పవన్ చిత్రానికి నిర్మాత సరిగా పబ్లిసిటీ చేయలేదు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 41)

Jul 23 2021 @ 21:54PM

‘ఒక చిన్నమాట’ తర్వాత నేను చేసిన సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అందులో పవన్‌కల్యాణ్‌ హీరో కావడమే ఆ ప్రత్యేకత. తమిళంలో హిట్‌ అయిన ‘గోకులత్తిల్‌ సీతై’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ నిర్మాత జీవీఎస్‌ రాజుగారు కొన్నారు. నాకు ఆ సినిమా చూపించారు. ఆ సినిమా తెలుగులో తీద్దామని చెప్పారు. చిరంజీవిగారితో ‘హిట్లర్‌’ చేయగానే ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో వర్క్‌ చేసే అవకాశం రావడంతో నేను ఆనందంగా అంగీకరించాను. తమిళ సినిమాలో కార్తీక్‌ హీరోగా నటించారు. పాయింట్‌ బాగానే ఉంది కానీ కథలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ సమయానికి పవన్‌కల్యాణ్‌గారు నటించిన తొలి చిత్రం ‘అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి’ విడుదలైంది. ఆయనతో రెండో సినిమా చేయాలని జీవీజీ రాజుగారు డేట్స్‌ తీసుకున్నారు. నన్ను చిరంజీవిగారి దగ్గరకు తీసుకెళ్లారు.


‘సినిమా బాగుంది సార్‌.. కానీ మన నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేయాలి. ముఖ్యంగా సెకాండాఫ్‌ మార్చాలి సార్‌’ అన్నాను. ‘బెటర్‌మెంట్‌ కోసం ఎలాంటి మార్పులు చేస్తారో అది మీ ఇష్టం. అలాగే చెయ్యండి’ అన్నారు చిరంజీవిగారు. భూపతిరాజా, రాజేంద్రకుమార్‌లను కూర్చోబెట్టి కథకు రిపేర్లు ప్రారంభించాం. ప్రేమంటే సదభిప్రాయం లేని ఓ యువకుడు ఒక యువతిని ప్రేమించి, ఆమె ప్రేమ కోసం ప్రాణాలు వదులుకోవడానికి సైతం సిద్ధపడటం చిత్ర కథ. ‘గోకులంలో సీత’ అని పేరు పెట్టి షూటింగ్‌ ప్రారంభించాం. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా షూటింగ్‌ సాగిపోయింది. పవన్‌కల్యాణ్‌ అప్పట్లో చాలా బిడియస్తుడు. తక్కువ మాట్లాడేవాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కనిపించేది. నేను ఎలా చెబితే అలా నటించాడు. తమిళ సినిమా కంటే ‘గోకులంలో సీత’ చిత్రం బాగా పోయింది. మంచి రేట్లకు అమ్మారు.

ఆ తర్వాత నిర్మాత సినిమా గురించి పట్టించుకోలేదు. పబ్లిసిటీ సరిగ్గా చేయలేదు. ‘పబ్లిసిటీ బాగా చేయమని చెప్పండి బాబూ’ అని పవన్‌కల్యాణ్‌ దగ్గరకు వెళ్లి చెప్పేవాడిని. అయితే ఆయన మొహమాటస్తుడు కావడంతో ఆ విషయం నిర్మాతతో చెప్పలేకపోయేవాడు. ‘సుబ్బయ్యగారూ.. మనం మళ్లీ ఓ సినిమా చేద్దాం’ అనేవారు. నా మిత్రుడు బద్వేలు శ్రీనివాసరెడ్డిని పవన్‌కల్యాణ్‌ దగ్గరకు తీసుకెళ్లి అడ్వాన్స్‌ ఇప్పించాను. మంచి కథతో మళ్లీ కలుస్తానని చెప్పాను. ఆయన సరేనన్నారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Follow Us on:

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.