వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

Published: Sat, 14 May 2022 02:31:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. 

అయితే వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరాలంటే మటన్‌తో ఇలాంటి వంటలను ట్రై చేయండి.


తలకాయ కూర

కావలసినవి: మేక తలకాయ మాంసం - అరకేజీ, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాల - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, నల్ల జీలకర్ర - పావు టీస్పూన్‌.

తయారీ విధానం:  స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేయాలి. కాసేపు వేగిన తరువాత తలకాయ మాంసం వేయాలి. తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.

ఆవిరిపోయిన తరువాత కూరను పాన్‌లోకి మార్చుకుని మళ్లీ స్టవ్‌పై పెట్టాలి. మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాల, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి.

కాసేపు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి.

వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

కబాబ్స్‌

కావలసినవి: ఖీమా - 150గ్రాములు, చికెన్‌ బోన్‌లెస్‌ - 100గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, శొంఠిపొడి - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, జీడిపప్పు పేస్టు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, క్రీమ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌,  శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కోడిగుడ్డు పచ్చసొన - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - గార్నిష్‌ కోసం ఒకకట్ట.


తయారీ విధానం: ఒక బౌల్‌లో ఖీమా, చికెన్‌ వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఆమ్‌చూర్‌పౌడర్‌, శొంఠిపొడి, జీడిపప్పు పేస్టు, క్రీమ్‌, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.

తరువాత శనగపిండి, కోడిగుడ్డు వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు పెట్టాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని బయటకు తీసి కొద్దికొద్దిగా తీసుకుంటూ పుల్లలకు గుచ్చాలి. నూనె వేసుకుంటూ గ్రిల్‌ చేసుకోవాలి. 

సర్వింగ్‌ ప్లేట్‌లోకి మార్చుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని కబాబ్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.


వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

మటన్‌ రోస్ట్‌

కావలసినవి: మటన్‌ - అరకేజీ, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, అల్లం - రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, కారం - ముప్పావు టీస్పూన్‌, ధనియాల పొడి - పావు టీస్పూన్‌, గరంమసాల - అరటీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి మిరియాల పొడి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.

మొదటి విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరిపోయాక మటన్‌ను ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. సోంపు, దంచిన అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేయాలి.

కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలి.

ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని వేయాలి. పెద్ద మంటపై కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.

వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

మటన్‌ కట్‌లెట్స్‌

కావలసినవి: మటన్‌ - అరకేజీ(బోన్‌లెస్‌), అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, బంగాళదుంప - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - చిన్నముక్క, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, గోధుమ బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపను ఉడికించి పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరగాలి.

మటన్‌ను కడిగిన తరువాత నీళ్లు లేకుండా చేతితో గట్టిగా పిండాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారం, పసుపు, బంగాళదుంప, లవంగాలు, దంచిన దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని నిమ్మకాయ సైజంత చేతుల్లోకి తీసుకుని కట్‌లెట్స్‌లా ఒత్తుకోవాలి. తరువాత బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్స్‌ వేసుకుంటూ వేయించాలి. చిన్నమంటపై రెండు వైపులా బాగా కాలేలా వేయించుకోవాలి. 

పుదీనా చట్నీతో తింటే ఈ మటన్‌ కట్‌లెట్స్‌ రుచిగా ఉంటాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.