
ఆంధ్రజ్యోతి(12-04-2022)
కాలి గోళ్లు పచ్చబడి, తేలికగా విరిగిపోతుంటే నెయిల్ ఫంగస్‌గా భావించాలి. నిర్లక్ష్యం చేస్తే, ఫంగస్ గోరు మొత్తం వ్యాపించి, పూర్తి గోరును కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఈ చిట్కాతో గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్: 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న సొల్యూషన్ ఎంచుకోవాలి. సమ పాళ్లలో హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్‌లో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పాదాలను 30 నిమిషాల పాటు ముంచి ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడవాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చినా, ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకూ కొనసాగించాలి. ఫంగస్ అంత తేలికగా వదలదు కాబట్టి, కొంత ఓర్పుతో ఈ చిట్కాను కొనసాగించాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నీళ్లలో కలపడం వల్ల నీటిలోని ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. ఇలా పెరిగిన ఆక్సిజన్‌తో గోళ్లలోని ఫంగస్ చనిపోతుంది.
వెనిగర్: హైడ్రోజన్ పెరాక్సైడ్, వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పది నిమిషాల పాటు పాదాలను ఉంచి, పొడిగా తుడిచేయాలి. పైన చెప్పిన విధంగానే ఫంగస్ తగ్గినా మరికొద్ది రోజులు కొనసాగించాలి. వెనిగర్, నీళ్లను సమపాళ్లలో తీసుకుని కూడా పాదాలను నానబెట్టవచ్చు.
బేకింగ్ సోడా: అర కప్పు బేకింగ్ సోడా, ఒక కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్, నాలుగు కప్పుల గోరువెచ్చని నీళ్లు కలిపి, ఈ నీళ్లలో పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత తడి లేకుండా తుడిచేయాలి. ఫంగస్ పూర్తిగా వదిలేవరకూ ప్రతి రోజూ ఈ చిట్కాను కొనసాగించాలి.