అదిగదిగో.. 21

ABN , First Publish Date - 2022-01-29T09:02:12+05:30 IST

నడాల్‌కిది ఆరో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌. అలాగే ఓ మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడనుండడం 29వసారి.

అదిగదిగో.. 21

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

 ఊరిస్తున్న రికార్డు గ్రాండ్‌స్లామ్‌

ఫైనల్లో నడాల్‌ జూ మెద్వెదెవ్‌తో అమీతుమీ


నడాల్‌కిది ఆరో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌. అలాగే ఓ మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడనుండడం 29వసారి. ఫెడరర్‌, జొకోవిచ్‌ (31) ముందున్నారు. మరొక్క అడుగు మాత్రమే.. పురుషుల టెన్ని్‌సలో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రఫెల్‌ నడాల్‌ ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉన్నాడు. ‘బిగ్‌-3’లో ఇద్దరు బరిలోకి దిగకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని స్పెయిన్‌ బుల్‌ సద్వినియోగం చేసుకుంటూ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరాడు. ఇక ప్రత్యర్థి మెద్వెదెవ్‌తో జరిగే అంతిమ సమరంలో గెలిస్తే నడాల్‌ 21 గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన ఏకైక వీరుడవుతాడు.


మెల్‌బోర్న్‌: గాయాలతో కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన నడాల్‌ నుంచి నిజంగా ఇది అద్భుత ప్రదర్శనే.. దీనికి తోడు అదృష్టం కూడా తోడై దీటైన ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో రఫెల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ్‌సలో ఇటలీకి చెందిన మటియో బెరెట్టినిపై అతడు 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో నెగ్గాడు. ఇటలీ నుంచి ఈ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచిన బెరెట్టిని నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని ఆశించినా ఒక్క సెట్‌లో మాత్రమే ప్రభావం చూపాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)తో నడాల్‌ ఢీకొంటాడు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన మెద్వెదెవ్‌ కూడా అద్భుత ఫామ్‌లో ఉండడంతో ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 2009లో నడాల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గాడు. ప్రస్తుతం నడాల్‌ 20 గ్రాండ్‌స్లామ్స్‌తో జొకోవిచ్‌, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా టాప్‌లో ఉన్నాడు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో జొకోవిచ్‌ ఈ టోర్నీకి దూరం కాగా.. ఫెడరర్‌ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. 


చివరి రెండు సెట్లలో హోరాహోరీ:

రెండు గంటల 55 నిమిషాలపాటు సాగిన తొలి సెమీ్‌సలో నడాల్‌కు ఆరంభ సెట్లలో పెద్దగా పోటీ ఎదురుకాలేదు. మొదటి సెట్‌, రెండో గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధిస్తూ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరికి 6-3తో 43 నిమిషాల్లోనే ఈ సెట్‌ను ముగించాడు. రెండో సెట్‌లో అయితే రెండు బ్రేక్‌ పాయింట్లతో ప్రత్యర్థి ఆట కట్టించాడు. కానీ మూడో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీ్‌సలను కాపాడుకోవడంతో నువ్వా నేనా అనే రీతిలో సాగింది. ఎనిమిదో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో నడాల్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బెరెట్టిని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ గెలిచాడు. ఇక నాలుగో సెట్‌ను నడాల్‌ గెలిచి మ్యాచ్‌ను ముగించినా బెరెట్టిని అంత సులువుగా లొంగలేదు. తొలి ఆరు గేమ్‌లు 3-3తో ముగిశాయి. అయితే నాలుగో గేమ్‌ను నడాల్‌ కాపాడుకుంటూ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి.. చివరి గేమ్‌ను గెలిచి సంబరాల్లో మునిగాడు.


మెద్వెదెవ్‌ అతి కష్టంగా...:

రెండో సెమీ్‌సలో మెద్వెదెవ్‌ చెమటోడ్చాడు. సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై అతడు 7-6 (7/5), 4-6, 6-4, 6-1తో గెలిచాడు. అయితే తొలి సెట్‌ను గెల్చుకునేందుకే టైబ్రేక్‌ ఆడాల్సి రాగా రెండో సెట్‌ను సిట్సిపా్‌సకు కోల్పోవాల్సి వచ్చింది. మూడో సెట్‌లోనూ మెద్వెదెవ్‌కు 4-4తో పోటీ ఎదురైంది. ఈ దశలో తన సర్వీ్‌సను కాపాడుకుని పదో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించడంతో గట్టెక్కాడు. అయితే ఆఖరి సెట్‌లో సిట్సిపాస్‌ ఒక్కసారే తన సర్వీ్‌సను కాపాడుకోవడంతో మెద్వెదెవ్‌ 6-1తో సులువుగా మ్యాచ్‌ను ముగించాడు.

Updated Date - 2022-01-29T09:02:12+05:30 IST