నా భార్య మగాడు.. చర్యలు తీసుకోరూ ప్లీజ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త

ABN , First Publish Date - 2022-03-13T01:59:35+05:30 IST

కొన్ని ఘటనలు కొందరిని కంటతడి పెట్టిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్నింటిని నమ్మడానికి..

నా భార్య మగాడు.. చర్యలు తీసుకోరూ ప్లీజ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త

న్యూఢిల్లీ: కొన్ని ఘటనలు కొందరిని కంటతడి పెట్టిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్నింటిని నమ్మడానికి కొంత సమయం పడుతుంది. నిజమేనని తేలాక దాని నుంచి తేరుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. తాజాగా సుప్రీంకోర్టుకు వచ్చిన ఓ కేసులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఓ వ్యక్తి తన భార్య మగాడంటూ ఆధారాలతో సహా కోర్టుకెక్కాడు. అంతేకాదు, తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన ఆమె (అతడి)పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. 


ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువకుడు 2016 వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే తన భార్య మహిళ కాదని, ఆమెకు పురుష జననేంద్రియాలు ఉన్నట్టు యువకుడు గుర్తించాడు. దీంతో 2017లో మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించి తన భార్య, ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. గ్వాలియర్ మేజిస్ట్రేట్ మే 2019లో అతడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారు.  


మరోవైపు, భర్త తనను కట్నం కోసం క్రూరంగా హింసిస్తున్నాడంటూ ఆమె ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. అయితే, అక్కడ మాత్రం అతడు తన భార్యను ‘ఆమె’గానే పేర్కొన్నాడు. ఇంకోవైపు, తన భార్య.. స్త్రీ కాదన్న ఫిర్యాదు నేపథ్యంలో మేజిస్ట్రేట్ ఆదేశాలతో గ్వాలియర్ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరి వాంగ్మూలాలు రికార్డు చేశారు. అనంతరం ఆమెకు, ఆమె తండ్రికి సమన్లు జారీ చేశారు.


తమపై సమన్లు జారీ కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 2021లో వారి అప్పీలును ఆమోదించిన హైకోర్టు మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తోసిపుచ్చింది. భార్యను దోషిగా నిర్ధారించేందుకు వైద్యపరమైన సాక్ష్యాధారాలు సరిపోవని స్పష్టం చేసింది. ఆ వ్యక్తి వాంగ్మూలానికి పెద్దపీట వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.


దీంతో కేసు సుప్రీంకోర్టును చేరింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తొలుత ఈ పిటిషన్‌ను విచారించేందుకు సంకోచించింది. అయితే, తన భార్యకు పురుషాంగంతోపాటు ఆమె కన్నెపొర (హైమెన్) అసంపూర్తిగా ఉందని నిర్ధారించే వైద్య నివేదికను సమర్పించిన తర్వాత ఆమె స్పందనను కోరింది. 

 

బాధిత యువకుడి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎన్‌కే మోదీ.. మహిళగా నమ్మించి భర్తను మోసం చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.  నిస్సందేహంగా ఇది మోసమేనని, దయచేసి వైద్యుల నివేదికను పరిశీలించాలని కోర్టును కోరారు. ఇదేదో పుట్టుకతో వచ్చిన రుగ్మత కాదని, తన జననాంగాల గురించి కచ్చితంగా తెలిసి కూడా ఆమె తన క్లయింట్‌ను వివాహం చేసుకుందని చెప్పారు.  


స్పందించిన న్యాయస్థానం అసంపూర్ణమైన హైమెన్ ఉన్నంత మాత్రాన ఆమె స్త్రీ కాదని చెప్పగలరా? అని ప్రశ్నించింది. వైద్య నివేదిక ప్రకారం ఆమె అండాశయాలు సాధారణంగా ఉన్నాయన్న దాని గురించి ఏం చెబుతారని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది ఎన్‌కే మోదీ బదులిస్తూ.. ఆమెకు అసంపూర్తి హైమెన్ ఉండడమే కాకుండా పురుషాంగం కూడా ఉందని గుర్తు చేశారు. ఆమెకు పురుషాంగం ఉన్నప్పుడు ఆమె ‘స్త్రీ’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. 


దీంతో మరోమారు స్పందించిన ధర్మాసనం మీరు సరిగ్గా ఏం కోరుకుంటున్నారని ప్రశ్నించింది. బదులుగా.. ‘మహిళ’తోపాటు ఆమె తండ్రిపై  నమోదైన  ఎఫ్ఐఆర్‌ను సక్రమంగా విచారించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తన క్లయింట్ జీవితాన్ని మోసం చేసినందుకు కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. అలాగే, తన క్లయింట్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆరు వారాల్లోగా స్పందించాలంటూ కోర్టు.. ‘మహిళ’కు ఆమె తండ్రికి, మధ్యప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.  

 


Updated Date - 2022-03-13T01:59:35+05:30 IST