రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

ABN , First Publish Date - 2022-05-26T06:31:46+05:30 IST

రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

- తెలంగాణకు రావాల్సిన నిధులనూ ఇవ్వట్లేదు

- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

జనగామ, మే 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న కవర్‌షెడ్‌, కార్యాలయ భవనం, వాటర్‌ట్యాంకు పనులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి భూమిపూజ చేశారు. వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూ. 3.65 లక్షల కోట్లను కేంద్రానికి చెల్లిస్తే కేంద్రం తిరిగి తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి లొట్టిమీది కాకుల్లా ఇష్టం వచ్చినట్లు ఒర్రుతున్నారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తెప్పించాలని సవాల్‌ విసిరారు.తెలంగాణలో సాగునీటి వనరులు పెరగడం వల్ల పెద్దమొత్తంలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఒకప్పుడు పంటలే పండవన్న తెలంగాణలో ప్రస్తుతం కేంద్రమే కొనలేమని చేతులెత్తేసిన పరిస్థితి వచ్చిందన్నారు. 

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రైతులకు భరోసానిచ్చారన్నారు. 2014కు ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో, ప్రస్తుతం ఎలాఉందో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన తెలంగాణలో నేడు ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోందన్నారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ విధానాలను పాటిస్తూ సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో అనేక విధానాలను అంబేద్కర్‌ చేర్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సాదాబైనామా, 24 గంటల కరెంట్‌ అందించారన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిదన్నారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి జనగామ జిల్లా ఏర్పాటుకు సహకరించానన్నా రు. సమావేశంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయ సిద్ధిలింగం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఐలేని ఆగిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీ, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జీవన్‌కుమార్‌, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:31:46+05:30 IST