ముసురు ముంచింది!

ABN , First Publish Date - 2021-11-27T05:03:05+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస వాయుగుండాల ప్రభావం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రత్యేకించి మెట్టపంటలు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇతర జిల్లాల్లో వలే వరదలు లేకపోయినప్పటికి ముసురుగా పది రోజులపాటు వీడకుండా కురిసిన వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ వర్షాలతో జిల్లాలో 1.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేయగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.450 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రధాన మెట్ట పంటలైన పత్తి, మినుము, మిర్చి, శనగకు అపార నష్టమే వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో తిరిగి ఆ భూముల్లో ఏం వేయాలో కూడా తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముసురు ముంచింది!
అద్దంకి మండలం చిన్నకొత్తపల్లిలో నీళ్ళ్లలోనే కుళ్లిపోయిన మినుము ఓదెలను తీస్తున్న రైతు

 దారుణంగా నష్టపోయిన మెట్టరైతు

జిల్లాలో రూ.450 కోట్లకుపైగా పంటనష్టం 

మినుము, శనగ, పత్తి, మిర్చిలకుభారీనష్టం

1.01లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు యంత్రాంగం గుర్తింపు 

వాటిని తొలగించి ఏం పంట వేయాలో తెలియని పరిస్థితి

ఒంగోలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

-పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో మొత్తం 3,200 ఎకరాల విస్తీర్ణం ఉండగా అందులో 2.5వేల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇప్పటివరకు ఎకరాకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. వర్షాలతో ఆ గ్రామంలో 1,800 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. 

-బల్లికురవ మండలం కొప్పెరపాలెంలో 350 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 250 ఎకరాలకుపైగా పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు రూ.40వేల వరకు ఖర్చు చేయగా పంట చేతికొచ్చే దశలో వర్షాలతో అంతా పోయింది.

-కందుకూరు మండలం కొండమురుసుపాలెంలో 350ఎకరాలకుపైగా మిర్చి సాగుచేయగా 80శాతం పంట దెబ్బతింది. అక్కడ ఎకరాకు రూ.60వేలకుపైనే ఖర్చుచేయగా మొత్తం నీటిలో పోసినట్లే అని రైతులు చెప్తున్నారు. 

-కందుకూరు పొగాకు వేలంకేంద్రాల పరిధిలో 3వేల ఎకరాల్లో తోటలు ఉరకెత్తిపోయాయి. ఒక్క వీవీపాలెం మండలం సింగరబొట్లపాలెంలో 700 ఎకరాలకుగాను 400 ఎకరాల్లో పొగాకు తోటలు దెబ్బతిన్నాయి. 

-రాచర్ల మండలం అనుమలవీడులో 1500 ఎకరాల్లో పత్తి, పొగాకు, మిర్చి, శనగ పంటలు సాగు చేయగా మూడొంతులకుపైగా పంటలు దెబ్బతిని దాదాపు రూ.4 కోట్ల మేర ఆ ఒక్క గ్రామంలోనే నష్టం జరిగింది. 

- ఇదీ జిల్లాలో ముసురు ప్రభావంతో దెబ్బతిన్న పైర్ల పరిస్థితి. ఊళ్లకు ఊళ్లు.. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా చాలాచోట్ల దెబ్బతిన్న లేత పైర్లను తొలగించి మళ్లీ వేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక పత్తి, మిర్చి, ముదురు తోటలు దెబ్బతిన్న చోటతిరిగి సాగుచేసే అవకాశం కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస వాయుగుండాల ప్రభావం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రత్యేకించి మెట్టపంటలు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇతర జిల్లాల్లో వలే వరదలు లేకపోయినప్పటికి ముసురుగా పది రోజులపాటు వీడకుండా కురిసిన వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ వర్షాలతో జిల్లాలో 1.01 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేయగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.450 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రధాన మెట్ట పంటలైన పత్తి, మినుము, మిర్చి, శనగకు అపార నష్టమే వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో తిరిగి ఆ భూముల్లో ఏం వేయాలో కూడా తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 


కుండపోత వాన

జిల్లాలో ఈనెలలో 143.7 మి.మీ సాధారణ వర్షపాతం కాగా 250 మి.మీకుపైగా కురిసింది. అందులోనూ 15 నుంచి 22వ తేదీ లోపే దాదాపు 150కిపైగా  మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అదే సమయంలో జిల్లాలో అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. కందుకూరు లాంటి మండలాల్లో ఏకంగా ఈ నెలలో 680 మి.మీపైగా వర్షపాతం నమోదు కాగా 400మి.మీ కన్నా అధికంగా 20 మండలాలు, 300 మి.మీ కన్నా అధికంగా మరో 20 మండలాల్లో కురిసింది. ఒకేసారి కాకుండా రోజంతా పడటం, అది కూడా పదిరోజుల పాటు కురవడంతో వర్షపు నీరంతా బయటకు వెళ్లకుండా పొలాల్లోనే ఉండిపోయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. 


ఉరకెత్తిన పైర్లు

జిల్లాలో 5.20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో, మరో లక్ష ఎకరాల్లో రబీ సీజన్‌లో పంటలు సాగు కాగా కోతలు పూర్తయిన పంటలు పోను ఇంచుమించు ఐదు లక్షల ఎకరాల్లో పైర్లు పొలంలోనే ఉన్నాయి. ముసురుతో మెట్టభూముల్లో సాగుచేసిన మిర్చి, పత్తి, శనగ, మినుము, పొగాకు పంటలకు అపార నష్టం జరిగింది. మిర్చి, పత్తి ముదురు తోటలు ఉరకెత్తి పోగా కోత దశకు చేరిన మినుము పొలంలోనే కాయలు మొలకెత్తాయి. అలాగే చాలాప్రాంతాల్లో మొలక దశలో ఉన్న శనగ, మినుము నీటిలో నాని కుళ్ళిపోగా, పొగాకు, మిర్చి లేత తోటలు వర్షపునీటిలో నాని ఎండిపోయాయి. కొన్నిచోట్ల భారీవర్షాలతో నీరు పారి ఇటీవల వేసిన విత్తనాలు, నాట్లు కోటుకుపోయాయి. అధికార వర్గాల సమాచారాన్ని ప్రకారం ఒక్క పర్చూరు ప్రాంతంలోనే ఇంచుమించు 8వేల ఎకరాల్లో మిర్చి దెబ్బతినగా కందుకూరు, అద్దంకి, మార్టూరు తదితర సబ్‌ డివిజన్లలోని మిర్చికి తీవ్రంగా నష్టం జరిగింది.  గిద్దలూరు ప్రాంతంలో శనగ దెబ్బతింది. ప్రత్యేకించి అద్దంకి, కందుకూరు ప్రాంతంలో మినుము, పర్చూరు, అద్దంకి, మార్టూరు ప్రాంతంలో పత్తి దెబ్బతిన్నాయి. 


1.01లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

కాగా పంటనష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు, అలాగే పొగాకు బోర్డు అధికారులు దాదాపు 1.01లక్షలకుపైగా ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. అయితే మరో 50వేలకుపైగా ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎకరాకు సగటున రూ.25వేల నుంచి రూ.30వేల మధ్య నష్టం జరిగినట్లు తెలుస్తుండగా, ఆ ప్రకారం జిల్లామొత్తంగా   ఈ వర్షాలతో రైతులు రూ.450కోట్ల వరకు నష్టపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారుల అంచనా ప్రకారం వర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాలు వివరాలు ఇలా ఉన్నాయి.


పంటపేరు    దెబ్బతిన్నవిస్తీర్ణం(ఎకరాల్లో)

---------------------------------------- 

మినుము 23,909.00

పత్తి 19,606:44

మిర్చి 18,048.00

శనగ 17,433.00

పొగాకు              8,700.00

వరి 5,657.00

ఇతరాలు 7,771.61

----------------------------------------

మొత్తం 1.01.125

-------------------------------------------------

పూర్తిగా మొలక వచ్చింది

-తోపూరి రవి, రైతు శ్రీనివాసనగర్‌, అద్దంకి మండలం 

రెండు ఎకరాలలో మినుము వేశా. ఎకరాకు రూ.25వేలు వంతున రూ.50వేలు ఖర్చయింది. క్వింటా రూ.6,500 ధర ఉంది. ఎకరాకు ఆరు క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అనుకున్నా. ఖర్చులుపోను ఎకరాకు రూ.15వేలు మిగులుతాయని ఆశించా. కోత అనంతరం వర్షాలతో నీటిలోనే మొత్తం మొలకెత్తింది. అంతా నష్టపోయా. మా ప్రాంతంలో చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.

మూడొంతులు పత్తి పంట దెబ్బతింది

- ఎర్రాకుల వెంకటేశ్వర్లు, రైతు, కొప్పెరపాలెం, బల్లికురవ మండలం 

మా ఊర్లో 350 ఎకరాలు పత్తిసాగు చేశారు. ఎకరాకు రూ.30వేలకు వరకు  ఖర్చు పెట్టారు. ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావించాం. ప్రస్తుతం క్వింటా రూ.7వేల ధర ఉంది. అలా రూ.55వేల వరకు రాబడి ఉంటే ఖర్చులు పోనూ ఎకరాకు రూ.20వేలు మిగులుతుందనుకున్నాం. ఇంతలో ముసురుతో పంట దెబ్బతింది. ప్రస్తుతం క్వింటా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

విత్తనాలు, మొలకలు కుళ్లిపోయాయి

-ఎస్‌.నాగయ్య, రైతు,అనుమలవీడు, రాచర్ల మండలం 

నేను రెండు ఎకరాల్లో శనగ సాగు చేశా. విత్తనాలు, మొలకలు వచ్చాక ముసురు పట్టింది. దీంతో మొత్తం కుళ్లిపోయింది. గ్రామంలో 500 ఎకరాల్లో శనగ సాగు చేశారు. కొంత విస్తీర్ణంలో విత్తనాలు వేసి ఉండగా మరికొంత మొలక వచ్చి మొక్కలు బయటకు వచ్చాయి. వర్షాలతో అంతా పొలంలోనే కుళ్లిపోయాయి. 

అంతా నష్టమే

- రావూరి నాగేశ్వరరావు, రైతు, నూతలపాడు, పర్చూరు మండలం 

నేను నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి ఇప్పటివరకు పెట్టా. ముసురుకు మొత్తం పంట దెబ్బతింది. మళ్లీ వేయాలంటే భారీ ఖర్చు. ఏంచేయాలో అర్థం కావడం లేదు. మా గ్రామంలో 2.5వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే 2వేల ఎకరాల్లో ఇలాగే దెబ్బతింది. 





Updated Date - 2021-11-27T05:03:05+05:30 IST