మ్యుటేషన్‌ తిప్పలు

ABN , First Publish Date - 2020-12-02T03:59:23+05:30 IST

వ్యవసాయ భూములను ధరణి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజునే పట్టాదారు పాసు పుస్తకాలను అందించి సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

మ్యుటేషన్‌ తిప్పలు
వ్యవసాయ భూమి

గతంలో రిజిస్ర్టేషన్‌ చేసుకొన్న భూములకు ఇబ్బందులు

పెండింగ్‌లోనే దరఖాస్తులు 

పాస్‌బుక్‌లు అందక రైతుబంధు, బీమా అందని వైనం 

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా 700లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌


బెల్లంపల్లి, డిసెంబరు 1 : వ్యవసాయ భూములను ధరణి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజునే పట్టాదారు పాసు పుస్తకాలను అందించి సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా గతంలో భూములు కొని రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికి మ్యుటేషన్‌ కాకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధరణి పోర్టల్‌ ద్వారా గతంలో రిజిస్ర్టేషన్‌ అయిన భూములకు మ్యుటేషన్‌ చేసి పాస్‌బుక్‌లు అందించే అవకాశం లేకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరణి పోర్టల్‌లో మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాస్‌బుక్‌లు అందించే అవకాశం ప్రస్తుతం లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలను సైతం అందుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 700లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. 


ధరణిలో నమోదు కాని వైనం

వ్యవసాయ భూములు రిజిస్ర్టేషన్‌ చేసుకుని మ్యుటేషన్‌ కాక కొత్త పాస్‌బుక్‌లు రాకపోవడంతో జిల్లాలో దాదాపు 700లకు పైగా భూముల అమ్మకాలు, కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. అంతకుముందు ఎంతో మంది వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వీరు కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లో  భూముల లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేయడంతో మ్యుటేషన్‌ కోసం అవకాశం లేకుండా పోయింది. అయితే ఇటీవల ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను చేపట్టింది. మ్యుటేషన్‌కు సంబంధించి మీ సేవలో ఫీజు చెల్లించి పాస్‌బుక్‌ల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదిస్తున్నారు. గతంలో వ్యవసాయ భూములు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న పలువురికి మ్యుటేషన్‌కు సంబంధించి ధరణి పోర్టల్‌లో వివరాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు అందించే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం మ్యుటేషన్‌ల ప్రక్రియ వేగవంతం చేసి కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు. 


దరఖాస్తులు పరిశీలించి మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాం

- తాండూర్‌ తహసీల్దార్‌ కవిత 

గతంలో భూమి రిజిస్ర్టేషన్‌, డాక్యుమెంట్లకు సంబంధించి మ్యుటేషన్‌ కోసం ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా ధరణి ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని భూముల విషయంలో రిజిస్ర్టేషన్‌లు చేయలేకపోతున్నాం. సాంకేతిక లోపాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. 

Updated Date - 2020-12-02T03:59:23+05:30 IST