నాడు-నేడు పనులు నాసిరకం

ABN , First Publish Date - 2021-07-26T06:07:34+05:30 IST

‘మనబడి నాడు-నేడు’ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన ఆశ్రమాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చేపట్టిన వివిధ రకాల పనుల్లో నాణ్యతా లోపాలు అధికంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

నాడు-నేడు పనులు నాసిరకం
చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పరిస్థితి...

పెట్టిన ఖర్చుకు, చేసిన పనులకు 

పొంతన లేదని ఫిర్యాదులు

నాణ్యతలేని సామగ్రి వినియోగం

కొన్ని మండలాల్లో ఇంజనీర్ల ఇష్టారాజ్యం 

అధికార పార్టీ నేతల అండదండలు

ప్రశ్నించే ధైర్యం చేయలేని స్థితిలో ప్రధానోపాధ్యాయులు

కేజీబీవీలు, ఏజెన్సీ పాఠశాలల్లో పనులు మరింత అధ్వానం

పనులను పరిశీలించి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ అరుణ్‌బాబు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘మనబడి నాడు-నేడు’ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన ఆశ్రమాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చేపట్టిన వివిధ రకాల పనుల్లో నాణ్యతా లోపాలు అధికంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పెట్టిన ఖర్చుకు, చేసిన పనులకు మధ్య ఎక్కడా పొంతన లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర క్రితం చేపట్టిన నాడు-నేడు పనులు ముగింపుదశకు చేరుకున్న సమయంలో పలుచోట్ల పనుల నాణ్యత లేదన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఏజెన్సీలోని  పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో నాడు-నేడు పనులను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ ఫిర్యాదులకు మరింత బలం చేకూరుస్తున్నది.

ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, వివిధ సంక్షేమ శాఖల పరిఽధిలోని గురుకుల/ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన బడి నాడు-నేడు’ పేరుతో గత ఏడాది పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిదశలో జిల్లాలో 1,130 పాఠశాలల్లో రూ.302 కోట్లతో 8,485 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 8,261 (97శాతం) పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా తొలిదశ పనులు గత ఏడాది డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలి. అయితే అనేక కారణాలతో గడువు పెంచుతూ చివరకు ఈ ఏడాది ఆగస్టు 15వతేదీనాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. మరో 20 రోజుల్లో పనులు పూర్తికావాల్సి వుండగా... ఇంకా పలుచోట్ల పనులు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అనేకచోట్ల చేపట్టిన పనుల్లో నాణ్యతలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీల మధ్య సమన్వయం, అవగాహన ఉన్న గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి పనులు సవ్యంగానే సాగాయి. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి, స్థానిక వైసీపీ నేతలే పనులు చేపట్టారు. మరికొన్నిచోట్ల హెచ్‌ఎం, పాఠశాల కమిటీ మధ్య విభేదాలు వచ్చి.... పనులను అధికార పార్టీ నేతలకు అప్పగించారు. ఇటువంటిచోట్ల పనులు నాసిరకంగా జరిగాయని, నాణ్యతలేని సామగ్రిని వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని మండలాల్లో ఇంజనీర్ల ఏకఛత్రాధిపత్యంతో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఒక మండలంలో ఇంజనీరు అంతా తానై అటు హెచ్‌ఎంలు, ఇటు పాఠశాల కమిటీలను బెదిరించి పనులు చేపట్టారు. అధికార పార్టీ నేతల ఆశీస్సులు వుండడంతో ఇతనిని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అనకాపల్లి, కశింకోట మండలాల్లోని పలు పాఠశాలల్లో ఫ్లోరింగ్‌కు వినియోగించిన గ్రానైట్‌ పలకలు, టైల్స్‌ నాణ్యత లేవని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపించడం గమనార్హం. ఈ విషయాన్ని డీఆర్‌సీ సమావేశంలో ఉన్నతాధికారులు సైతం అంగీకరించారు. కానీ తరువాత ఏమైందోగానీ హెచ్‌ఎంలపై చర్యలను ఉపసంహరించుకున్నారు. 

ఏజెన్సీలో నాడు-నేడు పనులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అనేకచోట్ల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో శనివారం జాయింట్‌ కలెక్టర్‌అరుణ్‌బాబు పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో పర్యటించి కొన్నిచోట్ల నాడు-నేడు పనులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పెదబయలు కేజీబీవీలో పనులు నాసిరకంగా జరిగినట్టు గుర్తించారు. బాలికల ఆశ్రమ పాఠశాల, ముంచంగిపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనులపైనా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా జిల్లాస్థాయి అధికారులు పలువురు ఎస్‌.రాయవరం మండలం డీసీహెచ్‌ అగ్రహారం ఉన్నత పాఠశాలలో పనులను స్వయంగా పరిశీలించి, సక్రమంగా జరగలేదని నిర్ధారించారు. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిధుల ఖర్చుకు, చేసిన పనులకు మధ్య పొంతనలేదని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.  రంగులు వేయడంతో పాఠశాల భవనం సుందరంగా కనిపిస్తున్నా... లోపల మాత్రం ఆ స్థాయిలో పనులు జరగలేదని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరో 20 రోజుల్లో పనులు ముగించాలి. కానీ అక్కడ మాత్రం ఇప్పట్లో పూర్తికావని స్పష్టమైంది. 

జిల్లాలో పలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించిందని స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. కరోనా ప్రభావంతో పనుల పరిశీలన, తనిఖీలు, పర్యవేక్షణ కొరవడడంతో నాణ్యతను గాలికొదిలేశారని, తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. భవనాలు కొత్తగా కనిపించడానికి బయట గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేశారని, లోపల చేసిన పనుల్లో మాత్రం నాణ్యత లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు ప్రతి పాఠశాలలో పనులన్నింటినీ పరిశీలిస్తే నాణ్యత లోపం వెల్లడవుతుందని చెబుతున్నారు. 

Updated Date - 2021-07-26T06:07:34+05:30 IST