నా పతకం అభిమానులకు అంకితం

ABN , First Publish Date - 2021-08-06T09:07:22+05:30 IST

క్రీడాభిమానుల ఆదరణ, తల్లిదండ్రులు, ప్రభుత్వ సహకారంతోనే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించానని, ఈ మెడల్‌ని అభిమానులకు అంకితమిస్తున్నానని

నా పతకం అభిమానులకు అంకితం

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు..

విజయవాడలో మంత్రులు, క్రీడాకారులు ఘనస్వాగతం 


విజయవాడ (భవానీపురం), ఆగస్టు 5: క్రీడాభిమానుల ఆదరణ, తల్లిదండ్రులు, ప్రభుత్వ సహకారంతోనే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించానని, ఈ మెడల్‌ని అభిమానులకు అంకితమిస్తున్నానని బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. ఒలింపిక్‌ పతకం సాధించిన తర్వాత గురువారం తొలిసారిగా విజయవాడకు చేరుకున్న ఆమెకు ఉన్నతాధికారులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. హోటల్‌ నోవాటెల్‌లో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి.. బొకేలతో సింధూని అభినందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం తేవడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపింది. భవిష్యత్‌లో దేశం కోసం మరిన్ని పతకాలు సాధిస్తానని, అకాడమీ ద్వారా క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించింది.


మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సింధు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి యువతలో స్ఫూర్తి నింపిందన్నారు. సింధు తల్లిదండ్రులు వెంకటరమణ, విజయ మాట్లాడుతూ.. సెమీ్‌సలో ఓడినప్పటికీ.. నిరాశ చెందకుండా కాంస్య పతకపోరులో అద్భుత ఆటతీరు కనబర్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌, బాయ్‌ ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి, బాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర సెక్రటరీ అంకమ్మ చౌదరి, శాప్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-06T09:07:22+05:30 IST