నా జీవితం ఖానాపూర్‌ ప్రజలకే అంకితం

ABN , First Publish Date - 2021-06-21T06:50:14+05:30 IST

రాబోయే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయనని, తాను ఎంపీ సోయం బాపూరావుకు పోటీ కాదని కేవలం ఖానాపూర్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తన జీవితాన్ని ఖానాపూర్‌ ప్రజలకే అంకితం చేస్తానని మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ స్పష్టం చేశారు.

నా జీవితం ఖానాపూర్‌ ప్రజలకే అంకితం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌

మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌

ఉట్నూర్‌, జూన్‌ 20: రాబోయే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయనని, తాను ఎంపీ సోయం బాపూరావుకు పోటీ కాదని కేవలం ఖానాపూర్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తన జీవితాన్ని ఖానాపూర్‌ ప్రజలకే అంకితం చేస్తానని మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక మాజీ ఎంపీ నివాసంలో ఉట్నూర్‌ మండల బీజేపీ నాయకుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలకు పోటీగా ఉండడం లేదని, మూడు అసెంబ్లీ నియోజక వర్గా లు, ఒక పార్లమెంటు నియోజక వర్గం గిరిజనుల కోసం రిజర్వు చేసినందున ఆదివాసీలు, లంబాడాలు ఎవరైన పోటీ చేసే అవకాశాలు ఉంటాయని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సట్ల అశోక్‌ పోటీ చేసినందున ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ మంచి పదవి ఇవ్వాలని ఇది వరకే బీజేపీ అధిష్ఠానానికి తెలిపానని అన్నారు. తాను ఖానాపూర్‌ నియోజక వర్గంలో ఇంటింటికీ రాథోడ్‌ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాతే మెజార్టీ ప్రజలు  చెప్పినందున బీజేపీలో చేరానని అన్నారు. బీజేపీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలతో పాటు తన వెంట ఉన్న క్యాడర్‌కు సంపూర్ణ న్యాయం చేస్తానని అన్నారు. రాష్ట్రంలో వెలమదొరల పాలన సాగిస్తున్నారని, రైతు బంధు పథకం వారికోసమేనని అన్నారు. ఖానాపూర్‌కు చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావుకు ఐదు వందల ఎకరాలు ఉంటే  ఏటా రూ.50 లక్షలు రైతు బంధు సహాయం అందుకుంటున్నారని, ఈ తరహలో రాష్ట్రంలో కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల భూములు వెలమ దొరల స్వాధీనంలో ఉన్నాయని అన్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఉట్నూర్‌లో 80 గృహాలు పూర్తి చేస్తే వేలాది మంది బీదలు ఉంటే ఎవరికి న్యాయం చేస్తారని  ప్రశ్నించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథల పేరుతో లక్షలాది కోట్లు  దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు.  ఈ సమావేశంలో బీజేపీ జాతీయ గిరిజన మోర్చా కార్యదర్శి శ్రీరాంనాయక్‌తో పాటు జిల్లా కార్యదర్శులు కోండేరి రమేష్‌, దత్తు, రాష్ట్ర మహిళా నాయకురాలు కడమండ్ల రాజమణి, జిల్లా నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:50:14+05:30 IST