పరపతితో పెత్తనం!

ABN , First Publish Date - 2021-03-02T06:05:47+05:30 IST

రైతుల కోసం ఏర్పాటుచేసిన సహకార సంఘాల లక్ష్యం అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో నీరుగారుతోంది.

పరపతితో పెత్తనం!

నాదెండ్ల సంఘంలో అనధికారికంగా కొనసాగుతున్న సీఈవో

జిల్లా సహకార శాఖాధికారి ఆదేశాలు బేఖాతరు

రైతులకు అందని రుణాలు

ఒత్తిళ్లతో బాధ్యతలు చేపట్టని స్పెషల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి


నాదెండ్ల, ఫిబ్రవరి 28 : రైతుల కోసం ఏర్పాటుచేసిన సహకార సంఘాల లక్ష్యం అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో నీరుగారుతోంది. సహకార సంఘ సీఈవోగా నియామకం చట్టవ్యతిరేకమని, చెల్లదని జిల్లా సహకారశాఖాధికారి ఆదేశాలిచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ లక్షలాది రూపాయల వేతనాన్ని డ్రా చేసుకుని దర్జాగా అనధికార సీఈవో కాలం గడిపేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆఫీసర్‌ పర్సన్‌ ఇన్‌చార్జుల పాలన మొదలైనా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో నియమించిన అధికారి ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. పలు సహకార సంఘాల్లో కోట్లాదిరూపాయల రుణాలను రైతులకు అందిస్తుండగా ఈ ఏడాదిగా ఒక్క రూపాయి కూడా ఇవ్వని దుస్థితి నాదెండ్ల వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నెలకొన్నది. 

నియోజకవర్గంలోనే ప్రధమస్థానం 

సుమారు 4వేలమంది సభ్యులు.. 10 గ్రామాల రైతులకు సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రాంతంలోనే నాదెండ్ల సంఘం ప్రఽథమస్థానంలో ఉంది. మొన్నటివరకు టీడీపీ మద్దతుదారుల ఆధీనంలో ఉన్న ఈ సంఘానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 ఆగస్టు ముగ్గురు సభ్యులతో పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీని నియమించారు. నాదెండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత ఒకరు రంగంలోకి దిగా ప్రభుత్వ, అధికారుల అనుమతి కానీ తీసుకోకుండా పదేళ్లక్రితం సంఘంలో పనిచేసిన కేవీఆర్‌వీ ప్రసాద్‌ను సంఘ సీఈవోగా నియమిస్తూ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీతో తీర్మానం చేయించారు. అప్పటివరకు సీఈవోగా పనిచేస్తున్న చేకూరి ధనలక్ష్మిని సీఈవోగా తొలగించి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-2గా నియమిస్తూ తీర్మానించారు. 2020 ఏప్రిల్‌లో సీఈవోగా బాధ్యతలు తీసుకున్న ప్రసాద్‌ తాను పదేళ్లుగా సహకారసంఘంలో పనిచేసిన్నానని, గత పాలకవర్గాలు వేతనాన్ని టీఏ, డీఏను ఇవ్వాలని త్రీమెన్‌ కమిటీతో తీర్మానం చేయించి బ్యాంకును ఆశ్రయించారు. ప్రసాద్‌ చెప్పే లెక్కల ప్రకారం సుమారు రూ.40లక్షల వరకు వేతనం కింద పదేళ్లకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో సహకార బ్యాంకు సిబ్బంది నివ్వెరపోయారు. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది అతనిని ఏనాడూ చూసిన దాఖలాలు కూడా లేవు. 

ఆ అధికారం లేకుండానే..

 దీంతో ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు జిల్లా సహకార అధికారి దృష్టికి తీసుకెళ్లారు. పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీకి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించే, నియమించే అధికారం కానీ లేదని, ప్రసాద్‌ నియామకం చెల్లదని డీసీవో గత ఏడాది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై విచారణ చేయాలని డివిజనల్‌ కోఆపరేటివ్‌ రిజిస్టార్‌ను డీసీవో ఆదేశించారు.   విచారణ చేసిన అధికారిణి సంఘ రికార్డులను పరిశీలించింది. అంతేకాకుండా గత పదేళ్లలో సంఘ అధ్యక్షునిగా పనిచేసిన జీడీసీసీబీ మాజీ చైర్మన్‌ మానం వెంకటేశ్వర్లు, నల్లమోతు హరిబాబులను విచారించింది. తమ హయాంలో ప్రసాద్‌ పనిచేయలేదని వారిద్దరు లిఖితపూర్వకంగా కూడా అధికారికి వివరణ ఇచ్చారు. నాలుగు నెలల క్రితమే అధికారిణి నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు అధికారులు చేపట్టలేదు. సీఈవోగా కొనసాగుతున్న ప్రసాద్‌ నెలకు రూ.50వేల చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.4లక్షల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నాడు.  

రుణాలకూ మొండిచేయి

 ఏడాదిగా పలు సహకార సంఘాలు రైతులకు కోట్ల రూపాయలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను అందిస్తున్నాయి. అయితే ఈ సంఘంలో మాత్రం ఒక్క రూపాయి రుణం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అనధికార సీఈవోగా ప్రసాద్‌ వ్యవహరించడంతో బ్యాంకు అధికారులు కూడా రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడటంలేదు. అంతేకాకుండా పంట రుణాలను చెల్లించాలంటూ సీఈవోగా వ్యవహరిస్తున్న ప్రసాద్‌ రైతులకు నోటీసులు జారీ చేశారు. రైతులు మాత్రం రుణాలు చెల్లించేందుకు ఆసక్తి చూపడంలేదు. అనధికారికంగా కొనసాగుతున్న వ్యక్తికి సొమ్ము చెల్లిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తిపై విచారణ జరిపి తొలగించాలని రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌తోపాటు జిల్లా సహకారశాఖాధికారికి రైతులు ఫిర్యాదు చేశారు.

రాజకీయ వత్తిళ్లలోనే..

రాజకీయ ఒత్తిళ్లతో ఆఫీసర్‌పర్సన్‌ ఇన్‌ఛార్జిగా నియమితులైన అధికారి ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. గడచిన 13న బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోపాటు అనధికార  సీఈవోతో సంఘ విధులు ఎలా నిర్వహించాలి అనే అనుమానంతో ఆయన బాధ్యతలు చేపట్టలేదు.  అనధికార సీఈవోపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి డి శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2021-03-02T06:05:47+05:30 IST