మటన్‌ మాయ!

ABN , First Publish Date - 2022-07-05T06:38:09+05:30 IST

మాంసం వ్యాపారులు కొందరు మాటన్‌ మాయకు పాల్పడుతున్నారు.

మటన్‌ మాయ!
మాంసాన్ని పరిశీలిస్తున్న వెటర్నరీ అధికారి రవిచంద్‌

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చనిపోయిన గొర్రెలు, మేకల కొనుగోళ్లు

విజయవాడకు తీసుకొచ్చి షాపులకు సరఫరా

 తక్కువ ధరకు చనిపోయిన మేకల కొనుగోలు

 రాణిగారితోటలో 100 కిలోల కుళ్లిన మాంసం గుర్తింపు

మాంసం వ్యాపారులు కొందరు మాటన్‌ మాయకు పాల్పడుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి తాజా అన్నట్టుగా కలరింగ్‌ ఇస్తున్నారు. ఆ మాంసాన్నే వినియోగదారులకు కట్టబెడుతున్నారు. నగరంలో ఈ నిల్వ మాంసం విక్రయాలు కరోనా రెండో దశలో బయట పడ్డాయి. ఇప్పుడు తాజాగా రాణిగారితోట తారకరామ నగర్‌లో నిల్వ మాంసం వెలుగులోకి వచ్చింది. - ఆంధ్రజ్యోతి, జయవాడ 

రూ.1500లకే గొర్రెల కొనుగోలు

మటన్‌ వ్యాపారులు శనివారం తెల్లవారుజామున సంతకు వెళ్లి ఆరోగ్యవంతమైన గొర్రెలు, మేకలను ఎంచుకుని కొనుగోలు చేస్తారు. వాటిని ఆదివారం తెల్లవారుజామున కబేళాకు తీసుకెళ్లి వీఎంసీ వెటర్నరీ, శానిటరీ సిబ్బంది సమక్షంలో వేట వేయిస్తారు. ఈ మాంసంపై వీఎంసీ అధికారులు స్టాంపు వేస్తారు. మార్కెట్లో ఆరోగ్యవంతమైన గొర్రెగానీ, మేకగానీ రూ.15-20వేల ఖరీదు ఉంటుంది. కొంతమంది వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రతి శనివారం తెల్లవారుజామున ఈ సంత నడుస్తోంది. ఇక్కడకు ఎక్కువగా నల్లగొండ, ప్రకాశం జిల్లాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చి యజమానులు విక్రయించుకుంటారు. వాటిలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడిన జంతువులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అటువంటి వాటిని ఈ మటన్‌ బ్రదర్స్‌ రూ.4-5వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇది కాకుండా వినుకొండ సంతలో చనిపోయిన మేకలను రూ.1500 నుంచి రూ.2వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అక్కడే వాటిని శుభ్రం చేయుస్తున్నారు. చర్మం తొలగించి, కడుపులో ఉన్న పేగులను తీయించి ఆ స్థానంలో ఐస్‌ అమర్చుతున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ మాంసాన్ని షాపుల్లో ఉన్న ఫ్రీజర్లలో భద్రపరుస్తున్నారు. 

  అద్దె ఇళ్లలో భద్రపరిచి..

కొంతమంది ప్రత్యేకంగా ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ భద్రపరుస్తున్నారు. వారు విక్రయించేదంతా స్వచ్ఛమైన మాంసం అని ప్రజలు విశ్వసించేలా ఏమాత్రం రాజీపడకుండా కిలో రూ.850లకు అమ్ముతున్నారు. గొల్లపాలెం గట్టు ప్రాంతంలో కుళ్లిపోయి, పురుగులు పట్టిన మాంసాన్ని లోగడ 750 కిలోల వరకు గుర్తించారు. తాజాగా రాణిగారితోటలో హరిమణికం రాము అనే వ్యక్తి తన ఇంటికి సమీపాన మరో ఇంట్లో ఫ్రీజర్లలో భద్రపరిచిన నిల్వ మాంసాన్ని వీఎంసీ అధికారులు బయటకు తీసుకొచ్చారు. 100 కిలోల నిల్వ మాంసాన్ని గుర్తించారు. కృష్ణలంక ప్రాంతంలో ఐదు దుకాణాలకు రాము ఈ మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని అధికారులు నిర్ధారించారు. 

 స్టోరేజ్‌ పాయింట్లలో నిల్వ

కొంతమంది వ్యాపారులు నిల్వ మాంసాన్ని తాజా మాంసంలో మిశ్రమం చేసి విక్రయిస్తున్నారు. కొంతమంది ఈ నిల్వ మాంసాన్ని స్టోరేజ్‌ పాయింట్లలో భద్రపరుస్తున్నారు. దీనికి సంబంధించి పాయింట్ల నిర్వాహకులు వ్యాపారుల నుంచి అద్దె వసూలు చేస్తున్నారు. ఈ విధంగానూ కాసులు జేబుల్లో వేసుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా ఒక పదార్థాన్ని ఫ్రీజర్లలో భద్రపరిచేటప్పుడు దాని శీతోష్టస్థితి 1-2డిగ్రీల మధ్య ఉండాలి. ఈ నిబంధనను మటన్‌ వ్యాపారులు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. 



Updated Date - 2022-07-05T06:38:09+05:30 IST