నా గుండె నుంచి రక్తం కారుతోంది : గులాం నబీ ఆజాద్

ABN , First Publish Date - 2022-03-11T22:21:10+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలవడంతో

నా గుండె నుంచి రక్తం కారుతోంది : గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలవడంతో తన గుండె నుంచి రక్తం స్రవిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రాన్ని తమ పార్టీ కోల్పోతండటాన్ని చూడటం చాలా ఆవేదన కలిగిస్తోందన్నారు. 


‘‘నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో మా ఓటమిని చూడటానికి నా గుండె నుంచి రక్తం స్రవిస్తోంది. మేం మా జవసత్వాలన్నిటినీ, మా జీవితాలను పార్టీ కోసం అంకితం చేశాం. లోపాలు, బలహీనతలన్నిటినీ పార్టీ నాయకత్వం గమనిస్తుందనుకుంటున్నాను. వీటి గురించి మా సహచరులు, నేను కొంత కాలం నుంచి మాట్లాడుతున్నాం’’ అని ఆజాద్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. 


ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆ పార్టీ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. 2014 తర్వాత జరిగిన 45 ఎన్నికల్లో ఐదింటిలో మాత్రమే ఆ పార్టీ విజయాలు సాధించింది. అయినప్పటికీ ఆత్మావలోకనం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 


పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు నేపథ్యంలో కొత్త రక్తానికి చోటు ఇవ్వాలని కాంగ్రెస్ యువ నేతలు కోరుతున్నారు. శశి థరూర్ గురువారం రాత్రి ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఇటీవలి శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారందరినీ బాధిస్తున్నాయి. కాంగ్రెస్ సమర్థిస్తున్న భారత దేశ భావనను, దేశానికి ఇస్తున్న పాజిటివ్ అజెండాను పునరుద్ఘాటించవలసిన, ఆ సిద్ధాంతాలను మళ్ళీ రగిలించేవిధంగా, ప్రజలను ప్రేరేపించే విధంగా మన సంస్థాగత నాయకత్వాన్ని సంస్కరించవలసిన సమయం ఆసన్నమైంది. ఒక విషయం సుస్పష్టం - మనం గెలవాలంటే మార్పు అనివార్యం’’ అని పేర్కొన్నారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే పంజాబ్ ఉందని, చాలా మంది కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. ఈ సవాలు గురించి కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసా? అని ప్రశ్నించారు. ఒకవేళ తెలిస్తే, ఏమైనా చేస్తున్నారా? అంటూ దీని గురించి నిజంగా తనకేమీ తెలియదన్నారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలను సాధించలేకపోయింది. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 2 స్థానాలు లభించాయి. 117 స్థానాలున్న పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు దారుణంగా దెబ్బతింది. కేవలం 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలు ఉన్నాయి, వీటిలో కాంగ్రెస్‌కు కేవలం 19 స్థానాలు మాత్రమే లభించాయి. 40 స్థానాలున్న గోవాలో ఆ పార్టీకి 12 స్థానాలు లభించాయి. మణిపూర్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్‌ 5 స్థానాలకు పరిమితమైంది. 



Updated Date - 2022-03-11T22:21:10+05:30 IST