దైవంతో నా అనుభవాలు

ABN , First Publish Date - 2021-01-12T06:56:23+05:30 IST

తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘దైవంతో నా అనుభవాలు’ అనే పేరుతో ఎన్‌ఆర్‌ఐ భక్తుడు వెంకట వినోద్‌ పరిమి ఓ పుస్తకాన్ని రాశాడు.

దైవంతో నా అనుభవాలు

ఏడాదిలో పదిసార్లు వెంకన్న దర్శనానికొచ్చే ఎన్‌ఆర్‌ఐ

సింగపూర్‌లో ఉంటూ స్వీయానుభవాలతో పుస్తక రచన


తిరుమల, ఆంధ్రజ్యోతి: ఉద్యోగరీత్యా సింగపూర్‌లో ఎంత బిజీగా వున్నా ఏడాదిలో పదిసార్లు తిరుమలకు రావడం... వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాడీ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు. గత 30 ఏళ్లలో దాదాపు 200 సార్లు వెంకన్నను దర్శించుకోవడమే కాకుండా భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలనూ సందర్శించిన ఈయన పేరు వెంకట‌ వినోద్‌ పరిమి. లాక్‌డౌన్‌ సమయంలో ఆధ్యాత్మిక పర్యటన వీలుకాకపోవడంతో తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘దైవంతో నా అనుభవాలు’ అనే పేరుతో  పుస్తకాన్ని రాశాడు.ఆ పుస్తకాలు విక్రయించగా వచ్చే ఆదాయాన్ని టీటీడీ గోసంరక్షణ ట్రస్టుకు ఇచ్చేస్తానంటున్న వెంకట వినోద్‌తో ‘ఆంధ్రజ్యోతి’  మాటామంతి. వివరాలు ఆయన మాటల్లోనే.. విశాఖపట్నం జిల్లాలోని వడ్డాది గ్రామంలో 1972లో ఓ పేద కుటుంబంలో జన్మించా. అన్నయ్య, అక్కతో కలిసి అక్కడే చదువుకునే వాళ్లం. ఆ తర్వాత నాన్న 1988లో ఒడిశాలోని బరంపురం తీసుకెళ్లారు. అక్కడ డిప్లొమాలో చేరా. ఏడాదికి రూ.35 ఖర్చుతో చదువు పూర్తి చేశా. ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం.మైనింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేసే నాన్న అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా జిరాక్స్‌ మిషన్‌ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. నా చదువు పూర్తికాబోతున్న ఏడాదికి ముందు నాన్న చనిపోయారు. ఆ తర్వాత కూడా ఎన్నో ఇబ్బందుల నడుమ చదువు పూర్తి చేసి 1996 నుంచి చిన్నపాటి ఉద్యోగాలు చేయడం మొదలెట్టా. కోల్‌కాతా, ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశా.2008లో జర్మన్‌ కంపెనీ ‘మీలే’లో ఉద్యోగం వచ్చింది.ఆ తర్వాత 2014లో పదోన్నతిపై దుబాయ్‌కి వెళ్లిన నేను రెండేళ్లకు ముందు సింగపూర్‌ వచ్చా.ప్రస్తుతం మీలేలో రీజనల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. ఇప్పుడే కాదు...యువకుడిగా ఉన్నప్పటి నుంచీ  తిరుమలకు వచ్చేవాడిని. 2007లో అమ్మ చనిపోయిన తర్వాత తిరుమలకు రావడం ఓ అలవాటు చేసుకున్నా. 2014లో ఉద్యోగరీత్యా దుబాయ్‌ వెళ్లినప్పటికీ సమయం కుదుర్చుకుని తిరుమలకు వచ్చి వెళ్లేవాడిని.ఏడాదిలో కనీసం పదిసార్లు వస్తుంటా. ఇప్పటికి దాదాపు 200 సార్లు వచ్చా. ఈ నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎన్నటికీ అపకూడదనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు స్వయంగా అనుభవించా. నా పాస్‌పోర్టు చూసిన  ఇమిగ్రేషన్‌ అధికారులకు సందేహం కూడా వచ్చింది. ‘నెలకోసారి వస్తున్నావ్‌.. స్మగ్లింగ్‌ చేస్తున్నావా’ అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


స్వీయానుభవాలతో పుస్తకం

నిత్యం ధ్యానం చేయడం నాకు అలవాటు.ఈ క్రమంలో దైవంతో నాకు అనుభవాలు ఎక్కువయ్యాయి. నన్నడిగితే దేవుడు ఒకే రూపంలో ఉంటాడని చెప్పను. మనకు సాయం చేసిన, ప్రమాదం నుంచి కాపాడిన వాళ్లలోనూ దేవుడిని గుర్తించగలగాలి. అప్పుడే దేవుడిని చూసిన అనుభూతి లభిస్తుంది. ఏడాదిలో 30 రోజులు తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉంటా.ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు, అనుభూతులు. వీటన్నింటి ఆధారంగా ఓ పుస్తకం రాయాలన్పించింది. విజయనగరం జిల్లా నెలిమర్లలో ఉండే నా చిన్ననాటి స్నేహితుడు రమేష్‌కుమార్‌ సహాయంతో పుస్తకానికి శ్రీకారం చుట్టా. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ ఫ్రం హోం కావడంతో సింగపూర్‌లోనే ఉంటూ గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో ఈ పుస్తకాన్ని పూర్తి చేశా.దీని అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని టీటీడీ గోసంరక్షణ ట్రస్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా.35 అంశాలతో మార్కెట్‌లోకి తీసుకొచ్చిన దైవంతో నా అనుభవాలు  పుస్తకం మొత్తం తెలుగులోనే ఉంటుంది. నన్నడిగితే కొన్ని అద్భుతమైన భావాలను తెలుగులోనే స్పష్టంగా వర్ణించగలం. 

Updated Date - 2021-01-12T06:56:23+05:30 IST