
చిన్ననాటి కలను పంతొమ్మిదేళ్ళకే సాకారం చేసుకున్న దృఢ సంకల్పం మైత్రీ పటేల్ సొంతం. ఏడాదిన్నర శిక్షణను 11 నెలల్లోనే పూర్తి చేసి... దేశంలో అతి పిన్నవయస్కురాలైన కమర్షియల్ పైలెట్‌గా చరిత్రకెక్కింది ఈ గుజరాతీ అమ్మాయి. బోయింగ్ విమానం నడపాలనే తన తదుపరి లక్ష్యం వైపు ఆమె కొత్త ప్రయాణం మొదలెడుతోంది.
‘‘నేను పైలెట్ అవుతానని చెబుతూ ఉంటే అందరూ అదోలా చూసేవారు. ‘ఏదైనా మాట అంటే ఎదుటివాళ్ళు నమ్మేలా ఉండాలి’ అంటూ తేలిగ్గా కొట్టి పారేసేవారు కొందరు స్నేహితులు. కానీ అనుకున్నది సాధిస్తాననే నమ్మకాన్ని నేనెప్పుడూ వదులుకోలేదు. నేను విమానాన్ని మొదటిసారి చూసినప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు. ఏదో అద్భుతం కళ్ళ ముందు జరుగుతున్న అనుభూతి. వెంటనే ఆ లోహ విహంగంతో ప్రేమలో పడిపోయాను. ‘నేను పైలెట్ కావాలి’... నాకు తక్షణమే వచ్చిన ఆలోచన ఇది. ఇంటికి వెళ్ళగానే నాన్నతో ఆ మాట చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ఆయనకు కూడా ఆ ఆలోచన వచ్చిందట! కానీ ‘ఎలా కుదురుతుంది?’ అనుకున్నారట! మా ఆర్థిక పరిస్థితులే దానికి కారణం.
ప్రాణం లాంటి భూమి వదులుకున్నారు...
మాది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్. మా నాన్న కాంతీలాల్ పటేల్ వ్యవసాయదారు. అమ్మ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో ఆయాగా పని చేస్తుంది. మరింత ఆదాయం కోసం సూరత్ నుంచి ముంబయి విమానాశ్రయానికి ప్రయాణికులను నాన్న తన కారు మీద తీసుకెళ్తూ ఉండేవారు. వచ్చీ, పోయే విమానాలనూ, పైలెట్లనూ చూసి... ‘నా కూతురు కూడా పైలెట్ కావాలి. ప్రపంచమంతా విమానాల్లో తిరగాలి’ అనుకొనేవారట! ఆ సంగతి నాకు చెబుతూ... ‘‘పైలెట్ కావాలంటే బాగా చదువుకోవాలి. సైన్సు, లెక్కలు బాగా రావాలి’’ అని చెప్పారు. అప్పటికి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా. నా కోరిక తీర్చడం కోసం... భారమైనప్పటికీ అమ్మా, నాన్నా నన్ను ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పైలెట్ శిక్షణకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. ప్లస్ టూ పూర్తి చేశాక... ముంబయిలో ఆన్-గ్రౌండ్ శిక్షణలో చేరాను. దానికోసం, ఆ తరువాత అమెరికాలో కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ కోసం మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమిలో కొంత భాగాన్ని నాన్న అమ్మాల్సి వచ్చింది. ఆ భూమి నాన్నకు ప్రాణం. నా కోసం దాన్ని ఆయన వదులుకోవడం బాధగా అనిపించింది.


అది ప్రత్యేకమైన అనుభూతి
అమెరికాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ 18 నెలలు ఉంటుంది. అయితే, ఆ వ్యవధిలో ట్రైనింగ్ పూర్తి చేసేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారని మా ఇనస్ట్రక్టర్స్ చెప్పారు. కానీ, విమానాలంటే నాకున్న ఇష్టం ముందు ఏదీ కష్టంగా అనిపించలేదు. అందుకే 11 నెలల్లోనే నా శిక్షణ పూర్తి చేసుకోగలిగాను. ట్రైనింగ్ ముగిశాక, స్వయంగా విమానం నడపాల్సి ఉంటుంది. ఎవరి సాయం లేకుండా మొదటిసారి నేను విమానం నడుపుతున్నప్పుడు... నన్ను ఎంతో ప్రోత్సహించి, ఎన్నో త్యాగాలు చేసిన నా కుటుంబం లేకపోతే ఎలా? అందుకే మా వాళ్ళను అమెరికా రమ్మని పిలిచాను. నాన్న వచ్చారు. ఆయన సమక్షంలోనే... 3,500 అడుగుల ఎత్తులో విమానం నడిపాను. ఆయనలో కనిపించిన భావోద్వేగాలు, కళ్ళలో గర్వం చూశాక... నా కల నిజమయిందనిపించింది. భారతదేశంలో అతి తక్కువ వయసున్న కమర్షియల్ పైలెట్ నేనే కావడం మరింత ప్రత్యేకమైన అనుభూతి. నేను అమెరికా నుంచి మన దేశం వచ్చాక... సూరత్ విమానాశ్రయంలో నా కుటుంబ సభ్యులు, స్థానికులు స్వాగతం పలికిన తీరు, అలాగే రెండు వారాల క్రితం అప్పటి గుజరాత్ సిఎం విజయ్ రూపానీ తన కార్యాలయానికి ఆహ్వానించి, ప్రత్యేకంగా అభినందించడం, నా కెరీర్ ఆకాశమే హద్దుగా ఉండాలని ఆకాంక్షించడం నా జీవితాంతం గుర్తుంటాయి. నేను శిక్షణ తీసుకున్నది అమెరికాలో కాబట్టి... ఆ దేశంలో కమర్షియల్ విమానాలు నడపడానికి నాకు లైసెన్స్ వచ్చింది. కానీ మన దేశంలో నిబంధనల ప్రకారం ఇక్కడ ట్రైనింగ్ లైసెన్స్ తీసుకోవాలి. బోయింగ్ విమానాలు నడపాలన్నది నా ఆశ. అందుకే త్వరలోనే బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రైనింగ్‌లో చేరబోతున్నా. నా ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి నా కుటుంబం అండగా నిలబడింది. ఆడపిల్లలకు ఏ స్థాయికైనా చేరే సామర్థ్యం ఉంది. కావలసిందల్లా తల్లితండ్రుల నుంచి, సమాజం నుంచి తగిన ప్రోత్సాహం.’’