‘రైలు పట్టాలపై పడి ఉన్న శవాన్ని తిప్పి చూశాం.. చేతులు కట్టేసి ఉన్నాయి.. నా తమ్ముడిది ఆత్మహత్య కాదు..’

ABN , First Publish Date - 2021-10-07T13:31:05+05:30 IST

అది.. సెప్టెంబరు 28, సాయంత్రం 8.30... 31 ఏళ్ల సమీర్ పరేశ్వరికి...

‘రైలు పట్టాలపై పడి ఉన్న శవాన్ని తిప్పి చూశాం.. చేతులు కట్టేసి ఉన్నాయి.. నా తమ్ముడిది ఆత్మహత్య కాదు..’

బెలగావి(కర్నాటక): అది.. సెప్టెంబరు 28, సాయంత్రం 8.30... 31 ఏళ్ల సమీర్ పరేశ్వరికి అతని అంటీ నజిమా మొహమ్మద్ షేక్ కాల్ చేశారు.... తన కుమారుడు అర్బాజ్ అప్తాబ్(24) బెలగావి దగ్గరలోని ఖానాపూర్ లోగల రాజా టైల్స్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడని రైల్వే పోలీసులు తనకు ఫోన్ చేసి చెప్పారని ఆమె తెలిపారు. దీంతో బెలగావిలో నివసిస్తున్న సమీర్ వెంటనే తన తల్లిని తీసుకుని, తన అత్త ఇంటికి ఖానాపూర్‌కు వెళ్లాడు. తరువాత రైలు పట్టాలపై ఛిద్రమైన అతని కజిన్ అర్బాజ్ మృతదేహాన్ని చూశాడు. అర్బాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు మొదట భావించారు. ఆ తరువాత అర్బాజ్ మృతదేహాన్ని పరిశీలనగా చూసి షాక్‌ అయ్యారు. 


అర్బాజ్ హత్యకు గురై ఉండవచ్చనే అనుమానం వారిలో తలెత్తింది. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. "అతని తెగిపోయిన తల ట్రాక్ మీద పడి ఉంది, మొండెం ట్రాక్ కింద పడి ఉంది. పోలీసులు ఆత్మహత్య అని చెప్పినప్పుడు.. మేము కూడా అదే అనుకున్నాం. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అర్బాజ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లబోతున్నారు. అప్పుడు అతని చేతులు తాడుతో కట్టివేసి ఉండటంతో మాకు అనేక అనుమానాలు తలెత్తాయని సమీర్ తెలిపారు. దీంతో మేమంతా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు. అయితే వారు మృతదేహానికి ఫొటోలు తీయవద్దన్నారు. అయినా కూడా తాము ఫొటోలు తీశామన్నారు. ఇవి అతను హత్యకు గురయ్యాడనడానికి బలమైన రుజువును అందిస్తాయని నమ్ముతున్నామన్నారు. తమకు హిందూత్వ సంస్థ అయిన శ్రీరామ సేనకు చెందిన ప్రమోద్ ముతాలిక్‌పై అనుమానాలున్నాయన్నారు. 


అర్బాజ్‌కు ఒక హిందూ యువతితో రెండేళ్లుగా సంబంధం ఉంది. ఈ జంటను విడదీయాలని పలువురు ప్రయత్నించారు. దీనిని లెక్కచేయకుండా వారిద్దరూ రహస్యంగా ఒకరినొకరు కలుసుకుంటూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 26 న, అర్బాజ్, అతని తల్లి నజిమాలను శ్రీ రామ సేన సభ్యులు పిలిపించారు. అర్బాజ్‌... ఆ హిందూ యువతిని కలుసుకోకూడదని ఆదేశించారని తెలిపారు. కాగా అర్బాజ్ చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీరామ సేన సభ్యులు అర్బాజ్ నుంచి ఫోనును లాక్కొని దానిలో.. అర్బాజ్, ఆ హిందూ యువతి ఉన్న ఫోటోలను తొలగించి, ఫోనును పగులగొట్టారు. తరువాత అర్బాజ్‌ను రూ. 7,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అర్బాజ్ దగ్గర రూ. 500 మాత్రమే ఉంది. 


అర్బాజ్ కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ సేన సభ్యులు రూ. 90 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో అర్బాజ్ తన పాత కారును సెప్టెంబర్ 27న అమ్మేశాడు. కాగా అర్బాజ్ మృతిపై బెలగావి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ రామ సేన హిందుస్థాన్ సభ్యులను విచారించారు. అయినా ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. అంతేకాదు పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇంకా రాలేదు. ఈ రిపోర్టు రావడానికి ఏడు రోజులు పడుతుందా? ఇటువంటి పరిస్థితిలో మాకు ఎవరు సహాయం చేస్తారు? అని సమీర్ అధికారులను ప్రశ్నిస్తున్నాడు.

Updated Date - 2021-10-07T13:31:05+05:30 IST