ఉపవాస దీక్షలపై నిషేధం

ABN , First Publish Date - 2022-04-09T16:35:44+05:30 IST

ముస్లిం విద్యార్థులు ఉపవాస దీక్షలు చేయకూడదని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టడం

ఉపవాస దీక్షలపై నిషేధం

                     - తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన


పెరంబూర్‌(చెన్నై): ముస్లిం విద్యార్థులు ఉపవాస దీక్షలు చేయకూడదని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టడం కలకలం రేపింది. కృష్ణగిరి జిల్లా వెప్పన్‌హల్లి సమీపం కోరల్‌నత్తం గ్రామంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 172 విద్యార్థినులు, 342 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 130 మంది విద్యార్థినులు, 256 మంది విద్యార్థులు ముస్లిం మతానికి చెందిన వారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఎం.కళావతి సహా ఎనిమిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో పలువురు ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ నేపధ్యలో, విద్యార్థులు ఉపవాసం ఉంటే పోషకవిలువలు తగ్గి స్పృహ కోల్పోయే అవకాశముందని తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు, ఉపవాసదీక్ష చేపట్టిన విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనుమతి లేఖ తీసుకొని రావాలన్నారు. అదే సమయంలో పీఈటీ కేఎస్‌ సెంథిల్‌కుమార్‌, గణితం టీచర్‌ శంకర్‌, ఇస్లాం మతం గురించి అవహేళన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలుపడంతో వారు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న గురుపరపల్లి ఎస్‌ఐ అన్బుమణి పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకారులతో చర్చించి సమాధానపరిచారు. ఈ నేపధ్యంలో, టీచర్లు సెంథిల్‌కుమార్‌, శంకర్‌లను ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తూ, ఈ వ్యవహారంపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి మహేహ్వరి ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-04-09T16:35:44+05:30 IST