జాతరపై రాజకీయం..!

ABN , First Publish Date - 2021-12-03T05:19:13+05:30 IST

మండలంలోని నాగసముద్రం గ్రామంలో ముత్యాలమ్మ జాతర వివాదం పోలీసుల ఆంక్షలతో రోజురోజుకు ముదురుతోంది.

జాతరపై రాజకీయం..!

నాగసముద్రంలో కిరికిరి

7ననిర్వహణకు ఏర్పాట్లు చేసిన టీడీపీ వర్గీయులు

జరపడానికి వీలులేదని పోలీసుల ఆంక్షలు

వైసీపీ నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

అధికారిక కార్యక్రమం ఉన్నందునే వాయిదా వేసుకోమన్నాం : సీఐ

నేటి నుంచి 144 సెక్షన అమలు

చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 2: మండలంలోని నాగసముద్రం గ్రామంలో ముత్యాలమ్మ జాతర వివాదం పోలీసుల ఆంక్షలతో రోజురోజుకు ముదురుతోంది. జాతర నిర్వహణకు గ్రామంలోని టీడీపీ వర్గీయులు ఏర్పాట్లు చేసుకోగా..  జాతర జరుపుకోవడానికి వీలులేదని పోలీసులు ఆంక్షలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో  పోలీసులకు ఆ వర్గీయులకు మధ్య వివాదం సాగుతున్నట్టుగా సమాచారం. గ్రామ సమీపంలోని చెరువుకట్టపై వెలసిన ముత్యాలమ్మకు ఈనెల 7వ తేదీన జాతర నిర్వహించాలని గ్రామంలోని ఓ వర్గం తలపెట్టింది. ఈ క్రమంలో జాతరకు కావాల్సిన ఏర్పాట్లను సైతం పూర్తి చేసుకున్నట్టు గ్రామస్థుల ద్వారా తెలిసింది. ఈ గ్రామంలో వైసీపీ వర్గీయులు దాదాపు 20 రోజుల కిందటే అమ్మవారి జాతరను నిర్వహించుకున్నారు. తాజాగా టీడీపీ వర్గీయులు 7వ తేదీన  అమ్మవారికి జ్యోతులు, బోనాలు నిర్వహించాలని సన్నాహాలు చేసుకున్నారు. అయితే పోలీసులు 7వ తేదీ జాతర జరుపుకోవడానికి వీలులేదని ఆంక్షలు జారీ చేసినట్టు సమాచారం. వారే దగ్గరుండి దండోరా వేయించినట్టు తెలిసింది. దీనిపైన టీడీపీ వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఆనవాయితీగా తాము జాతర నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి నిలిపివేయాలంటూ హుకుం జారీ చేయడం ఎంతవరకు సబమని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం,  మరొకరికి ఇంకో న్యాయమా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న  కొందరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు దురుద్దేశంతో పోలీసుల ద్వారా తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కారణమని అడిగితే 7వ తేదీన వెల్దుర్తి చిత్రావతి నదిలో అధికారిక కార్యక్రమం ఉన్నందున జాతరను నిలుపుదల చేసుకోవాలని, తరువాత చూద్దామని పోలీసులు పేర్కొనడం భావ్యంగా లేదన్నారు. అందరికి సమన్యాయం చేయాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని అనవసర ఇబ్బందులను కల్గిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై  రామగిరి సీఐ చిన్నగౌ్‌సను వివరణ కోరగా జాతరను నిర్వహించుకోవద్దని చెప్పలేదని,  కేవలం వాయిదా వేసుకోమని చెప్పామన్నారు. 7వ తేదీన వెల్దుర్తి వద్ద పెద్దఎత్తున అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందుకే తాత్కాలికంగా వాయిదా వేసుకోమని చెప్పామన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత తామే గ్రామంలోకి వచ్చి ఇరువర్గాలతో చర్చించి జాతరను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని కూడా గ్రామస్థులకు వివరించినట్టు సీఐ తెలిపారు. శుక్రవారం నుంచి నాగసముద్రంలో 144 సెక్షన కూడా అమలు చేస్తున్నామన్నారు. 


Updated Date - 2021-12-03T05:19:13+05:30 IST