ వ్యూహకర్త అయిన లల్లన్ అనే అతని ద్వారా పారస్‌ను తనవైపునకు తిప్పుకున్నట్టు చెబుతున్నారు. పారస్, మరి నలుగురు ఎంపీలు ఐక్య జనతాదళ్‌కు పూర్తిగా మద్దతుగా ఉన్నారు. వారు లోక్  జనశక్తికి చెందిన గ్రూపుగా ఉంటారో, తమ వర్గాన్ని జెడి(యు)లో విలీనం చేస్తారో చూడవలసి ఉన్నది. అదే కనుక జరిగితే, లోక్‌సభలో జెడియు బలం, బిజెపి బలాన్ని మించిపోతుంది. ప్రస్తుతం బిహార్ నుంచి బిజెపికి 17 మంది ఎంపిలు ఉండగా, జెడియుకు 16 మంది ఉన్నారు. ఒకవేళ జెడి(యు) బలం పెరిగితే, నితిశ్ కుమార్ ప్రతిష్ఠలో మార్పు వస్తుంది. కూటమిలో తాము 75 అసెంబ్లీ స్థానాలతో ప్రథమస్థానంలో ఉన్నప్పటికీ, ముందు ఇచ్చిన మాట ప్రకారం 43 స్థానాల పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి వచ్చిందని బిజెపి చెప్పుకుంటోంది. ఎంత కాదన్నా, అది నితిశ్‌కు అవమానకరమైన పరిస్థితే. ఇప్పుడు లోక్ సభలో అయినా ఆధిక్యం పొందడం ద్వారా తన గౌరవం పెరుగుతుంది.


నితిశ్ కుమార్‌కు రామ్ విలాస్ పాశ్వాన్‌కు వైరం ఎప్పటినుంచో ఉన్నది. బిహార్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగివచ్చిన ఏకైక దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్. జయప్రకాశ్ నారాయణ్‌ ప్రేరణతో రాజకీయాలలోకి వచ్చిన పాశ్వాన్‌కు నేషనల్ ఫ్రంట్ హయాం దగ్గర నుంచి ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. తరువాత కాలంలో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. వివిధ కూటముల మధ్య పోటీని ఆస్కారం చేసుకుని, తన సొంత పార్టీకి ప్రాబల్యం తెచ్చుకునే ప్రయత్నం చేశారు. 2005 అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీకి గణనీయమైన సీట్లు సంపాదించి, హంగ్ అసెంబ్లీకి కారణమయ్యారు. నితిశ్‌కు అప్పటినుంచి పాశ్వాన్‌పై అసహనం మొదలయింది. ఇటీవలి సంవత్సరాలలో పాశ్వాన్ ఓటు బ్యాంకు అయిన వివిధ దళిత కులాలలో చీలిక తెచ్చే ప్రయత్నం నితిశ్ చేశారు. ఈ  సంప్రదాయ వైరం నేపథ్యంలో, కేంద్రంలో ఎన్‌డిఎ భాగస్వామిగా ఎల్‌జె పిని బిహార్‌లో స్వతంత్రంగా పోటీచేసేట్లు బిజెపి అగ్రనేతలు వ్యూహరచన చేశారు. తాత్కాలిక ఫలితం ఇచ్చిన ఆ వ్యూహానికి పూర్తి విరుగుడు మంత్రాన్ని నితిశ్ ప్రస్తుతం ప్రయోగిస్తున్నట్టు భావించవచ్చు.


కొంతకాలం పొత్తు నుంచి వైదొలగి, తిరిగి కూటమిలో చేరిన నితిశ్‌పై బిజెపికి అనుమానంగానే ఉన్నది. క్రమంగా జనాదరణ కోల్పోతున్న బిజెపిపై నితిశ్‌కు కూడా సందేహంగానే ఉన్నది. ఇద్దరూ కొత్త మిత్రులను వెదుక్కునే ప్రయత్నం చేస్తున్నారేమో తెలియదు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న తేజస్వి యాదవ్ పార్టీ బిజెపితో మైత్రికి సిద్ధపడే అవకాశం లేదు. 2015లో చేసినట్టు, నితిశ్ పార్టీ, తేజస్వి పార్టీతో కలిసే అవకాశాన్ని తోసిపుచ్చలేము. 2025 దాకా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందా, లేక మధ్యలో మార్పులు జరుగుతాయా లేక, 2024 నాటి జాతీయ   ఎన్నికలకు బిహార్ కొత్త ఫలితాలను ఇస్తుందా? అన్నవి ఆసక్తి కలిగించే ప్రశ్నలు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.