నాడు-నేడు పనులకు.. రాజకీయ గ్రహణం!

ABN , First Publish Date - 2020-10-27T19:09:32+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనులకు రాజకీయ గ్రహణం..

నాడు-నేడు పనులకు.. రాజకీయ గ్రహణం!

- ముందుకు సాగని నాడు-నేడు పనులు

-  గడువు ముగిసినా నత్తనడకే

-  అర్ధాంతరంగా ఆగిన వాటితో పొంచివున్న ప్రమాదాలు

-  సమన్వయలోపం.. బెదిరింపుల పర్వం

-  హెచ్‌ఎంలకు తలపోటుగా మారుతున్న వైనం

-  నిధుల విడుదలా అంతంతే..

-  ఏడాది ఆఖరుకైనా పూర్తయ్యేనా?


అనంతపురం(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పనులు సాగుతున్నప్పటికీ.. కమిటీ రూపంలో అడ్డంకి ఏర్పడుతోంది. ఎంతో కొంత కమీషన్‌ కోసం ఆ కమిటీలోని కొందరు సభ్యులు ఒత్తిడి తెస్తుండటంతో పనులు ముందుకు సాగట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఆర్భాటంగా ప్రారంభించిన నాడు-నేడు పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమితోపాటు వివిధ శాఖల ఇంజనీర్ల మధ్య సమన్వయలోపం ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జూలై ఆఖరు నాటికి ఎంపిక చేసిన 1254 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం గడువు విధించింది. గడువు ముగిసి రెండున్నర నెలలు కావస్తున్నా.. నేటికీ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదంటే.. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతల నుంచి ఏ స్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయో అర్థమవుతోంది. ఆదిలో నాడు-నేడు పనులు చేయించే బాధ్యతను తీసుకునేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ససేమిరా అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత్యంతరం లేక బాధ్యతలను చేపట్టారు. వారు భయపడినట్లే నాడు-నేడు పనులు హెచ్‌ఎంలకు తలపోటుగా మారాయనటంలో సందేహం లేదు. ఈ క్రమంలో పనులు ఈ ఏడాది ఆఖరుకైనా పూర్తయ్యేనా అన్న సందేహాలు తలెత్తతున్నాయి.


గడువు ముగిసినా నత్తనడకే..

జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 1254 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 1207 పాఠశాలల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1168 చోట్ల మాత్రమే పనులు సాగుతున్నాయి. ఇప్పటికీ 39 పాఠశాలల్లో ప్రారంభం కాలేదు. ప్రహారీ, మరుగుదొడ్లు, సెప్టిక్‌ ట్యాంకులు, తాగునీటి ట్యాంకులు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుతోపాటు ప్యాన్‌లు, ఫర్నీచర్‌, ఇతరత్రా మౌలిక వసతులు కల్పించేందుకుగానూ రూ.326.70 కోట్లు కేటాయించారు. ఇందులో 121.83 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే నిధులు ఆ మేరకు మాత్రమే మంజూరైనట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. క్షేత్రస్థాయిలో నాడు-నేడు పనులు సాగుతున్న తీరును పరిశీలిస్తే.. ఏ ఒక్క పాఠశాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించిన దాఖలాలు దాదాపుగా లేవన్నది నిర్వివాదాంశం. అధికారుల రికార్డులు అదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో 1168 పాఠశాలల్లో నాడు-నేడు పనులు సాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటి వరకూ పైకప్పు పూర్తయినవి 212 పాఠశాలలుండగా.. వాటికి సంబంధించి సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణాలు పూర్తయినవి 818 మాత్రమే. పునాది రాళ్లకే పరిమితమైనవి 16 కాగా.. ఆ స్థాయి దాటినవి 8 పాఠశాలలు. మరుగుదొడ్లలో శానిటరీ వేర్‌ పూర్తి చేసుకున్నవి 144 పాఠశాలలున్నాయి. దీనిని బట్టి చూస్తే మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తాగునీటి పనులకు సంబంధించి 1218 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో 1203 చోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. వీటిలోనూ 33 శాతం పూర్తయినవి 53 ఉండగా.. 66 శాతం ముగిసినవి 917 ఉన్నాయి. వందశాతం పనులు పూర్తయిన పాఠశాలలు 233 ఉన్నాయి. తాగునీటి సౌకర్యం పనులు కూడా గడువులోగా పూర్తి కాలేదనటంలో సందేహం లేదు. ఇదే తరహాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యంతోపాటు ప్యానల్‌ బోర్డులు తదితరాలను 1243 పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1229 చోట్ల పనులు సాగుతున్నాయి. ఇందులో 11 పాఠశాలల్లో మాత్రమే సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 845 పాఠశాలల్లో ట్యూబ్‌లైట్లు అమర్చటంతోనే సరిపెట్టారు. మరో 373 చోట్ల ఫ్యాన్లు మాత్రమే బిగించారు. మరో 1233 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించి, ఆ తరువాత 1221 పాఠశాలలను మాత్రమే ఎంపిక చేసి, ఆ మేరకు పనులు ప్రారంభించారు. మరమ్మతుల్లోనూ పెద్దగా పురోగతి కనిపించట్లేదు. 20 పాఠశాలల్లో 33 శాతం, 887 చోట్ల 66 శాతం పనులు ముగిశాయి. 314 పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు ఎంత కాలం పడుతుందో అర్థం కావట్లేదు.


సమన్వయలోపం.. బెదిరింపుల పర్వం..

నాడు-నేడు పనులు నత్తనడకన సాగటానికి సంబంధిత శాఖల ఇంజనీర్లు, ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలోని తల్లిదండ్రుల కమిటీల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏ పని చేపట్టాలన్నా.. ఇంజనీర్లు ఒకేసారి నిర్ణయం తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి. అధికారుల పరిస్థితి అలా ఉండగా.. ప్రధానోపాధ్యాయులకు కమిటీ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఉరవకొండ నియోజకవర్గంలోని షెక్షాన్‌పల్లి ఘటన ఇందుకు అద్దం పడుతోంది. చేసిన పనుల మొత్తం కంటే అధికంగా బిల్లులు చేయాలని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా అయితే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని ఆ హెచ్‌ఎం ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసినట్లు సమాచారం. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ సిబ్బంది, ఉపాధ్యాయులకు నాడు-నేడు పనుల విషయమై ఘర్షణలు తలెత్తినట్లు సమాచారం. కమిటీ సభ్యులకు తెలియకుండా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుని, కొంత నగదు డ్రా చేసుకోవటమే వివాదానికి కారణమని తెలుస్తోంది. తాడిపత్రి, శింగనమల, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ ఇలాంటి బెదిరింపులే ప్రధానోపాధ్యాయులకు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల కమిటీలో అత్యధికులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఉండటంతోనే ఇలాంటి బెదిరింపుల ప్రక్రియ కొనసాగుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఈ పరిణామాలతోనే పనులు పూర్తికాకపోవడానికి అడ్డంకిగా మారుతున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి తోడు నాడు-నేడు పనులు ప్రధానోపాధ్యాయులకు తలపోటుగా మారాయనటంలో సందేహం లేదు.


ఆగిన పనులతో పొంచివున్న ప్రమాదం

కరోనా నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కాకపోవటంతో జూలై ఆఖరు నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ పనులకు కమిటీల రూపంలో రాజకీయ గ్రహణం పట్టుకోవటంతో గడువు పూర్తయి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే అర్ధాంతరంగా ఆగిపోయాయి. సెప్టిక్‌, తాగునీటి ట్యాంకుల పనులు ప్రారంభమైనా మధ్యలోనే నిలిచిపోయాయి. వాటి నిర్మాణానికి ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలను అలాగే వదిలేశారు. దీనికితోడు వాటర్‌, సెప్టిక్‌ ట్యాంకు గుంతల్లో నీరు చేరుతోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు. వచ్చే నెలలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంటే పక్షం రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభమైతే విద్యార్థులకు ఆగిన పనులతో ప్రమాదం పొంచి ఉందనటంలో సందేహం లేదు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం ఎస్‌.రాయాపురంలోని పాఠశాలలో నీటి తొట్టె నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఆ తొట్టె నిర్మాణానికి వాడిన ఇనుప కడ్డీలను అలాగే వదిలేశారు. ఇలా అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిని బట్టి చూస్తే.. విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందనటంలో అతిశయోక్తి లేదు.


అవసరం లేని పనులకు ప్రాధాన్యత

యాడికి మండలం రాయలచెరువు ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వకుండా ఆవరణలో టైల్స్‌ పరచటం విమర్శలకు తావిస్తోంది. యల్లనూరులోని కోట వీధిలో ఉన్న పాఠశాలలో మరుగుదొడ్లున్నా.. రూ.6.80 లక్షలతో మరో రెండు ఏర్పాటు చేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. పెద్దవడుగూరు మండలంలో విద్యుత్‌ సరఫరా కోసం వినియోగిస్తున్న పరికరాలు ప్రముఖ కంపెనీలకు సంబంధించినవి వాడాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. నాసిరకం వాటిని వాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం పొలికి ఎంపీయూపీ పాఠశాలలో ప్రహరీకి పాత రాళ్లను వినియోగించి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అదే మండలంలోని గడేకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు బండపరుపు బాగున్నా.. తొలగించి, వాటి స్థానంలో కొత్తగా వేసి, అనవసరంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇలా నాడు-నేడు పనుల్లో ప్రాధాన్యత అంశాల కంటే.. అనవసరపు పనులకే నిధులు వెచ్చిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.


Updated Date - 2020-10-27T19:09:32+05:30 IST