మా ఆవిడ ‘ఇది అరుణకిరణం చైన్‌’ అనేది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 17)

Jun 19 2021 @ 21:03PM

నా దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘ఇదా ప్రపంచం’. హరికృష్ణగారే నిర్మాత. ఆయనకు బాపుగారి దర్శకత్వంలో సినిమా తీయాలని కోరిక. ఆయన్ని అడిగితే చేస్తానన్నారు. ఆ సినిమా పేరు ‘కల్యాణతాంబూలం’. శోభన్‌బాబు, విజయశాంతి ముఖ్య జంట. ‘ఇదా ప్రపంచం’ స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలోనే ‘కల్యాణ తాంబూలం’ షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ ఊటీలో జరుగుతుండటంతో ‘ఇదా ప్రపంచం’ స్టోరీ డిస్కషన్స్‌ కూడా అక్కడే పెట్టారు. మేం ఆ సినిమా పనిలో ఉండగానే కృష్ణగారు అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. ఇక రోజురోజుకీ ఆయన మృత్యువుకు దగ్గరవుతున్నారని మా అందరికీ అర్థమైపోయింది. జరిగేదేదో చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి.


మేం ఊటీలో ఉండగానే కృష్ణగారు చనిపోయారన్న వార్త వచ్చింది. మా ఆత్మబంధువు ఇకలేరని వార్త మనసుని కలిచివేసింది. ఊటీ నుంచి అందరం ఒంగోలు చేరుకొన్నాం. అక్కడ జనాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. కార్యక్రమాలన్నీ ముగించుకుని వెనక్కి వచ్చేశాం. వారంరోజుల వరకూ ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాం. కృష్ణగారికి రావాల్సిన జబ్బు కాదది. ఆయనకు ఎటువంటి దురలవాట్లూ లేవు. ఆ రోగానికీ, మనిషి అలవాట్లుకు సంబంధమే లేదు. విధి రాత అనుకోవాల్సిందే.


‘అరుణకిరణం’ గొలుసు అనేది

‘అరుణకిరణం’ వంద రోజుల వేడుక చాలా ఘనంగా నిర్వహించాలని హరికృష్ణగారు అనుకున్నారు. కానీ టి.కృష్ణ మరణంతో దాన్ని వాయిదా వేశారు. అదే ఆదరణతో సినిమా 150 రోజులు ఆడటంతో చెన్నైలోని తాజ్‌ కోరమండల్‌ హోటల్‌లో 1987 జనవరి 7న శతదినోత్సవం జరిపారు హరికృష్ణ. డి.వి.ఎస్‌.రాజుగారు ముఖ్య అతిధి. ఆయన చేతులమీదుగా బి.వి.రాజుగారు పదివేల రూపాయల నగదు నాకు బహూకరించారు. నాకు బాగా గుర్తు. ఆ పది వేలు తీసుకెళ్లి మా ఆవిడకు ఇచ్చాను. ఆ రోజుల్లో తులం బంగారం మూడు వేలు అనుకొంటా. మూడు తులాల గొలుసు కొనుక్కుంది. అది మెళ్లో వేసుకుని ‘ఇది అరుణకిరణం చైన్‌ అండీ’ అని చెబుతుండేది.

‘ఇదా ప్రపంచం’ స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి కావడంతో ఆర్టిస్టుల సెలెక్షన్స్‌ ప్రారంభించాం. డాక్టర్‌ రాజశేఖర్‌ హీరో. శరత్‌బాబు, శివకృష్ణ, సరిత, జీవిత కీలక పాత్రధారులు. మంగళగిరిలో షూటింగ్‌ మొదలుపెట్టాం. రైలుకి, రైలు ప్రయాణానికీ, మనిషి జీవితానికీ సామ్యం ఉంది. ఏ మనిషి ప్రయాణం ఎంతవరకో ఎవరికీ తెలీదు. రైలు ప్రయాణంలానే జీవిత ప్రయాణంలో మనకు ఎంతో మంది కలుస్తారు, ఎంతో మంది విడిపోతారు. మంచి, చెడు అనే విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల కథతో ‘ఇదా ప్రపంచం’ షూటింగ్‌ ప్రారంభించాం.


రైల్వే స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కావడంతో మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ఎన్నుకొన్నాం. చాలా కష్టమైన వాతావరణంలో షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. వచ్చే పోయే రైళ్లతో ఆ స్టేషన్‌ ఎప్పుడూ సందడిగా ఉండేది. షూటింగ్‌ చూడటానికి వచ్చిన జనం ఏ రైలు కిందన్నాపడితే లేనిపోని తలనొప్పి. అందుకే అనుక్షణం వణికిపోతూ షూటింగ్‌ చేశాం. చాలా మంచి కథ. ఇక పాటలకు వంక పెట్టడానికి వీల్లేదు. ముఖ్యంగా జాలాదిగారు రాసిన ‘బండెళ్లి పోతాందె చెల్లెలా.. బతుకు బండెళ్లి పోతాంది చెల్లెలా..’ అనే పాట బాగా పాపులర్‌ అయింది. షూటింగ్‌ చేసినన్ని రోజులూ ఒక ఎత్తయితే, జయమాలిని ఉన్న మూడు రోజులూ మరో ఎత్తని చెప్పాలి. జనంలో బాగా క్రేజ్‌ ఉన్న నటి కావడంతో ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. వాళ్లని కంట్రోల్‌ చేయడం చాలా కష్టమైపోయింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Follow Us on:

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.