ఆయన అలా అనగానే బిగ్గరగా ఏడవాలనిపించింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 15)

Jun 17 2021 @ 20:28PM

ఒక రోజు బి. గోపాల్‌ ఫోన్‌ చేశాడు. ‘సుబ్బన్నా.. తొలిసారిగా దర్శకత్వం చేస్తున్నాను. రామానాయుడుగారు అవకాశం ఇచ్చారు. సినిమా పేరు ‘ప్రతిధ్వని’ నువ్వు కో–డైరెక్టర్‌గా రా అన్నా.. నాకు హెల్పింగ్‌గా ఉంటుంది’ అని అభ్యర్థించాడు. సరేనన్నాను. అలా ‘ప్రతిధ్వని’ చిత్రానికి కో–డైరెక్టర్‌గా తొలిసారిగా సురేశ్‌ సంస్థలో చేరా.


సెకండ్‌ ఇన్నింగ్స్‌

రోజూ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీసుకు వెళ్లి స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొనేవాడిని. పరుచూరి బ్రదర్స్‌, గోపాల్‌, నాయుడుగారు...అంతా ఉండేవారు. వాడిగా, వేడిగా కథాచర్చలు జరిగేవి. సరిగ్గా అదే సమయంలో ఓ రోజు హరికృష్ణగారు నన్ను ఆఫీసుకు పిలిపించి చేతిలో ఓ నవల పెట్టారు. మైనంపాటి భాస్కర్‌గారు రాసిన ‘వెన్నెలమెట్లు’ నవల అది. ‘ఇది చదివి సినిమాకు పనికొస్తుందో లేదో చెప్పు సుబ్బయ్యా’ అన్నారు హరికృష్ణగారు. చదివాను. ‘‘చాలా బాగుంది సార్‌.. సినిమాకు బ్రహ్మాండంగా ఉంటుంది’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే’ అని ఊరుకున్నారు తప్ప దర్శకుడెవరనేది నాకు అప్పుడు చెప్పలేదు.


ఆ తర్వాత కొన్ని రోజులకు నేను ‘ప్రతిధ్వని’ సినిమా డిస్కషన్స్‌లో ఉన్నప్పుడు హరికృష్ణగారు ఫోన్‌ చేశారు. ‘‘సుబ్బయ్యా.. ‘వెన్నెలమెట్లు’ నవలను మనం సినిమాగా తీస్తున్నాం. నువ్వే దర్శకుడవి’’ అన్నారు. ఊహించని ఈ ఆఫర్‌కు నేను ఆశ్చర్యపోయి ‘‘సార్‌’’ అన్నాను. టి.కృష్ణ దర్శకత్వంలో హరికృష్ణగారు ‘దేవాలయం’, ‘వందేమాతరం’ చిత్రాలు తీశారు. వాటికి నేనే కో–డైరెక్టర్‌. ఆ సమయంలో నా పనితీరు చూసి హరికృష్ణగారు ముగ్ధుడై ఈ సినిమా ఛాన్స్‌ నాకు ఆఫర్‌ చేశారు. చాలా హ్యాపీగా, సాఫీగా కో–డైరెక్టర్‌గా జీవితం సాగిపోతున్న తరుణంలో, మళ్లీ నాకు ఇంత తొందరగా డైరెక్షన్‌ చేసే చాన్స్‌ వస్తుందని ఊహించలేదు. అయితే ఈ అవకాశం అందిపుచ్చుకోవాలా? వద్దా? అని చాలా సేపు ఆలోచించాను. అయితే అభిరుచి కలిగిన నిర్మాత, పంపిణీదారుడు హరికృష్ణ ఈ అవకాశం ఇవ్వడంతో కాదనలేకపోయాను. అలా దర్శకునిగా నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది.

ఆయన ఆ మాట అనగానే బిగ్గరగా ఏడవాలనిపించింది

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నా తొలి చిత్రం ‘అరుణకిరణం’. హరికృష్ణగారి ఆఫీసులో స్టోరీ డిస్కషన్స్‌ ప్రారంభించాం. ఎం.వి.ఎస్‌.హరనాథరావు రచయిత. ఆయనతో నాకు ముందే పరిచయం ఉండటంతో కథాచర్చలు సాఫీగానే సాగాయి. నవలను సినిమాగా మార్చడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని స్ర్కిప్ట్‌ ఫైనలైజ్‌ చేశారు. డాక్టర్‌ రాజశేఖర్‌, విజయశాంతి జంట. ఈ సినిమాకు టైటిల్‌ నిర్ణయించడానికి మాకు ఎక్కువ టైమ్‌ పట్టింది. ఎందుకంటే ఏ టైటిల్‌ చెప్పినా హరికృష్ణగారికి నచ్చేది కాదు. ‘అంతకు మించి’ ఉండాలనేవారు. రోజూ ఆఫీసుకు రాగానే పేపర్‌ మీద కొన్ని టైటిల్స్‌ రాసి హరికృష్ణగారి టేబుల్‌ మీద పెట్టేవాణ్ణి. ఒక రోజు టి.కృష్ణగారు ఆఫీసుకు వచ్చారు. ‘కృష్ణా.. మన సినిమాకు మంచి టైటిల్‌ చెప్పు’ అని అడిగారు హరికృష్ణగారు.


‘మీరు అనుకున్న టైటిల్స్‌ ఏమిటీ?’ అనడిగారాయన. ‘ఇదుగో సుబ్బయ్యరాసిన పేర్ల లిస్ట్‌’ అని ఆ కాగితం కృష్ణకు ఇచ్చారు. అందులో మొదటిపేరే ‘అరుణకిరణం’. నేను లెఫ్ట్‌ ఓరియంటెడ్‌ వ్యక్తిని కావడంతో అలాంటి టైటిల్‌ ఆలోచించాను. కానీ హరికృష్ణగారికి నచ్చలేదు. కృష్ణగారు అన్ని పేర్లూ పరిశీలించి ‘అరుణకిరణం’ బాగుంది కదా అన్నారు. దాంతో ఇక హరికృష్ణగారు కాదనలేకపోయారు.‘అరుణకిరణం’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలోనే ఒంగోలులో కృష్ణగారి కొత్త చిత్రం ‘రేపటి పౌరులు’ షూటింగ్‌ మొదలైంది. దానికి నాలుగురోజుల ముందు జరిగిన ఓ సంఘటన గురించి మీకు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నా జీవితంలో మరచిపోలేని సంఘటన. ఇప్పుడు మళ్లీ ‘అరుణకిరణం’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నాను. అందుకే నన్ను పాత్రికేయులకు కొత్తగా పరిచయం చేయాలని హరికృష్ణగారు నిర్ణయించారు.


చెన్నైలోని పామ్‌గ్రోవ్‌ హోటల్‌లో ఇందుకోసం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి టి.కృష్ణగారిని గెస్ట్‌గా పిలిచారు. ఆ ప్రెస్‌మీట్‌లో నా గురించి కృష్ణగారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నేను మరచిపోలేదు. ‘నేను ఇంతవరకూ ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించాను. అవన్నీ అద్భుతంగా ఉన్నాయని మీరంతా ప్రశంసిస్తున్నారు. ఆ సినిమాలకు నేను డైరెక్టర్‌ అయితే నా డైరెక్టర్‌ మాత్రం ముత్యాల సుబ్బయ్యే. నన్ను గైడ్‌ చేసి నడిపించింది ఆయనే!’ అన్నారు కృష్ణగారు. ఇతరుల కష్టాన్ని తమ ప్రతిభగా చాటుకునే వ్యక్తులున్న ఈ రోజుల్లో తన కో–డైరెక్టర్‌నే తన డైరెక్టర్‌ అనిచెప్పే సంస్కారం ఎంతమందికి ఉంటుంది! నేనే కాదు ఏ కో–డైరెక్టరైనా చేసే పని అదే. అయినా పాత్రికేయుల ముందు టి.కృష్ణగారు నన్ను అలా కీర్తించడం చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నారు కానీ మాట్లాడలేకపోయాను. బిగ్గరగా ఏడవాలని మాత్రం అనిపించింది. ఒక కో–డైరెక్టర్‌కు అంత గౌరవం ఇచ్చిన కృష్ణగారి సంస్కారానికి మనసులోనే శతాధిక వందనాలు తెలియజేసుకున్నాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Follow Us on:

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.