ప్రొద్దుటూరులో ఉద్రిక్తత..

Published: Tue, 28 Jun 2022 00:40:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత..దర్గాచెట్టు గోడను ఎక్సకవేటర్‌తోకూల్చుతున్న మున్సిపల్‌ అధికారులు

దర్గాచెట్టు కూల్చివేతపై ముస్లింల ఆగ్రహం

కూల్చివేతకు వ్యతిరేకంగా  వైసీపీ ముస్లిం కౌన్సిలర్ల ఆందోళనలు, అరెస్టులు

వన్‌టౌన్‌ స్టేషన్లో ఉదయం నుంచి బైఠాయింపు

వైసీపీలోని అసమ్మతి నేతలంతా ఒక్కటై మద్దతు

పోలీసులపై ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆగ్రహం

చర్చలకొచ్చిన ఎమ్మెల్యేపై ముస్లింల ప్రశ్నల వర్షం

కమిషనర్‌, డీఎస్పీల బదిలీలకు పట్టు 

బేషరతు క్షమాపణలకు ఎమ్మెల్యే అంగీకారం

ప్రొద్దుటూరు (అర్బన్‌/క్రైం), జూన్‌27: ప్రొద్దుటూరులో బీజేపీ తరహా బుల్‌డోజర్ల రాజ్యం నడుస్తోందని అధికార వైసీపీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లు ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు ప్రకటించారు. సోమవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని గవిని సర్కిల్‌ నుంచి ఎర్రగుంట్ల సర్కిల్‌ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కమిషనర్‌ రమణయ్య,డీఎస్పీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో దర్గా చెట్టు గోడను కూల్చివేశారు. దీంతో ప్రొద్దుటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఈ కూల్చివేతకు ముందే ప్రతిపక్ష టీడీపీకి చెందిన మైనారిటీ నేత ముక్తియార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉక్కు ప్రవీణ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

కూల్చివేత సందర్భంలో ఆ వార్డు(22) వైసీపీ కౌన్సిలర్‌ వైఎస్‌ మహమ్మద్‌ గౌస్‌ ఎక్సకవేటర్‌కు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా, ముస్లిం మతపెద్దలతో చర్చించకుండాదర్గాచెట్లను కూల్చివేస్తే ముస్లింల మనోభావాలను దెబ్బతీసీనట్లే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. కౌన్సిలర్‌ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేసి ఒన్‌టౌన్‌కు తరలించి దర్గాచెట్టును కూల్చివేశారు. పట్టణమంతా ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో అధికార వైసీపీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లు వైఎస్‌ చైర్మన్‌ ఖాజా, మునీర్‌, కంకరగౌస్‌, ఇర్ఫాన్‌బాషాతో సహా మాజీ టీడీపీ వైస్‌ చైర్మెన్‌ జబివుల్లాలు ఒన్‌ టౌన్‌కు వెళ్లి కౌన్సిలర్‌ మహ్మద్‌ గౌస్‌ ను పరామర్శించారు. అక్కడి నుంచి అతనితో సహా ముస్లింలు పెద్ద ఎత్తున కూల్చిన దర్గాచెట్ల వద్దకు వెళ్లి బైఠాయించారు. మున్సిపల్‌ కమిషనర్‌, డీఎస్పీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నదా బీజేపీ బుల్‌ డోజర్ల ప్రభుత్వం నడుస్తున్నదా అని విమర్శించారు. ఒక సందర్భంలో కొందరు ముస్లిం యువకులు ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతికిరేకంగా నినాదాలు చేశారు. కేవలం అధికారపార్టీ నేత కడుతున్న భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోసమే ముస్లిం మసీదు ఆస్తులు విధ్వంసం చేస్తూ రోడ్డు విస్తరణ చేపడుతున్నారని ఆగ్రహించారు. ముస్లింలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి విషమిస్తుందని వైసీపీ ముస్లిం మైనారిటీ కౌన్సిలర్లందనీ పోలీసులు బలవంతంగాఅరెస్టు చేసి వ్యాన్లలో ఎక్కించి చాపాడు, రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. వీరితో పాటు టీడీపీ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని సైతం పోలీసులు తరలించారు. దీనిపై కౌన్సిల్లర్లు ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఫోన్‌లో విషయం అంతా తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ కూడా జరిగిన ఘటనపై ఆరా తీశారు. అప్పటికి ఆయన చిత్తూరులో ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎంపీ ఆదేశాల మేరకు పోలీసులు రాజుపాళెం పోలీసు స్టేషన్‌ బయటే వ్యాను నుంచి దింపి వొదిలేశారు. 


ఒన్‌టౌన్‌ పోలీస్టేషన్లో బైఠాయింపు

రాజుపాళెం నుంచి నేరుగా ప్రొద్దుటూరు ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషనుకు వచ్చి తిరిగి ముస్లిం కౌన్సిలర్లంతా బైఠాయించారు. ముస్లింల దర్గాలను కూల్చడమే కాకుండా తమను అక్రమంగా అరెస్టు చేయడంపై వారు నిరసన చేపట్టారు. ఈ నిరసనతో మళ్లీ ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తంగా మారింది. వైసీపీలోని అసమ్మతి నేతలు సర్పంచ్‌ శివచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గురివిరెడ్డి వారికి మద్దతు తెలిపారు.


ఇద్దరు నాయకులతోనే పాలన అస్తవ్యస్తం

ప్రొద్దుటూరులో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతలతోనే పాలన అస్తవ్యస్తంగా మారిందని వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పరోక్షంగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారురెడ్డి పై విమర్శలు చేశారు.


ఒన్‌టౌన్‌కు చేరిన ఎమ్మెల్యే రాచమల్లు

స్టేషన్‌ వద్ద ఆందోళన తీవ్రతరమవుతుండటం, తనపై విమర్శల వెల్లువ రావడంతో నష్ట నివారణ చర్యలకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి ఒన్‌టౌన్‌ పోలీసుస్టేషనుకు వెళ్లారు. ఈ సందర్బంగా స్టేషన్‌ వద్దనే ఎమ్మెల్యే రాచమల్లుపై వైసీపీ మైనారిటీ కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. మేం అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మా మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేతలేంటని ప్రశ్నించారు. డీఎస్పీ, కమిషనర్‌ తీరుపై ఆగ్రహించారు. మాతో సంప్రదించకుండా ఏకపక్షంగా కూల్చివేతలేంటని ఆవేదన వ్యక్తంచేశారు. తామంతా మసీదుల్లోమాట్లాడుకుని రోడ్డుకు విస్తరణలో అడ్డం వచ్చిన దగ్గరికి తొలగించి అభివృద్ధికి సహకరిస్తామనుకుంటే, తమ వైపు ఆలోచనే చేయకుండా తమ మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా చేయడంపై ప్రశ్నించారు.

ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ చర్చించడానికి ఇది వేదిక కాదని మాఇంటికి రండి లేదంటే మీ ఇంటికి వెళ్లి కూర్చోని చర్చిస్తామని వారితో తెలిపి స్టేషన్‌ బయటికి వెళ్లారు.కానీ ఎమ్మెల్యే వెంటవెంటనే ఎవ్వరూ వెళ్లలేదు. కొందరు ఎమ్మెల్యేకు తెలియకుండా ఏదీ జరగదని ఆయనతో చర్చలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు తర్జనభర్జ పడ్డారు. మళ్లీ బయటనుండి ఎమ్మెల్యే లోనికి వచ్చే సరికి ఆయనతో అక్కడికి సమీపంలోని ముస్లిం మత పెద్ద ఇంటిలో చర్చలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిపై కోపగించుకున్నారు. మైనారిటీకు వ్యతిరేకంగా ఒక్క చర్యచేసివుంటే మీకాళ్లకింద దూరతానని, మీకోసం బీజేపీ టిప్పుసుల్తాన్‌ విగ్రహం కోసం పోరాడానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెంట కొద్ది మంది మాత్రమే చర్చలకు వెళ్లారు. మరికొందరు వడ్లదాదాపీర్‌, ఆయన కుమారుడు జిలాన్‌లు ఉదయం నుండి ఆందోళనలో పాల్గొనకుండా పక్కన ఉండి చర్చలకు ఎమ్మెల్యేతో పాటు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉంటే చర్చలకు రామని మళ్లీ ఒన్‌టౌన్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లారు. ఆ సందర్భంలో చిత్తూరు నుంచి వచ్చిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ వారిని పరామర్శించారు. కొద్దిసేపు చర్చించారు. అనంతరం వడ్లదాదాపీర్‌ను చర్చల ప్రాంతంనుంచి పోలీసులు బయటికి తీసుకెళ్లడంతో కౌన్సిలర్‌ మహ్మద్‌గౌస్‌ వర్గం చర్చలకు వెళ్లారు.


అదే ప్రదేశంలో దర్గా పునఃనిర్మాణానికి అంగీకారం

కూల్చిన దర్గాను పునః నిర్మాణం చేయాలని, కమిషనర్‌ రమణయ్య, డీఎస్పీ ప్రసాద్‌రావులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వారిని ఇద్దరినీ బదిలీ చేయాలని చర్చల్లో వైసీపీ ముస్లిం కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. ఇందుకు ఎమ్మెల్యే రాచమల్లు వారి తరుపున క్షమాపణలు చెపుతున్నా అన్నా అంగీకరించలేదు. దర్గాను తాను పునః నిర్మాణం చేస్తా అన్నా ఒప్పుకోలేదు. కచ్చితంగా అధికారులు ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దర్గాచెట్టును తామే నిర్మించుకుంటామని తెగేసి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో క్షమాపణలు చెప్పిస్తానని వెంటనే దర్గాచెట్టు పునఃనిర్మాణ పనులు చేపట్టుకోమని వారికి హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కరించకుంటే తాము రాజీనామాలకు సిద్ధమని కౌన్సిలర్లు చెప్పారు. ఈ చర్చల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ముస్లింలు మసీదుల నుంచి అక్కడికి చేరుకోవడం, ఒకవైపు ఎమ్మెల్యే అనుచరులు పలుగ్రామాలకు చెందిన వారు అక్కడికి చేరుకోవడంతోఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చర్చలు ముగిశాక ఎమ్మెల్యే రాచమల్లు కారులో అక్కడి నుంచి వెళ్లారు. ఆ సందర్భంలో కొందరు ఎమ్మెల్యే కారుపై దాడిచేయబోయినట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇంత జరుగుతున్నా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీదేవి కానీ, వైస్‌ చైర్మన్‌ బంగార్రెడ్డి కానీ అక్కడకు రాకపోవడం విశేషం.


జెండాచెట్టు కూల్చడం దుర్మార్గం

వైసీపీ కౌన్సిలర్లూ.. హైడ్రామా ఆడొద్దు

చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి రాజీనామా చేయండి

టీడీపీ నేతలు లింగారెడ్డి, ముక్తియార్‌

ముస్లిం పెద్దలతో సంప్రదించకుండానే దస్తగిరిస్వామి జెండాచెట్టును కూల్చివేయడం దుర్మార్గమని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ పేర్కొన్నారు. సోమవారం ముక్తియార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జెండాచెట్టు కూల్చివేత విషయం తెలిసి, తాము వెళ్లబోతే అడ్డుకున్న పోలీసులు, అక్కడ వైసీపీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ధర్నా చేస్తే ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇదంతా హైడ్రామాగా అభివర్ణిస్తూ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరంతా వైసీపీకి రాజీనామా చేసి వస్తే, జెండా చెట్టు తిరిగి ఏర్పాటులో టీడీపీ కూడా కలిసొస్తుందన్నారు. ముస్లింల ఆస్తులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆహంకార ధోరణితో వెళ్తున్నాడని, గతంలో ముస్లింలకు జీవనోపాధిగా ఉండిన కూరగాయల మార్కెట్‌ కూల్చేసి, తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసి, అందులో ఆడుగుల చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎర్రగుంట్ల రోడ్డులో గోల్డ్‌ప్లాజా నిర్మాణం కోసమే గవిని సర్కిల్‌ నుంచి బైపాస్‌ వరకు రోడ్డు విస్తరణ పనులకు సిద్ధమయ్యారని, ముస్లింలకు చెందిన జామీయా మసీదు ఆస్తులను కూల్చివేశారని అన్నారు. ఇపుడు  ముస్లింలు ప్రార్థనలు చేసే జెండాచెట్టును నిరంకుశంగా మున్సిపల్‌ అధికారులతో కూల్చివేయించారన్నారు. 24వ వార్డు టీడీపీ ఇన్చార్జి ఖలీల్‌బాషా మాట్లాడుతూ వైసీపీని గెలిపించినందుకు ముస్లింలకు తగ్గిన శాస్తి చేశారంటూ బూటుతో తనను కొట్టుకున్నారు. 

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత..ఒన్‌టౌన్‌లో బైఠాయించిన వైసీపీ కౌన్సిలర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.