
ఆంధ్రజ్యోతి(28-09-2021)
కొన్ని నలతల సూచనలు గోళ్ల ద్వారా బయల్పడుతూ ఉంటాయి. గోళ్ల దృఢత్వం, వాటిపై ఏర్పడే పగుళ్లు లాంటి లక్షణాలు అంతర్లీన అనారోగ్యానికి సూచనలు.
తేలికగా విరిగిపోతుంటే: గోళ్లు చిన్న తాకిడికే తేలికగా విరిగిపోతుంటే, విటమిన్ ఎ, సిలు లోపించాయని అర్థం. హపోథైరాయిడిజం తలెత్తినా గోళ్లు ఇలా బలహీనపడతాయి. కాబట్టి లోపాలను సరిదిద్దుకోవాలి.
గుంతలు: గోళ్ల మీద గుంతలు ఏర్పడితే సోరియాసిస్ లేదా అలోపేసియా ఏరేటా ఉన్నట్టు అనుమానించాలి.
పసుపుపచ్చని గోళ్లు: మధుమేహం, హైపోథైరాయిడిజం, సోరియాసిస్‌కు సూచనలు. పసుపుపచ్చ రంగుతో, గోళ్లు మందంగా మారితే గోటి ఫంగస్‌గా భావించాలి.
నిలువు గాడులు: పెరిగే వయసుతో ఇలాంటి గీతలు గోళ్ల మీద ఏర్పడడం సహజం. అయితే ఈ గీతలు రక్తహీనతకు కూడా సూచనలే!
అడ్డు గాడులు: జింక్ లోపం తలెత్తితే గోళ్ల మీద ఈ రకం గాడులు ఏర్పడతాయి. మూత్రపిండాల సమస్యలకు కూడా ఇవే సంకేతాలు.
ముదురు రంగు గీతలు: రక్తనాళాల పగుళ్లకు ఇవి సూచనలు. ఎండోకార్డైటిస్ అనే గుండె సమస్యలో కూడా ఇలాంటి గీతలు గోళ్ల మీద ఏర్పడతాయి.