Flood: మూసీ నది ఉగ్రరూపం... హైఅలర్ట్ జారీ

ABN , First Publish Date - 2022-07-27T14:57:30+05:30 IST

భారీ వరద ప్రవాహంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది.

Flood: మూసీ నది ఉగ్రరూపం... హైఅలర్ట్ జారీ

హైదరాబాద్‌: భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మూసారంబాగ్‌, చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.  



జంట జలాశయాలకు వరద ఉధృతి...

భాగ్యనగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి అధికంగా ఉంది. ఉస్మాన్ సాగర్‌లోకి 8000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ అవుట్ ఫ్లో  8281 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ నుంచి 13 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1789.10 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్‌కు 9000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్‌సాగర్ 8 గేట్ల ద్వారా మూసీలోకి 10700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు గాను...  ప్రస్తుతం నీటిమట్టం 1762.45 అడుగులకు చేరింది. 

Updated Date - 2022-07-27T14:57:30+05:30 IST