దుబాయ్ వెళ్ళడానికి రూ.10 లక్షల కోసం భార్యను వేధించిన భర్త

ABN , First Publish Date - 2022-04-14T19:41:01+05:30 IST

ఉద్యోగం చూసుకోవడానికి దుబాయ్ వెళ్తానంటూ తన భర్త తనను వేధిస్తున్నారని

దుబాయ్ వెళ్ళడానికి రూ.10 లక్షల కోసం భార్యను వేధించిన భర్త

అహ్మదాబాద్ : ఉద్యోగం చూసుకోవడానికి దుబాయ్ వెళ్తానంటూ తన భర్త తనను వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ నివాసి అని, తాము 2008లో జరిగిన సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ తన భర్త, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. 


గుజరాత్‌లోని వాట్వా గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళ ఈ ఫిర్యాదు చేశారు. తమ పెళ్లి తర్వాత నాలుగు రోజులపాటు దుంగార్‌పూర్‌లో తాను ఉన్నానని, అనంతరం తాను అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి, కలుపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జీవిస్తున్నానని తెలిపారు. తన భర్త కుటుంబం ఆ తర్వాత ఈ నగరానికి వచ్చిందన్నారు. తమకు వివాహం జరిగి 7 నెలలైనా పూర్తి కాకుండానే తన అత్తింటివారు తనను వేధించడం ప్రారంభించారని చెప్పారు. తన భర్త దుబాయ్ వెళ్ళడం కోసం రూ.10 లక్షలు ఇవ్వాలని తనను వేధిస్తున్నారన్నారు. ఈ డిమాండ్ మేరకు డబ్బును తన తల్లిదండ్రుల నుంచి తీసుకురావడానికి తాను నిరాకరించడంతో తనపై దాడి చేసి, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. 


కొంత కాలం తర్వాత తనను దుంగార్‌పూర్ తీసుకెళ్ళారని, అక్కడ తన భర్త, ఆయన తరపు బంధువులు తనను తీవ్రంగా బెదిరించారని, తనను చంపుతామని హెచ్చరించారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. మరికొంత కాలం తర్వాత తన భర్త కువైట్ వెళ్లారని, అప్పటి నుంచి తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పారు.  తన భర్త తరపు బంధువులు తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ రోజు తనను వారు కొడుతుండగా, పొరుగింటి వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఆయనను కూడా వారు కొట్టారని తెలిపారు. దీంతో తాను మళ్లీ అహ్మదాబాద్ వచ్చి, ఫిర్యాదు చేశానని చెప్పారు. 


Updated Date - 2022-04-14T19:41:01+05:30 IST