నా పబ్లిక్- నా రిపబ్లిక్
ABN , First Publish Date - 2022-01-26T06:53:03+05:30 IST
రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా పబ్లిగ్గా... భేషుగ్గా... ఇది నా రాజ్యం... ఇక్కడ రాజ్యాంగమే నా రక్షణ కవచం...
రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా
పబ్లిగ్గా... భేషుగ్గా...
ఇది నా రాజ్యం...
ఇక్కడ రాజ్యాంగమే నా రక్షణ కవచం
రాజులుండరు, బంట్లుండరు
రాజ్యాంగం ఎవడి జాగీరూ కాదు
అందరూ కౌలుదార్లే, అందరూ చౌకీదార్లే
జెండా ఎగరేసి చెబుతున్నా
సహజీవనంలో
స్వేచ్ఛ నీ మోచేతికింది నీరు కాదు
రాజ్యాంగం పీల్చి వదిలే గాలులే
ఇక్కడ నా జెండాకు స్వేచ్ఛావాయువులు
జన్మతః నేను హిందువును
గర్వపడుతున్నా...
నన్ను చూసి నా మతమే కాదు
నా భారతీయత గర్వపడాలి...
జన్మతః నేను ముసల్మానును
గర్వపడుతున్నా...
నన్ను చూసి నా మతమే కాదు
నా దేశప్రజలు గర్వపడాలి...
జన్మతః నేను క్రిస్టియన్‌ను
గర్వపడుతున్నా
నన్ను చూసి నా మతమే కాదు
నా దేశ పతాకం గర్వపడాలి...
జన్మతః నేను భారతీయుణ్ణి
గర్వపడుతున్నా...
నా భారతీయత ఇక
ఎవరెస్టంత ఎదగాలి...
ప్రపంచమంతటా వెలగాలి
భక్తి: ఈ దేశానికి దాంతో సంబంధం లేదు
అది నీకూ నీ దేముడికీ మధ్య డీల్
కులం : నా రాజ్యానికి దాంతో సంబంధం లేదు
అది నీకూ నీ సమాజానికి మధ్య డీల్
మతం : నా రాజ్యాంగానికి దాంతో సంబంధం లేదు
అది నీకూ నీ వర్గానికీ మధ్య డీల్
రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా
పబ్లిగ్గా...భేషుగ్గా...
ఇదే నా మతం, నా ప్రజల అభిమతం
ఇదే నా దేశం, ఇదే నా పతాకం
జన్మజన్మల బంధం
ఇదే నా భారతీయం
చినవ్యాసుడు