
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్న చిత్రానికి 'వరుడు కావలెను' అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఎయిట్ ప్యాక్ బాడీతో చొక్కా విప్పి, విల్లు ఎక్కిపెట్టి అదిరిపోయే లెవల్లో దర్శనమిచ్చిన చిత్రానికి 'లక్ష్య' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై.. నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నాగశౌర్య బర్త్‌డేని పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న మరో చిత్ర టైటిల్‌ను ప్రకటించారు.
జనవరి 22 నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి దర్శకనిర్మాతలు అప్డేట్స్ని తెలియజేస్తున్నారు. 'వరుడు కావలెను', 'లక్ష్య'.. చిత్రాల నుంచి అప్డేట్స్ రాబోతోన్నట్లుగా ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఆయన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నటిస్తున్న చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. 'పోలీసు వారి హెచ్చరిక' అనే ఆసక్తికర టైటిల్‌తో చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె.పి. రాజేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. నిర్మాత మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.