ఆసిఫాబాద్‌ జిల్లాలో ముసురు వాన

ABN , First Publish Date - 2022-07-06T04:17:17+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి

ఆసిఫాబాద్‌ జిల్లాలో ముసురు వాన
లింగాపూర్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న కీమానాయక్‌ తండా వాగు

- వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

- జిల్లా వ్యాప్తంగా 358.2 మి.మీ వర్షపాతం నమోదు

ఆసిఫాబాద్‌, జూలై 5:  జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 15 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వట్టివాగు ప్రాజెక్టులో 2,389 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు రెండు గేట్లను ఎత్తి 2,389 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో అధికారులు వట్టివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే కుమరం భీం ప్రాజెక్టులో 2016 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 

జిల్లాలో 358.2 మి.మీ వర్షపాతం..

జిల్లా వ్యాప్తంగా 358.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జైనూరు మండలంలో 413.6 మిల్లీమీటర్లు, సిర్పూర్‌(యూ)లో 261.8 మిల్లీమీటర్లు, తిర్యాణిలో 396.2 మిల్లీమీటర్లు,  రెబ్బెనలో 424.2 మిల్లీమీటర్లు, ఆసిఫాబాద్‌లో 394.6 మిల్లీమీటర్లు,  కెరమెరిలో 363.6 మిల్లీమీటర్లు,  వాంకిడిలో 362.0 మిల్లీమీటర్ల వర్షం కురిసంది. కాగజ్‌నగర్‌లో 371.8 మిల్లీమీటర్లు, సిర్పూర్‌(టి)లో 334.8 మిల్లీమీటర్లు, కౌటాలలో 355.2 మిల్లీమీటర్లు,  బెజ్జూరులో 331.6 మిల్లీమీటర్లు, దహెగాంలో 289.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

లింగాపూర్‌: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని కీమానాయక్‌ తండా గ్రామ సమీపం లోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-07-06T04:17:17+05:30 IST