మూడు నెలల్లో కాని పని.. మూడు గంటల్లోనే పూర్తి

ABN , First Publish Date - 2021-01-24T06:26:02+05:30 IST

ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలందించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలియజేశారు.

మూడు నెలల్లో కాని పని.. మూడు గంటల్లోనే పూర్తి
సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీ్‌షరావు

పారదర్శకంగా ‘ధరణి’ సేవలు

29 లోగా అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరివ్వకుంటే చర్యలు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సంగారెడ్డి టౌన్‌, జనవరి 23 : ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలందించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలియజేశారు. మూడు నెలలైనా పూర్తి కానీ పని ధరణి ద్వారా మూడు గంటల్లోనే పూర్తవుతుందని తెలియజేశారు. సంగారెడ్డిలోని జిల్లా కలెక్టరేట్‌లో శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతగాదాల శాశ్వత పరిష్కారానికి ధరణి పోర్టల్‌ ద్వారా మార్గం సుగమమైందన్నారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేకుండా పారదర్శకమైన సేవలు అందుతున్నాయని చెప్పారు. భూ రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుంచి వ్యవస్థలోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆన్‌లైన్‌లో కొన్ని ప్రొవిజన్స్‌ సరిగ్గా లేకపోవడంతో చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని త్వరలోనే సరి చేస్తామని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో 721 భూవివాదాలకు సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నాయని, వాటన్నింటిని కలెక్టర్‌ పరిష్కరిస్తారన్నారు. పెండింగ్‌ మ్యుటేషన్‌లను పూర్తి చేసుకోవడానికి మీ సేవలో దరఖాస్తు చేస్తే రిజిస్ట్రేషన్‌ చేసి పాస్‌బుక్‌లను అందజేస్తారని తెలిపారు.  


కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతులు ప్రారంభం

ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేయాలని మంత్రి హరీశ్‌రావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు తెరుచుకోనుండడంతో తరగతి గదులు, హాస్టళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పారిశుధ్యం, తదితర మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో పాటు కొవిడ్‌ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాలలన్నింటినీ శానిటైజ్‌ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు ఉపాధి హామీ కూలీలను పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్‌లు తదితర మరమ్మతులకు పంచాయతీ నిధులను వినియోగించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యంతో పాటు ఇతర పప్పుదినుసులు, నిత్యావసర సరుకులు 28లోగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలకు చేర్చాలన్నారు. పాడైపోయిన బియ్యం, పప్పులు వెంటనే డిస్పోజల్‌ చేయాల్సిన బాధ్యత పిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులదేనని స్పష్టం చేశారు. కరోనాకు ముందు ఆర్టీసీ బస్సులు ఏఏ రూట్లలో నడిచాయో మళ్లీ విద్యార్థుల కోసం నడపాలని ఆర్‌ఎంకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ను తప్పనిసరిగా చెక్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్య్లూఎస్‌ అధికారులతో సమీక్షిస్తూ ఈ నెల 29లోగా ప్రతీ గ్రామానికీ తాగునీరు అందించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 


ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు

పటాన్‌చెరులోని ఏరియా ఆసుపత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు రివైజ్డ్‌ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి వైద్యఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి ట్రామాకేర్‌ సెంటర్‌, డయాలసిస్‌, డెర్మటాలజి, కార్డియాలజీ తదితర స్పెషలైజేషన్‌ విభాగాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు. కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ హన్మంతరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివశంకర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T06:26:02+05:30 IST