మటన్‌ మాయ! పాతబస్తీలో నిల్వ మాంసం విక్రయాలు

ABN , First Publish Date - 2020-11-09T15:53:20+05:30 IST

ఓ సామాజిక వర్గానికి నేతలు. అధికార వైసీపీ కార్యకర్తలు..

మటన్‌ మాయ! పాతబస్తీలో నిల్వ మాంసం విక్రయాలు

రెండు దుకాణాల్లో రిఫ్రిజిరేటర్లు

మిగిలిపోయిన మాంసం నిల్వ

నల్లపాడులో అనారోగ్య గొర్రెల కొనుగోలు

కేసులు నమోదు చేయొద్దంటూ వీఎంసీ అధికారులకు నేతల ఫోన్లు


ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఓ సామాజిక వర్గానికి నేతలు. అధికార వైసీపీ కార్యకర్తలు. ఇద్దరు ప్రముఖులకు ముఖ్య అనుచరులు. వీటికి తోడు మటన్‌ వ్యాపారంలో రెండు పదుల అనుభవం. తమకు ఎదురే లేదనుకున్నారు ఆ సోదరులు. వైసీపీ నేతల అండదండలతో పాతబస్తీ ప్రజలకు నిల్వ మాంసాన్ని అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీఎంసీ వెటర్నరీ అధికారి రవిచంద్ర, ఏఎమ్‌ఓహెచ్‌-1 శ్రీదేవితోపాటు శానిటరీ సిబ్బంది ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో నిల్వ గుట్టు బహిర్గతమైంది. మటన్‌ బ్రదర్స్‌ బాగోతం బయటకు వచ్చింది. 


విజయవాడ వన్‌టౌన్‌లోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన సాంబశివరావు, సాయి అన్నదమ్ములు. వారిద్దరూ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ముఖ్య అనుచరులైన కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావులకు అనుచరులు. గడచిన 20 ఏళ్లుగా గొల్లపాలెం గొట్టు ప్రాంతంలో ‘సాయి మటన్‌’ పేరుతో మాంసం వ్యాపారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గానికి మటన్‌ వ్యాపారంలో వారిద్దరే కింగ్‌లు. 


రూ.4వేలకే గొర్రెల కొనుగోలు

సాధారణంగా మటన్‌ వ్యాపారులు శనివారం తెల్లవారుజామున గొర్రెలు, మేకల సంతకు వెళ్లి, ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకుని కొనుగోలు చేస్తారు. వాటిని ఆదివారం తెల్లవారుజామున కబేళాకు తీసుకెళ్లి వీఎంసీ వెటర్నరీ, శానిటరీ సిబ్బంది సమక్షంలో కోయిస్తారు. ఈ మాంసంపై వీఎంసీ అధికారులు స్టాంపు వేస్తారు. మార్కెట్లో ఆరోగ్యవంతమైన గొర్రె గానీ, మేక గానీ రూ.15-20వేల ఖరీదు ఉంటుంది. సాంబశివరావు, సాయి కలిసి అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రతి శనివారం తెల్లవారుజామున ఈ సంత నడుస్తోంది.


ఇక్కడకు ఎక్కువగా నల్లగొండ, ప్రకాశం జిల్లాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చి యజమానులు విక్రయించుకుంటారు. వాటిలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడిన జంతువులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అటువంటి వాటిని ఈ మటన్‌ బ్రదర్స్‌ రూ.4-5వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో జంతువు వద్ద రూ.10వేల వరకు ఆదా చేసుకుంటున్నారు. వాటినే కబేళాలో అధికారుల సమక్షంలో వేట వేస్తున్నారు. విక్రయించగా మిగిలిపోయిన మాంసాన్ని షాపుల్లో ఉన్న ఫ్రీజర్లలో భద్రపరుస్తున్నారు. తాజా మాంసంలో కొంత నిల్వ మాంసాన్ని కలిపేసి ఆదివారం, ఇతర పండగ రోజుల్లో వినియోగదారులకు విక్రయించేస్తున్నారు. వారు విక్రయించేదంతా స్వచ్ఛమైన మాంసం అని ప్రజలు విశ్వసించేలా ఏమాత్రం రాజీపడకుండా కిలో రూ.850లకు అమ్ముతున్నారు. గొల్లపాలెం గట్టు ప్రాంతంలో మటన్‌ వ్యాపారంలో వాళ్లే కింగ్‌లు కావడంతో ప్రజలంతా ఎక్కువగా ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు.


అధికారులు ఆదివారం దాడులు నిర్వహించే సరికి లోపల ఉన్న నిల్వ వ్యవహారం బయటకు వచ్చింది. ఫ్రీజర్లలో మొత్తం 750కిలోల నిల్వ మాంసాన్ని అధికారులకు బయటకు తీయించారు. ఆ మాంసంలో అంగుళం పరిమాణంలో పురుగులు ఉండడం గమనార్హం. ఆ మాంసాన్ని చూడగానే అధికారులు షాక్‌ తిన్నారు. గడచిన నాలుగు రోజులుగా అధికారులు ఈ దుకాణాలపై నిఘా పెట్టి, అసలు స్వరూపాన్ని వినియోగదారుల ముందు ఉంచారు. అధికారులు ఈ రెండు దుకాణాల్లో దాడులు నిర్వహించడంతో మిగిలిన మటన్‌ వ్యాపారులు షాపులను మూసివేసి పారిపోయారు. 


స్టోరేజ్‌ ఇక్కడే

నిల్వ మాంసాన్ని తాజా మాంసంలో కలిపి, వినియోగదారులకు విక్రయించడమే కాకుండా సాంబశివరావు, సాయి ఇక్కడ ఒక స్టోరేజ్‌ పాయింట్‌ను నిర్వహిస్తున్నారు. వారి షాపుల్లో మిగిలిపోయిన మాంసాన్నే కాకుండా, ఆ ప్రాంతంలో ఇతర షాపుల్లో మిగిలిపోయిన మాంసాన్ని కూడా ఇక్కడే స్టోరేజ్‌ చేస్తున్నారు. ఇలా నిల్వ మాంసాన్ని భద్రపరిచినందుకు ఆయా వ్యాపారుల నుంచి అద్దె వసూలు చేస్తారు. ఈ విధంగానూ కాసులు జేబుల్లో వేసుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా ఒక పదార్థాన్ని ఫ్రీజర్లలో భద్రపరిచేటప్పుడు దాని శీతోష్టస్థితి 1-2డిగ్రీల మధ్య ఉండాలి. ఈ నిబంధనను మటన్‌ బ్రదర్స్‌ పాటించకుండా నిల్వ మాంసానికి పురుగులు పట్టించేశారు. 


రంగంలోకి దిగిన ప్రముఖులు

మటన్‌ బ్రదర్స్‌ షాపులను వీఎంసీ అధికారులు సీజ్‌ చేశారని తెలియగానే ప్రముఖులు రంగంలోకి దిగిపోయారు. మటన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నేతలతోపాటు సాంబశివరావు, సాయిలకు అండదండలు ఇస్తున్న వారూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీన్ని మొదటి తప్పిదంగా భావించి ఎలాంటి కేసులు లేకుండా చేయాలని ఫోన్లు చేశారు. అప్పటికే విషయం మీడియాకు ఎక్కడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. మటన్‌ వ్యాపారులకు రెండు లైసెన్స్‌లు ఉండాలి. వ్యాపారానికి సంబంధించి ట్రేడ్‌ లైసెన్స్‌, మాంసాన్ని కోయడానికి ఉపయోగించే కత్తులకు ప్రత్యేకంగా మరొక లైసెన్స్‌ ఉండాలి. వీరికి ఆ రెండు లైసెన్స్‌లు ఉన్నాయా? లేదా? అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల అధికారులు తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేసిన బార్బీ క్యూ నేషన్‌ రెస్టారెంట్‌కు మాంసాన్ని సరఫరా చేసిందీ వీరే కావడం గమనార్హం. 


Updated Date - 2020-11-09T15:53:20+05:30 IST