మోదీతో అందుకే విభేదిస్తున్నా: రాహుల్

ABN , First Publish Date - 2021-09-29T21:05:50+05:30 IST

ప్రజల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి మోదీ తెగగొడుతున్నారని, మోదీతో తన సమస్య అదేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

మోదీతో అందుకే విభేదిస్తున్నా: రాహుల్

మలప్పురం: ప్రజల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి మోదీ తెగగొడుతున్నారని, మోదీతో తన సమస్య అదేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారంనాడు ఒకరోజు పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మోదీపై విమర్శలు గుప్పించారు. ఇండియాను ఒక ప్రాంతంగానే వాళ్లు చెబుతున్నారని, అయితే తాము మాత్రం ఇండియా అంటే ప్రజలు, వారి మధ్య సబంధ బాంధవ్యాలు అని చెబుతున్నామని అన్నారు. ఇండియా అంటే హిందువులు-ముస్లింల మధ్య, హిందూ, ముస్లింలు, సిక్కులు మధ్య, తమిళ, హిందూ, ఉర్దూ, బెంగాలీ ప్రజల మధ్య సంబంధాలని ఆయన అన్నారు. అయితే ఆ సంబంధాలను మోదీ తెగగొడుతున్నందునే ఆయనతో తాను విభేదిస్తున్నానని పేర్కొన్నారు.


దేశ ప్రజల మధ్య సంబంధాలను వాళ్లు తెగ్గొట్టుకుంటూ పోవడమంటే 'ఐడియా ఆఫ్ ఇండియా'పై దాడి చేయడమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య సంబంధాల విచ్ఛతి జరుగుతున్నందునే ప్రజల మధ్య అంతరాలను తొలగించడమే తన కర్తవ్యంగా భావిస్తున్నానని, అందుకు తాను కట్టుబడి ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-29T21:05:50+05:30 IST