Nagapattinam: వేలాంకన్ని ఉత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-08-30T14:27:24+05:30 IST

రాష్ట్రంలో వేలాంకన్ని మేరీమాత కొలువుదీరిన నాగపట్టణం, స్థానిక బీసెంట్‌నగర్‌లో సోమవారం సాయంత్రం పతాకావిష్కరణతో వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Nagapattinam: వేలాంకన్ని ఉత్సవాలకు శ్రీకారం

                          - నాగపట్టణం, బీసెంట్‌నగర్‌లకు పోటెత్తిన భక్తులు


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 29: రాష్ట్రంలో వేలాంకన్ని మేరీమాత కొలువుదీరిన నాగపట్టణం, స్థానిక బీసెంట్‌నగర్‌లో సోమవారం సాయంత్రం పతాకావిష్కరణతో వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు నెల 8వ తేది వరకు పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో.. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. నాగపట్టణం(Nagapattinam) జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన వేలాంకన్ని పుణ్యక్షేత్రంలో రద్దీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ జవహర్‌ నేతృత్వంలో 2 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ కారణంగా గత రెండేళ్లు వేలాంకన్ని మేరీమాత దివ్యక్షేత్రాల్లో భక్తులు లేకుండా ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే నిర్వహించారు. ఈ ఏడాది సోమవారం సాయంత్రం 5.45 గంటలకు తంజావూరు బిషప్‌ ఆంబ్రోస్‌, నాగపట్టణం వేలాంకన్ని చర్చి ఫాదర్‌ ప్రభాకరన్‌ సమక్షంలో వేలాంకన్ని మేరీమాత రూపంలో రూపొందించిన పతాకాన్ని పురవీధుల్లో ఊరేగించి, సాయంత్రం 6 గంటలకు జెండా స్తంభంపై వేలాంకన్ని జాలర్ల పంచాయతీ పెద్దలు ఎగురవేశారు. అదేవిధంగా బీసెంట్‌నగర్‌(Besantnagar)లో క్రైస్తవ మతగురువులు జెండా ఎగురవేసి లాంఛనంగా పదిరోజుల వార్షికోత్సవాలు ప్రారంభించారు. ఈ రెండు ప్రాంతాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్ణాటక, కేరళ(Telangana, Karnataka, Kerala) రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పతాకావిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, మాలధారణ చేసిన భక్తులు పదిరోజుల క్రితమే పాదయాత్రగా నాగపట్టణం చేరుకోగా, చెన్నై, పరిసర ప్రాంతాల భక్తులు సోమవారం ఉదయం నుంచే పాదయాత్రగా బీసెంట్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధానాంశమైన రథోత్సవం సెప్టెంబరు 7వ తేది సాయంత్రం 5.15 గంటలకు జరుగనుంది. 8వ తేది ఉదయం 6 గంటలకు వేలాంకన్ని మేరీమాత జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్ధం ప్రభుత్వ రవాణా సంస్థల ఆధ్వర్యంలో నాగపట్టణం, వేలాంకన్ని ప్రాంతాలకు 700 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దక్షిణ రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రధానంగా బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ ఆలయాలకు వెళ్లే భక్తులు సముద్రంలో దిగి స్నానాలు చేసేందుకు పోలీసు శాఖ నిబంధనలు విధించింది. గజ ఈతగాళ్ల సమక్షంలో నిర్ణీత ప్రాంతంలో స్నానాలకు అనుమతించింది.

Updated Date - 2022-08-30T14:27:24+05:30 IST