గెలిచి తీరాలి!

ABN , First Publish Date - 2021-03-01T07:48:49+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి తీరాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.

గెలిచి తీరాలి!

  • ‘వరంగల్‌’లో గట్టి ప్రత్యర్థి లేరు!
  • అక్కడ బీజేపీ అభ్యర్థి బలహీనం
  • మిగిలిన వాళ్లూ పోటీ ఇవ్వలేరు
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా విజయం తథ్యం
  • అయినా తేలిగ్గా తీసుకోవడానికి లేదు
  • మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలవాలి
  • ‘అసెంబ్లీ’తో పోలిస్తే ఈ ఎన్నికలు భిన్నం
  • ప్రభుత్వం చేసిన పనులు వివరించండి
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌
  • ఈటలకు అందని ఆహ్వానం!
  • మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లో ఉండి.. ఆపై హుజూరాబాద్‌ వెళ్లిన మంత్రి
  • ఎమ్మెల్సీ పోరులో ప్రాధాన్యమివ్వని పార్టీ
  • మంత్రి గంగులకు ‘హైదరాబాద్‌’ బాధ్యత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి తీరాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండింటికి రెండు స్థానాల్లో విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో టీఆర్‌ఎ్‌సకు గట్టి ప్రత్యర్థి కూడా లేరని కేసీఆర్‌ అన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి చాలా బలహీనంగా ఉన్నారని, మిగిలిన అభ్యర్థులు ఎవరూ టీఆర్‌ఎ్‌సకు పోటీ ఇచ్చే స్థాయిలో లేరని చెప్పారు.


 పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానమైన మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్నందున.. ఆ పార్టీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని బరిలోకి దించడంతో పరిస్థితి టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా మారిందని చెప్పారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కేసీఆర్‌ నిర్దేశించారు. మన పద్ధతిలో మనం పనిచేసుకుంటూ వెళ్లాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సీరియ్‌సగా తీసుకొని పనిచేయాలని, క్షేత్ర స్థాయి కేడర్‌ను ప్రచారంలో భాగస్వాములను చేయాలని అన్నారు.


ఓటర్లకు చేరువ కావాలి

‘‘అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు. ఆ తేడాను గుర్తించండి. ఆ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడూ పనిచేస్తామంటే కుదురదు’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పట్టభద్రులైన ఓటర్లు పరిమితంగా ఉంటారని, వారిని ప్రత్యేకంగా పరిగణించి వ్యక్తిగతంగా చేరువ కావాలని సూచించారు. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. అదే సమయంలో విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొటాలన్నారు. ఇందుకు సోషల్‌మీడియాతోపాటు ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలను విరివిగా వినియోగించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ తరఫున నమోదు చేయించిన ప్రతి ఓటూ పార్టీ అభ్యర్థికే పడేలా చూసుకోవాలని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందాలని, ఈ దిశగా కార్యాచరణ రూపకల్పన, అమలు ఉండాలని అన్నారు. ‘వరంగల్‌’ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అన్నీ తామై బాధ్యతలు నిర్వర్తించాలని, నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా అందరూ బాగా పనిచేశారని, పోలింగ్‌కు 14 రోజులే ఉన్నందున మరింత చురుగ్గా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.


సాగర్‌ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండండి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేయడంతోపాటు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలను కేసీఆర్‌ ఆదేశించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నిక ప్రచారం చేపట్టాల్సి ఉంటుందన్నారు. సాగర్‌లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. అక్కడ తాజాగా చేయించిన సర్వేల ప్రకారం సిటింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ మంచి మెజారిటీతో నిలబెట్టుకోనున్నట్లు తేలిందన్నారు. కాంగ్రెస్‌ రెండు, బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. సాగర్‌ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేస్తున్న ప్రచారం.. ఉప ఎన్నికకూ ఉపయోగపడేలా చూసుకోవాలని అన్నారు.


Updated Date - 2021-03-01T07:48:49+05:30 IST