నాగాలాండ్‌ను ‘డిస్టర్బ్‌డ్ ఏరియా’.. మరో 6నెలలు AFSPA: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-30T22:06:46+05:30 IST

డిసెంబర్ 4న మోన్ జిల్లాలో జరిగిన జవాన్ల కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పొడగింపుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ స్పందిస్తూ..

నాగాలాండ్‌ను ‘డిస్టర్బ్‌డ్ ఏరియా’.. మరో 6నెలలు AFSPA: కేంద్రం

గుహవాటి: ఒకవైపు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల (ఏఎఫ్ఎస్‌పీఏ) చట్టాన్ని రద్దు చేయాలని నాగాలాండ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. వీటికి అనుగుణంగా ఈ చట్టాన్ని రాష్ట్రం నుంచి తీసివేయాలని నాగాలాండ్ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అయితే నాగాలాండ్‌లో మరో ఆరు నెలల పాటు ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో అస్ఫా చట్టం కొనసాగింపుపై వేసిన ప్రత్యేక కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.


డిసెంబర్ 4న మోన్ జిల్లాలో జరిగిన జవాన్ల కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పొడగింపుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ స్పందిస్తూ ‘‘నాగాలాండ్ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ప్రమాదకరంగా ఉన్నాయి. వీటిని అదుపులో ఉండాలంటే పౌర హక్కులతో పాటు సైనికులకు సైతం హక్కులు కావాలి. అందుకే నాగాలాండ్‌ను ‘‘డిస్టర్బ్‌డ్ ఏరియా’ ఏరియాగా ప్రకటించి మరో ఆరు నెలలు ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని పేర్కొంది.


వాస్తవానికి నాగాలాండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అస్ఫా చట్టం ఈ నెల 31తో ముగుస్తుంది. ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని ఆయా రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతనే అక్కడ అమలు చేస్తారు. ఒకసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే గరిష్టంగా ఆరు నెలల వరకు కొనసాగుతుంది. ఒకవేళ అవసరమని అనిపిస్తే మళ్లీ ఆరు నెలల తర్వాత విధిస్తారు. ఇలా ఎన్నిసార్లు అయినా విధించవచ్చు.

Updated Date - 2021-12-30T22:06:46+05:30 IST