బైడెన్ తొందరపడొద్దు.. నా ఆధిక్యం తిరిగొస్తుంది: ట్రంప్

ABN , First Publish Date - 2020-11-08T00:30:49+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు.

బైడెన్ తొందరపడొద్దు.. నా ఆధిక్యం తిరిగొస్తుంది: ట్రంప్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వస్తే... డొనాల్డ్ ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. వీటిలో మూడింట ప్రస్తుతం బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ కావడం దాదాపు ఖరారయిందనే చెప్పాలి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బైడెన్ వాల్మింగ్టన్ నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లు చెప్పారు. 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు పొందుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు ట్వీట్లు చేశారు. 


"బైడెన్ నీవు తొందరపడి గెలిచినట్లు ప్రకటించకు. నేను అలాగే ప్రకటించుకున్నాను. కావున నేను చేసిన తప్పు నీవు చెయ్యొద్దు. చట్టపరమైన చర్యలు ఇప్పుడే మొదలుకాబోతున్నాయి. ఎన్నికలు ముగిసిన రాత్రి నాకు భారీ ఆధిక్యం ఉంది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచి నా ఆధిక్యం తగ్గిపోయింది. న్యాయ విచారణల అనంతరం నా ఆధిక్యం నాకు తిరిగొస్తుంది." అని ట్రంప్ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. ఇక 538 ఓట్లున్న ఎలక్టోరల్‌ కాలేజీలో అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 270కి గురువారమే చేరువగా వచ్చేసిన బైడెన్ మరో రెండు స్వింగ్‌ రాష్ట్రాలు జార్జియా, పెన్సిల్వేనియాల్లో కూడా ముందంజలోకొచ్చేశారు. ఇక్కడ ఆయన ఆధిక్యం స్వల్పమే అయినా లెక్కింపు సరళి ఆయనకే విజయాన్ని అందించేట్లుంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. కాగా, బ్యాలెట్ ఓట్లలో అధిక శాతం ఓట్లు బైడెన్‌కే పడుతున్నాయి. కనుక ఈ రాష్ట్రాల్లో ఆయన విజయం నల్లేరు మీద నడకనే అనేది విశ్లేషకుల అభిప్రాయం. అటు 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవెడాలోనూ బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అందుకే ఈ మూడింటిలో ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచిన అధ్యక్ష పీఠం ఆయనదే.     





Updated Date - 2020-11-08T00:30:49+05:30 IST