ప్రాణాలతో చెలగాటమా!

ABN , First Publish Date - 2020-12-02T06:22:03+05:30 IST

మటన్‌ మాఫియాకు మళ్లీ రెక్కలొచ్చాయి.

ప్రాణాలతో చెలగాటమా!
గత నెలలో వీఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్‌ చేసిన పురుగులు పట్టిన మాంసం

కుళ్లిన మాంసం విక్రయించే వారికి మంత్రి అండ

సీజ్‌ చేసిన షాపును పక్షం రోజులకే తెరిపించిన వైనం

ఇతర రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం దిగుమతి

ఇటీవల రెండు దుకాణాలు సీజ్‌ చేసిన వీఎంసీ అధికారులు

మంత్రి అనుచరుల జోక్యంతో తిరిగి తెరచుకున్న దుకాణాలు

రూ.25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు


మటన్‌ మాఫియాకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాంసాన్ని దిగుమతి చేసుకుని, వన్‌టౌన్‌లో నిల్వ మాంసాన్ని విక్రయిస్తున్న రెండు దుకాణాలను గత నెల ఎనిమిదో తేదీన వీఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు దుకాణాలూ తిరిగి తెరుచుకున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వీరికి సాక్షాత్తు ఓ మంత్రి ఆశీస్సులు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

కరోనా కాలంలో మాంసం విక్రయాలకు డిమాండ్‌ పెరిగింది. ఆ స్థాయిలో స్థానికంగా లభ్యత లేకపోవడం, ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న ఆశతో హోల్‌సేల్‌ మాంసం విక్రయదారులు అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. వారి దృష్టి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్‌పై పడింది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున గొర్రెల, మేకల తలకాయలు, కాళ్లను నగరానికి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించడం ప్రారంభించారు. అయితే సరైన శీతలీకరణ లేకపోవడంతో అవి చాలా వరకు కుళ్లిపోయిన దశలో నగరానికి చేరుకునేవి. కానీ లాభాల కోసం వ్యాపారులు వాటిని అలాగే విక్రయిస్తున్నారు. నగరంలోని పలు హోటళ్లలోనూ ఇదే మాంసం వినియోగిస్తుండటంతో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గత నెల ఎనిమిదో తేదీన విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో పలు మాంసం దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేశారు. సుమారు 400 కిలోల నిల్వ మాంసాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. రెండు షాపులపై కేసులు నమోదు చేశారు. అయితే నెల కూడా గడవక ముందే మళ్లీ ఆ రెండు మాంసం దుకాణాలు తిరిగి తెరచుకోవడం విస్మయం కలిగిస్తోంది. దీని వెనుక పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది.


మంత్రి అనుచరుల ఒత్తిళ్లు

సీజ్‌ చేసిన దుకాణాలను తెరిపించేందుకు సాక్షాత్తు మంత్రి స్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం మంత్రి అనుచరులు ఇద్దరు సుమారు రూ.25 లక్షలకు సదరు మాంసం విక్రయదారులతో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. దుకాణాలను తెరిపించిన వెంటనే ఆ సొమ్మును వారు జేబులో వేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిబంధనల ప్రకారం కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న వారి షాపులను సీజ్‌ చేస్తే, ముందుగా వారి ట్రేడ్‌ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు ఇవ్వాలి. ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సంజాయిషీ కోరుతూ మరో నోటీసు ఇవ్వాలి. కానీ అలాంటివేవీ లేకుండానే దుకాణాలు తెరచుకోవడం గమనార్హం. నామమాత్రపు జరిమానాతో షాపులను తిరిగి తెరిపించేయడంలో మంత్రి అనుచరులు కీలకపాత్ర పోషించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారికి మంత్రి, ఆయన అనుచరులు అండగా నిలవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 


కరోనా కాలంలోనూ అంతే.. 

కరోనా సమయంలోనూ నాసిరకం శానిటైజర్లు, పీపీఈ కిట్లను తయారు చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘనత సదరు మంత్రి అనుచరులకు ఉంది. తాజాగా తమ జేబులు నింపుకునేందుకు కుళ్లిన మాంసం విక్రయాలు చేస్తున్న వారికి అండగా నిలవడం గమనార్హం. తిరిగి ఆయా దుకాణాలను తెరిచిన వారు మళ్లీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి మాంసం దిగుమతి చేసుకుని, ఆ మాంసాన్నే హోటళ్ల వారికి.. ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అధికారులు ధ్రువీకరించిన తర్వాతే జీవాలను కబేళాలో వధించి, మాంసం విక్రయించాల్సి ఉంటుంది. వీఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో దిగుమతి చేసుకున్న కుళ్లిన మాంసం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2020-12-02T06:22:03+05:30 IST