ప్రియాంకగాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల హ్యాక్

ABN , First Publish Date - 2021-12-21T23:21:44+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాకయ్యాయి...

ప్రియాంకగాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల హ్యాక్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాకయ్యాయి. కుమార్తె మిరాయా వాద్రా (18), కుమారుడు రైహాన్ వాద్రా (20) ఫోన్లు హ్యాక్ అయినట్టు ప్రియాంక గాంధీ స్వయంగా వెల్లడించారు.


ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వారు ఫోన్ల ట్యాపింగ్ మాత్రమే కాదని, తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మరేం పనిలేదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ఫోన్లు అన్నీ ట్యాప్ అయ్యాయని, సంభాషణలను రికార్డు చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయం నుంచి వెళ్లే అన్ని ఫోన్లను వింటున్నారని, ముఖ్యమంత్రి యోగి సాయంత్రం వేళ ఆ రికార్డింగులను వింటున్నారని అన్నారు.


తమకు ఫోన్ చేసే ముందు కొందరు తమ కాల్స్‌ను వింటున్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణలపై స్పందించిన సీఎం యోగి.. అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ యాదవ్ బహుశా అలాగే చేసి ఉంటారని, అందుకనే ఆయన ఇప్పుడలా ఆరోపిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 

Updated Date - 2021-12-21T23:21:44+05:30 IST