వీడిన సింహాచలం హత్య కేసు మిస్టరీ

ABN , First Publish Date - 2022-06-26T04:40:13+05:30 IST

మండల శివారు చినగొల్లలపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఈనెల 19 రాత్రి జరిగిన స్వయంవరపు సింహాచలం (36) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వీడిన సింహాచలం హత్య కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న అనకాపల్లి డీఎస్పీ సునీల్‌

వివాహేతర సంబందం నేపథ్యంలోనే దారుణం

చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

సబ్బవరం, జూన్‌ 25: మండల శివారు చినగొల్లలపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఈనెల 19 రాత్రి జరిగిన స్వయంవరపు సింహాచలం (36) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌  శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సబ్బవరానికి చెందిన స్వయంవరపు సింహాచలం నాలుగేళ్ల కిందట విశాఖ ఎన్‌ఏడీ ప్రాంతంలో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలు, కాల్‌ రికార్డింగ్‌లను చూపించి, బెదిరించి సుమారు రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆభరణాలను తాకట్టు నుంచి విడిపిస్తానని చెప్పి, ఆమె నుంచి పలు దపాలు మరింత డబ్బు వసూలుచేశాడు. అంతేకాకుండా వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె చెల్లెలితో పాటు మరి కొందరు మహిళల వద్ద డబ్బు తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లిపురం ప్రాంతానికి చెందిన గోవింద్‌తో సంబంధం పెట్టుకుంది. సింహాచలం తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న విషయం అతడికి చెప్పి, తనకు సహకరించి, సింహాచలం అడ్డుతొలగించాలని కోరింది. రంగంలోకి దిగిన గోవింద్‌ సింహాచలంను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరం కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామంటూ అతడితో కొద్దినెలలు స్నేహం కొనసాగించాడు.  ఈ నేపథ్యంలో వారిద్దరూ పలుమార్లు మద్యం సేవించారు. ఈ క్రమంలో గత 25న వీరిద్దరూ జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో మద్యం సేవించారు. అప్పటికే సింహాచలాన్ని చంపేయాలని ప్రణాళిక వేసుకున్న గోవింద్‌ తనతో తెచ్చుకు రాడ్డుతో అతడి తలపై గట్టిగా మోదాడు. కిందపడిపోయిన అతడిని చాకుతో పీకకోసి చంపేశాడు. సింహాచలం భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి, సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. 



పట్టిచ్చిన కాల్‌ డేటా 

కాగా ఈ కేసులో నిందితుడి ఫోన్‌కాల్‌ డేటా పోలీసులకు సహాయపడింది. సింహాచలంతో పాటు పేకాట, బెట్టింగ్‌లలో పాల్గొన్న వారిని పోలీసులు విచారించారు. దీంతో అతడి వివాహేతర సబంధం, మహిళలను బెదిరించి డబ్బు, బంగారం వసూలు చేయడం తదితర అక్రమాలు వెలుగుచూశాయి. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తం కాల్‌డేటాను సేకరించారు. దీని ఆధారంగా గోవింద్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అతడిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో గోవింద్‌ శుక్రవారం విజయవాడ నుంచి కారులో పెందుర్తి వైపు వెళ్తుండగా పోలీసులు గమనించారు. వారిని చూసి అతడు కారు దిగి పారిపోతుండగా చిన్నయ్యపాలెం వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడ్ని విచారించగా మొత్తం వివరాలను వెల్లడించాడు. ఈ కేసులో గోవిందను ఎ1గా, హత్యకు ప్రోత్సహించిన మహిళను ఎ2గా కేసు నమోదు చేసి, శనివారం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించిన సీఐ, ఎస్‌ఐ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. అనకాపల్లి ఎస్పీ గౌతమి శాలి కూడా సీఐ చంద్రశేఖరరావు బృందాన్ని అభినందించారని, వారికి త్వరలో ప్రశంసాపత్రాలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో సీఐ చంద్రశేఖరరావు, ఎస్‌ఐ సురేశ్‌ పాల్గొన్నారు. కాగా నిందితులను తమకు చూపించలేదంటూ సింహాచలం కుటుంబసభ్యులు స్టేషన్‌ బయట నిరసన వ్యక్తం చేశారు. కోర్డు నిబంధనల మేరకు వారిని చూపించకూడదని డీఎస్పీ వారికి వివరించారు. 


బాధితుల్ని పరామర్శించిన బండారు

బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ సీనియర్‌ నేత బర్నికాన సాయినాథరావు శనివారం పరామర్శించారు. డీఎసీప సునీల్‌ను కలిసి, హత్య కేసు వివరాలను తెలుసుకున్నారు. 


Updated Date - 2022-06-26T04:40:13+05:30 IST