మూసీ నాలా పూడికతీత పనుల్లో జాప్యం

ABN , First Publish Date - 2021-03-01T05:53:56+05:30 IST

మూసీ నాలా పూడికతీత పనుల్లో జాప్యం నెలకొంది. దీంతో నాలాలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

మూసీ నాలా పూడికతీత పనుల్లో జాప్యం
చెత్తాచెదారంతో నిండిన మూసీనాలా

  పేరుకుపోయిన చెత్తాచెదారం 

 దుర్వాసనతో అనారోగ్యం 

  పట్టించుకోని అధికారులు

రామంతాపూర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మూసీ నాలా పూడికతీత పనుల్లో జాప్యం నెలకొంది. దీంతో నాలాలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. 

రామంతాపూర్‌ రాంరెడ్డినగర్‌ నుంచి దేవేందర్‌నగర్‌ వరకు గల మూసీ పరివాహక నాలా పూడికతీత పనుల్లో జాప్యం నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ సర్కిల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్‌  ఇష్టానుసారంగా పూడికతీత పనులు చేయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాలాలో  చెత్తాచెదారం, మట్టి, మురుగునీరు చేరి కంపు కొడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి నాలాలో చేరుతున్న మురుగుతో పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధాన్ని భరించలేక అనారోగ్యం బారిన పడుతున్నారు. దోమలు విజృంభిస్తుండడంతో కంటి మీద కునుకు ఉండడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా పూడికతీత పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

దుర్గంధంతో అవస్థలు

మూసీ పరివాహక నాలా చెత్తాచెదారం, జంతుకళేబరాలతో నిండి పూడికతీతకు నోచుకోకపోవడంతో తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. దీంతో నాలా పరిసర ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నాలా వెంబడి కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా దోమలు వృద్ధ్ది చెంది చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.   

 - ఆదినారాయణగౌడ్‌, రామంతాపూర్‌ 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జాప్యం 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మూసీ నాలా పూడికతీత పనులలో జాప్యం నెలకొంది. ఎన్నికలు ముగిసిన వెంటనే నాలా శుద్ధ్ది పనులను ప్రారంభిస్తాం 

- నాగేందర్‌నాయక్‌, ఈఈ, ఉప్పల్‌ సర్కిల్‌   


Updated Date - 2021-03-01T05:53:56+05:30 IST