ఊపిరి పోస్తోంది

ABN , First Publish Date - 2021-05-15T06:21:20+05:30 IST

ఏర్పేడు మండలం నాగంపల్లె వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆక్సిజన్‌ ప్లాంట్‌ కరోనా బాధితులకు అండగా నిలుస్తోంది.

ఊపిరి పోస్తోంది
సిలిండర్లలో ఆక్సిజన్‌ నింపుతున్న కార్మికులు

కరోనా బాధితులకు అండగా శ్రీకృష్ణ ఆక్సిజన్‌ ప్లాంట్‌


ఏర్పేడు, మే 14: కరోనా మహమ్మారి బారినపడిన బాధితుల తిప్పలు అన్నీఇన్నీ కావు. శ్వాస పీల్చుకోవడం కష్టమై ఆక్సిజన్‌ అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు సకాలంలో ప్రాణవాయువును అందించి ఊపిరి పోసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిలో ఏర్పేడు మండలం వెంకటగిరి మార్గంలోని నాగంపల్లె వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు 2వేల ఆక్సిజన్‌ సిలిండర్లను పలుప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 

 సకాలంలో ఆక్సిజన్‌ అందకే అధికశాతం కొవిడ్‌ బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఫిల్లింగ్‌ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ద్వారా నిత్యం అధిక సిలిండర్ల సరఫరాకు అధికారులు సహకారం అందిస్తున్నారు. కాగా, నాగంపల్లె వద్ద ఉన్న ఫిల్లింగ్‌ స్టేషన్‌ ద్వారా గతంలో తిరుపతి రుయాస్పత్రి, ఎస్వీ ఆయుర్వేదిక్‌, ఈఎ్‌సఐ, స్విమ్స్‌ తదితర ఆస్పత్రులు, పారిశ్రామిక సంస్థలకు 300 వరకు ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా జరిగేది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఇక్కడి నుంచి జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు రోజుకు వంద వంతున సిలిండర్లు అందజేస్తున్నారు. వీటిలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి కూడా ఒకటి. దీంతో గతంలో ఇక్కడ రోజుకు 300 ఆక్సిజన్‌ సిలిండర్లు ఫిల్లింగ్‌ చేస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య రెండు వేల వరకు చేరింది. ఆ మేరకు.. కొవిడ్‌కు ముందు వైజాగ్‌ నుంచి నెలకు 40 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా అవుతుండగా, ఇప్పుడు ప్రతినెలా 120 టన్నులు దిగుమతి అవుతోంది. ఇందుకు అనుగుణంగా మూడుషిప్టుల్లో కార్మికులు పనిచేసేలా శ్రీకృష్ణ యాజమాన్యం కృషి చేస్తోంది.కొవిడ్‌ బాధితుల ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర వహిస్తున్న శ్రీకృష్ణ ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ తమప్రాంతంలో ఉండటంపై సమీప గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ బాధితుల ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర వహించడంతో తమ ప్లాంట్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీకృష్ణ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ ఎండీ వేణుగోపాల్‌ నాయుడు పేర్కొన్నారు. 



Updated Date - 2021-05-15T06:21:20+05:30 IST