ఆయన ఒక్కసారి ఫిక్స్‌ అయితే.. ఇక అంతే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 14)

Jun 15 2021 @ 20:14PM

టి.కృష్ణగారు దర్శకత్వం వహించిన చిత్రాలను మొదటినుంచీ పరిశీలిస్తున్న పత్రికాధినేత, నిర్మాత రామోజీరావుగారు ఓ రోజు కృష్ణగారికి కబురు చేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థకు ఓ సినిమా చేయమని అడిగారు. అప్పటికి ‘వందేమాతరం’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణగారు అంతవరకూ తీసినవి సొంత సినిమాలే అని చెప్పాలి. హరికృష్ణగారు కూడా ఓ నిర్మాతగా కాకుండా మాలో ఒకరిగానే ఉండేవారు. అందుకే ‘దేవాలయం’, ‘వందేమాతరం’ చిత్రాలు బయటి నిర్మాతలకు చేస్తున్నామనే భావం మాకు ఎప్పుడూ కలగలేదు. కానీ తొలిసారిగా రామోజీరావు వంటి ప్రముఖ వ్యక్తి నుంచి ఆఫర్‌ రావడంతో కృష్ణగారు చాలా సంతోషించారు. మంచి కథ తయారు చేసుకొని సినిమా తీయడానికి సిద్ధమయ్యారు.


చంద్రమోహన్‌, విజయశాంతి హీరో హీరోయిన్లు. విలన్‌ పాత్ర మాత్రం ఓ కొత్త నటుడితో వేయించాలని కృష్ణగారి ఆలోచన. ‘నేటి భారతం’ కన్నడ వెర్షనలో నటించిన చరణ్‌రాజ్‌ ఆయన దృష్టిని ఆకర్షించారు. ఓ రోజు విజయాగార్డెన్స్‌లో పాటల రికార్డింగ్‌ జరుగుతుంటే ‘మన సినిమాలో కొత్త విలన్‌ను పరిచయం చేస్తున్నాం. చూద్దువుగానీ రా’ అని కబురు చేస్తే వెళ్లాను. చరణ్‌రాజ్‌ను నాకు పరిచయం చేశారు కృష్ణగారు. ఎందుకో నాకు అతను నచ్చలేదు. అదే విషయం చెప్పి ‘‘సార్‌.. విలన్‌ అంటే భీకరంగా ఉండాలి. దడదడలాడించాలి. ఇతనేంటి సార్‌ ఇలా ఉన్నాడు.. పైగా కళ్ళు చాలా చిన్నవి’’ అని నిర్మొహమాటంగా చెప్పేశాను. అయినా కృష్ణగారు నొచ్చుకోలేదు. ‘లేదు సుబ్బయ్యా.. బాగుంటాడు. గడ్డం పెడదాం’ అన్నారు.

ఆయన ఒకసారి ఫిక్స్‌ అయితే ఇక వినరని నాకు తెలుసు. అందుకే పెద్దగా పొడిగించకుండా ‘‘సరేసార్‌, మీ ఇష్టం. కానీ ఓ చిన్న సూచన. అతనికి కాంటాక్ట్‌ లెన్సులు పెట్టండి. పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు’’ అన్నాను. ‘వద్దు సుబ్బయ్యా, ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది’ అన్నారు. దాంతో నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. అప్పటికి ఒక పాట మినహా ‘వందేమాతరం’ చిత్రం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఆ పనులన్నీ నాకు అప్పగించేసి ఉషాకిరణ్‌ మూవీస్‌ చిత్రం కోసం వైజాగ్‌ వెళ్లిపోయారు కృష్ణగారు. అనుభవమున్న కో–డైరెక్టర్‌ కావాలి కనుక నాకు బాగా పరిచయమున్న కమల్‌తేజ్‌ను ఆ సినిమాకు పంపించాను. ఇక్కడ నా పనిలో నేను నిమగ్నమయ్యాను. వైజాగ్‌లో షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత కమల్‌తేజ్‌కు ఫోన్‌ చేసి చరణ్‌రాజ్‌ గెటప్‌ గురించి కనుక్కున్నాను. అతనికి కాంటాక్ట్‌ లెన్సులు పెట్టినట్లు తెలిసింది. ‘నా దగ్గర పనిచేసే వ్యక్తి చెబితే నేను వినాలా’ అని ఈగోలకు పోకుండా, కృష్ణగారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారన్న మాట అనుకొన్నాను.


వైజాగ్‌లో షూటింగ్‌ ప్రారంభమై వారం రోజులు గడిచిందో లేదో కృష్ణగారి నుంచి ఫోన్‌. ‘సుబ్బయ్యా.. నీ వర్క్‌ ఎప్పుడు పూర్తవుతుంది.. తొందరగా పూర్తి చేసుకుని వచ్చెయ్‌’ అన్నారు. ఏం జరిగిందో నాకేమీ అర్థం కాలేదు. ‘‘ఏమైంది సార్‌’’ అని అడిగాను కంగారుగా. ‘వివరాలన్నీ వద్దుగానీ, నువ్వు ఇక్కడ ఉండాలి.. తొందరగా రావయ్యా బాబూ’ అన్నారు కృష్ణగారు. ఆయన ఫోన్‌ పెట్టేసిన తర్వాత ఆరా తీస్తే తెలిసిందేమిటంటే, కృష్ణగారికి, కో–డైరెక్టర్‌ కమల్‌తేజ్‌కు సెట్‌ కాలేదు. ఆయనతో తొలిసారిగా కమల్‌తేజ్‌ పనిచేస్తుండటంతో వారిద్దరికీ వేవ్‌ లెంగ్త్‌ కుదర్లేదు. ఒక షాట్‌ తీసేముందు మేమిద్దరం ఎంతో చర్చించుకుని తీసేవాళ్లం. ఆయనకు నేను పని నేర్పించానని చెప్పను కానీ కొన్ని షాట్స్‌ ఎలా తీయాలో నన్ను అడిగి తెలుసుకునేవారు కృష్ణగారు. అందుకే నేను లేకపోవడం లోటుగా ఫీలయ్యారాయన. షూటింగ్‌ మొదలుపెట్టిన రెండోరోజు నుంచే ‘సుబ్యయ్యని పిలిపించండి’ అని ప్రొడక్షన మేనేజర్‌ రాంబాబుకు చెప్పడం ప్రారంభించారు. రాంబాబు నాకు ఫోన్‌ చేసేవాడు. ఇక్కడ పని హడావిడిలో ఉండి నేను పట్టించుకోలేదు. దాంతో ఆయనే ఓరోజు ఫోన్‌ చేసేశారు. ఇక నాకు తప్పలేదు. అప్పటికి ఇక్కడి వర్క్‌ కూడా పూర్తి కావడంతో వైజాగ్‌ బయలుదేరాను. మండు వేసవిలో మే నెలలో సినిమా షూటింగ్‌ జరిగేది. నెల రోజులపాటు ఏకధాటిగా జరిగిన షూటింగ్‌తో చిత్రం పూర్తయింది.


టైటిల్‌ మొదట నాకు నచ్చలేదు

ఈ సినిమాకు ఏ టైటిల్‌ పెట్టాలనే విషయం మీద చాలా చర్చ జరిగింది. రకరకాల పేర్లు అనుకున్నాం. కానీ ఏదీ కృష్ణగారికి నచ్చలేదు. ఒక రోజు రామోజీరావుగారు ‘ప్రతిఘటన’ టైటిల్‌ ఎలా ఉంటుందో చూడమని చెప్పారు. సంప్రదాయ సినిమా టైటిల్స్‌కు భిన్నంగా ఉన్న ఆ టైటిల్‌ ఎందుకో నాకు నచ్చలేదు. తన సినిమాలకు సింపుల్‌ టైటిల్స్‌ పెట్టడం కృష్ణగారికి అలవాటు. వాటికి భిన్నంగా ఉందీ టైటిల్‌. అయితే అదే పాపులర్‌ అవుతుందని మేం ఊహించలేదు. టి.కృష్ణగారికి అప్పటికే పైల్స్‌ ప్రాబ్లం ఉంది. దాంతో బాగా ఇబ్బంది పడేవారు. అదే సమయంలో కాన్సర్‌ లక్షణాలు కూడా బయటపడ్డాయి.


అనారోగ్యం ఆయన్ని కుంగదీస్తున్నా తట్టుకుని అలాగే షూటింగ్‌ చేసేవారు. కొన్ని చిన్న సీన్లు ‘నువ్వు తియ్యి సుబ్బయ్యా’ అని నా మీద వదిలేసి వెళ్లిపోయేవారు. ఫైట్స్‌ తీస్తున్నప్పుడు కూడా ఆయన నన్నే చూడమనేవారు. అంత ఫ్రీడమ్‌ ఇచ్చేవారు నాకు. ‘ప్రతిఘటన’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమా తర్వాత కృష్ణగారి ఆరోగ్యం క్షీణించడం మొదలెట్టింది. ఆయనకు క్యాన్సర్‌ అని అందరికీ తెలిసిపోయింది. ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడం కోసం వెంటనే ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదు. ఆయన సినిమా లేకపోవడంతో నేనూ ఖాళీగా ఉన్నాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Follow Us on:

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.