ముసురు

ABN , First Publish Date - 2021-07-22T04:31:46+05:30 IST

జిల్లాలో మూసేరిసింది. మంగళవారం రాత్రి నుంచి ముసురుతోకూడిన వర్షం అన్ని మండలాల్లో కురుస్తూనే ఉంది. పలు మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది.

ముసురు
అలుగు పారుతున్న కళ్యాణి రిజర్వాయర్‌

- జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం
- 38.6 మి.మీ వర్షపాతం నమోదు
- జలకళను సంతరించుకున్న కామారెడ్డి పెద్దచెరువు
- అలుగు దూకుతున్న కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌లు
- నిండుకున్న కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌
- రెండు గేట్ల ద్వారా 558 క్యూసెక్కుల నీటి విడుదల
- పోచారం ప్రాజెక్ట్‌లోకి 2 వేలకు పైగా క్యూసెక్కుల వరద

కామారెడ్డి, జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూసేరిసింది. మంగళవారం రాత్రి నుంచి ముసురుతోకూడిన వర్షం అన్ని మండలాల్లో కురుస్తూనే ఉంది. పలు మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది.  గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 38.6 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కామారెడ్డిలో 84.0 మి.మీ వర్షం కురువగా అత్యల్పంగా జుక్కల్‌లో 12.8 మి.మీ వర్షపాతం నమోదయింది. జిల్లాలోని 22 మండలాల్లో వర్షం కురువడంతో వాగులు, వంకలు చెరువులు పొంగి పొర్లుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం పొద్దంతా చిరుజల్లులతో ముసురుతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనాలు రోడ్లపైకి రాలేకపోయారు. సెలువు రోజు కావడం దీనికి మూసురు తోడు కావడంతో ప్రధాన మార్కెట్‌లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
జిల్లాలో 38.6 మి.మీ వర్షపాతం నమోదు
జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. 38.6 మి.మీ వర్షపాతం నమోదయింది. లింగంపేటలో 41.0మి.మీ., బాన్సువాడలో 32.4 మి.మీ., తాడ్వాయిలో 46.8 మి.మీ., పిట్లంలో 25.6 మి.మీ., గాంఽధారిలో 47.4మి.మీ., ఎల్లారెడ్డిలో 27.0 మి.మీ., సదాశివనగర్‌లో 38.2 మి.మీ., నాగిరెడ్డిపేటలో 30.8 మి.మీ., భిక్కనూర్‌లో 45.0 మి.మీ., బిచ్కుందలో 17.2 మి.మీ., నిజాంసాగర్‌లో 26.8 మి.మీ, జుక్కల్‌లో 12.8 మి.మీ, బీర్కూర్‌లో 38.2 మి.మీ, కామారెడ్డిలో 84.0 మి.మీ, మద్నూర్‌లో 39.0 మి.మీ, దోమకొండలో 64.4 మి.మీ, మాచారెడ్డిలో 39.4 మి.మీ.ల వర్షం కురిసింది. ఈ వర్షాకాలం సీజన్‌లో జిల్లాలో సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదయినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5405.4 మి.మీ.ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 10,018.1 మి.మీ. వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
జలకళను సంతరించుకుంటున్న చెరువులు
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు సైతం జలకళను సంతరించుకుంటున్నాయి. గత రెండు వారాలుగా జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో వాగుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలోని వాగులు, పాయల నుంచి వరద ప్రవాహం చెరువులోకి వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు నిండుకుంది. రేపోమాపో పెద్దచెరువు అలుగు దుంకనుంది.  ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌లు నిండుకోవడంతో అలుగు దూకి నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి వరద వెళ్తుంది. అదేవిధంగా మిగతా మండలాల్లోనూ చెరువులు నిండుకుంటున్నాయి. విస్తారంగా వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకోవడంతో ఆయా చెరువుల కింద రైతులు పంటలను సాగు చేస్తున్నారు.
నిండుతున్న ప్రాజెక్టులు
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నీటితో నిండుతున్నాయి. ప్రాజెక్టుల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు, పాయల నుంచి వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండుకోవడంతో గేట్లు ఎత్తి మంజీరాలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 568 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. 633 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.984 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2,805 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.799 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. 520 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

Updated Date - 2021-07-22T04:31:46+05:30 IST