NV Ramana doctorate: జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం

ABN , First Publish Date - 2022-08-20T21:25:10+05:30 IST

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) 37, 38వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.

NV Ramana doctorate: జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) 37, 38వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana)కు వర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చడానికి విద్యకు మించిన ఆయుధం లేదన్నారు. 16 ఏళ్ల లోపు అందరికీ నిర్బంధ విద్య అమలు చేయాలని చెప్పారు. హిస్టరీ, ఆర్థికశాస్త్రం, హ్యూమనిటీ సబ్జెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం ఉందని పేర్కొన్నారు. దేశ సమస్యలపై యూనివర్సిటీలు దృష్టి పెట్టాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లా కోర్సు ప్రథమ బ్యాచ్‌ విద్యార్థి జస్టిస్‌ ఎన్వీ రమణ. నేడు ఆయన దేశంలోనే అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్షరాలు దిద్దిన ప్రాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. వర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఎక్కడైతే లా కోర్సు చదివారో అక్కడే ఆయన గౌరవ డాక్టరేట్‌ని అందుకున్నారు. జస్టిస్‌ రమణ ఆగస్టు 27వ తేదీ 1957లో కృష్ణా జిల్లాలోని పొన్నవరంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. సైన్స్‌, లా కోర్సుల్లో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తన కుటుంబంలో తొలితరం న్యాయవాది అయ్యారు. 


బార్‌ కౌన్సిల్‌లో 1983 ఫిబ్రవరి 10న నమోదై ఏపీ హైకోర్టు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌, సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేశారు. భారతీయ రైల్వేలు వంటి ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సెల్‌గా వ్యవహరించారు. అలానే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. సివిల్‌, క్రిమినల్‌ విభాగాల్లో జస్టిస్‌ ఎన్‌వీ రమణ నిష్ణాతులుగా ఉన్నారు. రాజ్యాంగం, కార్మికుల హక్కులు, సర్వీసు, అంతరాష్ట్ర జల వివాదాలు, ఎన్నికలు తదితర అంశాలపై కోర్టుల్లో కేసులు వేసి వాదించారు. 2000 జూన్‌ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం పొందారు. ఆ తర్వాత స్వల్పకాలం 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. 

Updated Date - 2022-08-20T21:25:10+05:30 IST