భూ సమస్య లేకుండా చూడాలి: జేసీ

ABN , First Publish Date - 2021-12-04T05:21:23+05:30 IST

ప్రభుత్వ ప్రయారిటీ భవనాలకు భూ సమస్య లేకుండా చూడాలని జేసీ (రెవెన్యూ, రైతుభరోసా) రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

భూ సమస్య లేకుండా చూడాలి: జేసీ

కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3: ప్రభుత్వ ప్రయారిటీ భవనాలకు భూ సమస్య లేకుండా చూడాలని జేసీ (రెవెన్యూ, రైతుభరోసా) రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు, తహసీల్దార్‌లతో పీవోఎల్‌ఆర్‌, గడువు దాటి పరిష్కరించని స్పందన అర్జీలు, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలకు స్థల సమస్య ఉన్నట్లయితే ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి భూ సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రింట్‌ అయిన రేషన్‌కార్డులు అన్ని శనివారంలోపు లబ్ధిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల అర్జీలపై ప్రత్యేకదృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కోర్టు కేసుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించరాదన్నారు. కోర్టు ధిక్కార కేసులు నమోదు కాకుండా నోటీసులు అందినవెంటనే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుచేసి పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. కోర్టు కేసులను ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని, పిటిషనర్‌ వైపు నుంచి ఆలోచించాలని, ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంటే చేయాలని ప్రతి కేసు లోతుగా పరిశీలన చేయాలన్నారు. స్పందన అర్జీలను పెండింగ్‌ లేకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. బీయాండ్‌ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. ఓటీఎస్‌ ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు. అలాగే పీవోఎల్‌ఆర్‌ (ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) శాశ్వత భూహక్కు-భూరక్ష కార్యక్రమాన్ని అమలు చేయడానికి కార్యచరణ ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఆదోని డివిజన్‌లో ఆలూరు మండలం కాత్రికి గ్రామం, నంద్యాల డివిజన్‌ సంబంధించి నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామం, కర్నూలు డివిజన్‌ సంబంధించి కల్లూరు మండలం పందిపాడు గ్రామంపై మూడు గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద రీసర్వే కార్యక్రమం పూర్తి చేసి పైనల్‌ స్టేజ్‌కి తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, కేఆర్‌సీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:21:23+05:30 IST