ఈ టేబుల్‌ ముందు కూర్చుంటే.. తినడం మర్చిపోతారు!

ABN , First Publish Date - 2020-09-28T15:32:04+05:30 IST

ఎక్కడైనా డైనింగ్ టేబుల్‌ను దేనికి ఉపయోగిస్తారు? అంతమాత్రం తెలీదా? చక్కగా కూర్చొని భోజనం చేయడానికి అని టక్కున సమాధానం చెప్పేస్తాం.

ఈ టేబుల్‌ ముందు కూర్చుంటే.. తినడం మర్చిపోతారు!

కోహిమ: ఎక్కడైనా డైనింగ్ టేబుల్‌ను దేనికి ఉపయోగిస్తారు? అంతమాత్రం తెలీదా? చక్కగా కూర్చొని భోజనం చేయడానికి అని టక్కున సమాధానం చెప్పేస్తాం. ఇలా ప్రతిరోజూ భోజనం చేసే డైనింగ్‌ టేబుల్‌ను సాదాసీదాగా ఎందుకు తయారుచేయాలి? అనిపించిందో కళాకారుడికి. మామూలు వ్యక్తయితే ఆలోచించి ఊరుకునే వాడేమోగానీ, ఈ కళాకారుడు అలా కూర్చోలేకపోయాడు. ఏడాదిపాటు కష్టపడి ఓ అందమైన గ్రామాన్ని సృష్టించాడు. దాని ముందు కూర్చొని శుభ్రంగా భోజనం చేశాడు. అప్పుడు గానీ అతని ఆకలి తీరలేదు మరి.


నాగాలాండ్‌కు చెందిన నింగ్వాన్ జింగాయ్ ఈ మినియేచర్‌ విలేజ్ టేబుల్‌ తయారు చేశాడు. చెక్కతో చేసిన ఈ డైనింగ్‌ టేబుల్‌లో జలపాతాలు, చెరువులు, ఇళ్లు, వంతెనలు, మనుషులు అన్నీ ఉన్నాయి. దీన్ని చూడగానే ఓ ముచ్చటైన గ్రామం అనిపిస్తుంది. దీనిపై నింగ్వాన్ ఓ అద్దాన్ని అమర్చాడు. దీంతో టేబుల్‌ వద్ద కూర్చున్న వారికి ఈ గ్రామం చక్కగా కనిపిస్తూ కనువిందు చేస్తుంది.


ఈ టేబుల్ తయారీలో సిమెంటు, ఇసుక, మట్టి కూడా వాడినట్లు నింగ్వాన్ వెల్లడించాడు. అతని పనితనం చూసిన స్థానికులు కూడా ఈ టేబుల్‌ను చూసి మెచ్చుకుంటున్నారు. ఇలా అభినందనలు అందుకోవడం చాలా సంతోషాన్నిస్తుందన్న నింగ్వాన్.. తనకు చాలా ఆనందంగా ఉందని, తన కళకు గుర్తింపు లభించినట్లు అనిపిస్తోందని హర్షంవ్యక్తంచేశాడు.


నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో నింగ్వాన్ నివశిస్తున్నాడు. అతను చేసిన ఈ మినియేచర్ విలేజ్‌ టేబుల్‌లోని గ్రామం ఎంతో సహజంగా ఉండటంతో, దాన్ని చూస్తూ ఆహారం తీసుకోవడం మర్చిపోతామని స్థానికులు అంటున్నారు. ఇది చేయడానికి నింగ్వాన్ చాలా కష్టపడ్డాడని, అందుకే ఈ టేబుల్ ఇంత అందంగా ఉందని నింగ్వాన్‌ పనితనాన్ని మెచ్చుకున్నారు. టేబుల్‌లోని చిన్ని జలపాతం చప్పుళ్లు, ప్రశాంతమైన చెరువు, ఇళ్లు, వంతెనలు వంటివి చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని కొనియాడారు.


మన చూపులను ఇట్టే కట్టిపడేసే ఈ మినియేచర్ టేబుల్‌ తయారు చేయడానికి ఏడాది పాటు చెమటోడ్చినట్లు నింగ్వాన్ చెప్పాడు. అంతేకాదు ఈ మాస్టర్ పీస్ రెడీ చేయడం కోసం రూ.1.70లక్షల వరకూ ఖర్చు చేసినట్లు వివరించాడు. ప్రస్తుతం ఈ టేబుల్ నింగ్వాన్ ఇంటి వరండాలో ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు కూడా ఈ టేబుల్‌ చూడటం కోసం ఇప్పుడు దిమాపూర్‌ వస్తున్నారంటే ఇది ఎంత అందంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

Updated Date - 2020-09-28T15:32:04+05:30 IST