చెప్పిందొకటి.. చేయించేది మరొకటి.. Kuwait లో ఓ మహిళకు నరకం.. నెలకు రూ.60 వేల జీతమని తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు..

ABN , First Publish Date - 2022-06-22T17:42:50+05:30 IST

ఉన్నా ఊరిలో ఉపాధి కరువై భారత్ నుంచి గల్ఫ్‌ వెళ్లేవారు చాలా మంది ఉంటారు. వారిని మోసగించి లాభపడే ఏజెంట్స్‌కు కూడా కొదవ ఉండదు.

చెప్పిందొకటి.. చేయించేది మరొకటి.. Kuwait లో ఓ మహిళకు నరకం.. నెలకు రూ.60 వేల జీతమని తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు..
ప్రతీకాత్మక చిత్రం..

కొచ్చి: ఉన్నా ఊరిలో ఉపాధి కరువై భారత్ నుంచి గల్ఫ్‌ వెళ్లేవారు చాలా మంది ఉంటారు. వారిని మోసగించి లాభపడే ఏజెంట్స్‌కు కూడా కొదవ ఉండదు. అవసరం కొద్ది తమవద్దకు వచ్చిన అమాయకులను వేలల్లో జీతాలు, మంచి సౌకర్యాలు, అనుకూలమైన సమయంలో పని, ఉచిత వీసాలు అంటూ కళ్ల ముందే స్వర్గం చూపిస్తారు. తీరా వారి మాటలు నమ్మి అక్కడికి వెళ్తేగానీ తెలియదు.. అవన్నీ కారుకూతలేనని. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడం, పెద్దవారికి సేవ అంటూ కల్లుబొల్లి కబుర్లు చెప్పి తీసుకెళ్లి.. అక్కడికి వెళ్లిన తర్వాత గొడ్డుచాకిరీ చేయిస్తారు. సమయపాలన ఉండదు. పొద్దుపొడవకముందే పనిలో చేరితో ఏ అర్ధరాత్రికో వదులుతారు. యజమానులు చెప్పిందల్లా చేయాల్సిందే. లేకపోతే శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తారు. అచ్చం ఇలాగే కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన ఓ మహిళ విషయంలో కూడా జరిగింది. 


ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకోవాలని, దానికి నేలకు రూ.60వేల జీతమని కువైత్ తీసుకెళ్లి నరకం చూపించారు. అర్ధరాత్రి వరకు పని చేయించుకుని కనీసం తినడానికి ఆహారం కూడా ఇచ్చేవారు కాదట. యజమాని నుంచి ఎలాగోలా తప్పించుకుని తనను పనికి కుదిర్చిన ఏజెంట్ వద్దకు వెళ్తే.. తిరిగి ఇండియాకు పంపించేందు ఆమె భర్త నుంచి ఏకంగా రూ.3.50లక్షలు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకపోతే మీ భార్యను ఐసీస్ తీవ్రవాద సంస్థకు అమ్మేస్తానని బెదిరించారు. చివరికి వారు అగినంత ఇచ్చి స్వదేశానికి వచ్చిన మహిళ తనను కువైత్ పంపించిన ఏజెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


అసలేం జరిగిందంటే.. 

కొచ్చికి చెందిన బాధితురాలు న్యూస్ పేపర్‌లో కేర్‌టేకర్(కువైత్‌లో) జాబ్ కోసం ఇచ్చిన ప్రకటన చూసి అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేసింది. అనంతరం వారు చెప్పిన ఎర్నాకులం‌లోని  ఏజెన్సీ ఆఫీస్‌కు వెళ్లి వారిని కలిసింది. ఆ సమయంలో అజుమాన్‌, మజీద్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాట్లాడారు. ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకోవాలని, నెలకు రూ. 60వేల జీతం ఉంటుందని చెప్పారు. విమాన టికెట్‌తో పాటు వీసా కూడా ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. అంతేగాక వారి ఏజెన్సీ ద్వారా అంతకుముందు కువైత్ వెళ్లి పనిచేస్తున్న కొందరు మహిళల ఫొటోలు కూడా చూపించారు. అవన్ని చూసిన తర్వాత అంత బాగానే ఉన్నట్లు భావించిన ఆమె కువైత్ వెళ్లేందుకు అంగీకరించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమెను కువైత్ పంపించారు. 


అంతే.. దుబాయ్‌లో దిగగానే గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి బలవంతంగా ఆమె వద్ద నుంచి పాస్‌పోర్ట్ తీసేసుకున్నాడు. ఒకవేళ తాను చెప్పినట్లు వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని బెదరించాడు. దాంతో బాధితురాలు ఆయనతో పాటు కువైత్‌లోని మజీద్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ నుంచి తీసుకెళ్లి ఆమె ఓ ఇంటి వద్ద దించేసి వెళ్లారు. ఆ ఇంట్లోనే ఆమె కేర్‌టేకర్‌గా పని చేయాల్సింది. ఇంతవరకు బాగానే ఉంది. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకుంది. కానీ, ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లోని వారు పనులు చెప్పడం మొదలెట్టారు. మొదట కేవలం పిల్లలను మాత్రమే చూసుకోవాలని చెప్పి, ఆ తర్వాత తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు నాన్-స్టాప్‌గా పనులు చెప్పడం చేశారు. చేయకపోతే శారీరకంగా, మానసికంగా హింసించేవారు. 


దాంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని మజీద్ ఆఫీస్‌కు వెళ్లి విషయం చెప్పింది. తాను అక్కడ ఉండలేనని తనను స్వదేశానికి పంపించాలని కోరింది. అప్పుడు అసలు విషయం చెప్పారు. ఆమెను రూ.3.50లక్షలకు ఎర్నాకులం ఏజెన్సీ వారు తమకు విక్రయించినట్లు చెప్పడంతో మహిళ షాక్ అయ్యింది. స్వదేశంలోని భర్తకు ఫోన్ ద్వారా ఈ విషయం చెప్పింది. దాంతో ఆమె భర్త మజీద్ ఆఫీస్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. మీ భార్యను ఇండియాకు పంపించాలంటే తాము ఏజెన్సీ వారికి ఇచ్చిన రూ.3.50లక్షలు కట్టాలని, లేనిపక్షంలో ఆమెను టెర్రరిస్టులకు అమ్మేస్తానని వారు బెదిరించారు. చేసేదేమికలేక వారు అడిగినంత సర్దుబాటు చేసి భార్యను స్వదేశానికి రప్పించాడు. కొచ్చికి చేరుకున్న తర్వాత బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎర్నాకులంకు చెందిన అజుమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మజీద్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2022-06-22T17:42:50+05:30 IST